వర్షాలకు నేలవాలిన వరి పంట
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:24 AM
వరి పంట చేతికందే సమయంలో కురిసిన వర్షాలకు పైరు నేలవాలడంతో కోతకు అన్నదాతలకు తంటాలు పడుతున్నారు. పొలంలో వర్షపు నీరు నిలిచి యంత్రాలు దిగబడడం వల్ల కోతకు వీలు లేకుండా ఉన్నది. దీంతో గత్యంతరం లేక కూలీలతో
ఎల్లారెడ్డిపేట, అక్టోబరు7(ఆంధ్రజ్యోతి): వరి పంట చేతికందే సమయంలో కురిసిన వర్షాలకు పైరు నేలవాలడంతో కోతకు అన్నదాతలకు తంటాలు పడుతున్నారు. పొలంలో వర్షపు నీరు నిలిచి యంత్రాలు దిగబడడం వల్ల కోతకు వీలు లేకుండా ఉన్నది. దీంతో గత్యంతరం లేక కూలీలతో కోయాల్సిన దుస్థితి దాపురిస్తోంది. కోసిన పంట తడిసిపోవడం వల్ల ఆరబెట్టడం మరో ప్రయాసగా మారింది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు వెంకటాపూర్, బండలింగంపల్లి, హరిదాస్‌నగర్, పదిర తదితర గ్రామాల్లో సాగు చేసిన వరి పంటకు కోత దశకు చేరుకున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు వరి పైరు నేలవాలిపోయింది. కోయకపోతే ఉన్న పంట పొలంలోనే మొలక వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. యంత్రాలు బురదలో దిగబడి పోవడంతో రైతులు కూలీలతో కోయించి ఆరబెట్టేందుకు అవస్థలు పడుతున్నారు. యంత్రాలకు గంటకు సుమారు రూ.3 వేలు చెల్లించాల్సిన ధర వర్షంతో నేలవాలిన పైరుకు సుమారు రూ. 9 వేలు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. యంత్రాలు దిగబడడం వల్ల మిగిలిన వరి పంటను కోసేందుకు ఒక్కో కూలీకి రూ.600 వెచ్చిస్తున్నామని చెబుతున్నారు.
అదనంగా రూ.30 వేల ఖర్చు
- మేడిశెట్టి వజ్రవ్వ, వెంకటాపూర్
మాకున్న నాలుగెకరాలతో పాటు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి పంటను సాగు చేశా. పంట సాగుకు మొత్తం రూ. 6 లక్షల పెట్టుబడి పెట్టా. పంట కోత దశకు వచ్చిన సమయంలో కురిసిన గాలివానకు ఐదు ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. పొలం వాన నీళ్లు ఉండడంతో వరి కోత యంత్రం దిగబడింది. కోయడానికి వీలు లేక వదిలేయడం వల్ల కూలీలను పెట్టి కోస్తున్నా. కోసిన వరి తడిసిపోవడం వల్ల ఆరబెడుతున్నాం.