వరి రైతు విలవిల
ABN , Publish Date - Sep 15 , 2025 | 12:47 AM
వానాకాలం సాగులో రైతులకు అవస్థలు తప్పడం లేదు.
- కంకినల్లి, దోమ, ఆకు ఎండు తెగుళ్లతో ఇబ్బందులు
- మందుల పిచికారితో ఆర్థిక భారం
హుజూరాబాద్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వానాకాలం సాగులో రైతులకు అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికే యూరియా బస్తాల కోసం రైతులు దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే సమయంలో వరికి తెగుళ్లు సోకడంతో లబోదిబోమంటున్నారు. 15 రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కంకినల్లి, దోమ, ఆకు ఎండుతెగుళ్లు సోకి వరి కర్ర లు ఎర్రబారిపోతున్నాయి. డివిజన్‌లో హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్, శంకరపట్నం మండలాలున్నాయి. 1.2 లక్షల ఎకరాల్లో సాగు భూమి ఉండగా, 80 వేల ఎకరాల్లో వరి, 20 వేల ఎకరాల్లో పత్తి, 10 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 10 వేల ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేస్తున్నారు. ఈసారి వరిపంటకు తెగుళ్లు బెడద తీవ్రమైంది. ఎస్సారెస్పీ ఆయకట్టు కింద, బావుల్లో, బోర్లలో నీళ్లు ఉన్న రైతులు అధికంగా వరిసాగు చేశారు. వరి పొట్ట దశకు వస్తుండడంతో క్రిమి కీటకాలు ఎక్కువయ్యాయి. కంకినల్లి, దోమ, ఆకు ఎండుతెగుళ్లకు రైతులు మందులను పిచికారి చేస్తున్నారు. ఇప్పటికే దున్నడానికి, నాటు వేయడానికి, ఎరువులకు పెట్టుబడి పెట్టి సతమతమవుతుంటే కొత్తగా తెగుళ్లు రావడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.
ఫ వరికి తెగుళ్లు సోకాయి.
- సాయిరాం, రైతు, సిర్సపల్లి
వరికి దోమ, కంకినల్లి, ఆకు ఎండుతెగుళ్లు సోకాయి. మందులను ఇప్పటికే పిచికారి చేశాను. వాతావరణ మార్పుల వల్ల వరి పొట్ట దశలో ఉండగా రోగాలు వస్తున్నాయి. పెట్టుబడులు తడిసి మోపడయ్యాయి. దీనికి తోడు యూరియా దొరకడం లేదు. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.