రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Dec 21 , 2025 | 12:11 AM
జనవరి మాసంలో నిర్వహించే జాతీయ రహదారి భద్రతా మాస ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ అర్బన్, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): జనవరి మాసంలో నిర్వహించే జాతీయ రహదారి భద్రతా మాస ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాలపై రవాణా, ఆర్‌అండ్‌బీ, వైద్యశాఖ, ఆర్టీసీ, ఎక్సైజ్, పోలీస్ విద్యాశాఖ, తదితర అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రోడ్లు భవనాల శాఖ అధికారులు నోడల్ ఆఫీసర్లుగా ఉంటూ మాస ఉత్సవాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ఆర్‌అండ్‌బీ, పోలీస్ అధికారులు సమన్వయంతో నగరంతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న చోట్లను గుర్తించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఆర్టీసీ ఆర్‌ఎం రాజు, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పురుషోత్తం, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.
- రోడ్డు ప్రమాదాలను తగ్గించాలి
రోడ్డు ప్రమాదాలను పూర్తిగా తగ్గించి మరణాల రేటును నివారించడమే లక్ష్యంగా జనవరిలో నిర్వహించే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యాచరణపై ఆయన శనివారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రమాదాలను నివారించడానికి నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఏర్పడిన రోడ్ సేఫ్టీ కమిటీల సమావేశాలను ఈ నెలాఖరులోపు ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి, డైవ్రింగ్ లైసెన్స్ పొందిన ప్రతివారికి రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు.