పాలనలో పారదర్శకత కోసమే సమాచార హక్కు చట్టం
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:32 PM
ప్రభుత్వ శాఖల్లో పారదర్శకమైన పాలన అందించేందుకే సమాచార హక్కు చట్టం రూపొందించారని అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్ అన్నారు.
- అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్
కరీంనగర్ టౌన్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల్లో పారదర్శకమైన పాలన అందించేందుకే సమాచార హక్కు చట్టం రూపొందించారని అడిషనల్ కలెక్టర్ లక్ష్మికిరణ్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం-25 అమలులోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ 2005లో సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిందని, దీనితో పాలనలో పారదర్శకత పెరిగిందని చెప్పారు. జవాబుదారితనం, పారదర్శకంగా పనిచేసేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు కోరే సమాచారాన్ని అందించడంలో పీఐవో, ఏపీవోల బాధ్యత కలిగి ఉంటారన్నారు. వారు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలు కోరిన సమాచారం అందించాలని సూచించారు. సమాచార హక్కు చట్టం-2005లోని అంశాలు, ఆర్టీఐ దరఖాస్తు విధానం, దరఖాస్తుల స్వీకరణ, దరఖాస్తు ఫీజు, ఇవ్వాల్సిన సమాచారం, పీఐవో, ఏపీఐవోల బాధ్యతలు, తదితర అంశాలపై సమాచారహక్కు చట్టం రిసోర్స్ పర్సన్ జి కిషన్ వివరించారు. అనంతరం సమాచార హక్కు చట్టాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని జిల్లా అధికారులు, పీఐవోలు, ఏపీఐవోలతో ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్‌ప్రకాశ్, ఏవో సుధాకర్, కరీంనగర్ ప్రాంతీయ శిక్షణ కేంద్రం కో ఆర్డినేటర్ రాంబాబు, ఈడీఎం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.