స్పందన కరువు
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:44 AM
జగిత్యాల, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తోంది. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఏప్రిల్, మేలో మొదలై ఆగస్టు చివరి వరకు ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీటి నిల్వ సామర్థ్యం బట్టి చేప పిల్లలు వదిలేవారు. కానీ ఈ యేడాది చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతోంది.
-చేప పిల్లల సరఫరా టెండర్ల దాఖలుకు నేడే ఆఖరు
- ఆగస్టు 18న తొలిసారి నోటిఫికేషన్ జారీ
- ముందుకు రాని వ్యాపారులు
- మూడోసారి టెండర్లు ఆహ్వానించిన అధికారులు
- చేప పిల్లల పంపిణీ ఆలస్యంతో మత్స్యకారుల్లో ఆందోళన
జగిత్యాల, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తోంది. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఏప్రిల్, మేలో మొదలై ఆగస్టు చివరి వరకు ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీటి నిల్వ సామర్థ్యం బట్టి చేప పిల్లలు వదిలేవారు. కానీ ఈ యేడాది చేప పిల్లల పంపిణీ ప్రక్రియ ఆలస్యమవుతోంది. ఇందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడమే కారణంగా తెలుస్తోంది. జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో చేప పిల్లల పంపిణీ కోసం ఆగస్టు 18న నోటిఫికేషన్ జారీ చేశారు. టెండర్ల దాఖలుకు ఆగస్టు 30 వరకు గడువు విధించారు. కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈనెల 1న మరోసారి టెండర్లు ఆహ్వానించారు. ఈనెల 8వ తేదీ వరకు టెండర్లను దాఖలు చేయడానికి గడువుగా విధించారు. రెండోసారి కూడా కాంట్రాక్టర్లు ఎవరూ టెండర్లు దాఖలు చేయలేదు. దీంతో మూడోసారి గడువు పొడిగిస్తూ ఈనెల 8వ తేదీన టెండర్లు ఆహ్వానించారు. కాంట్రాక్టర్లు టెండర్లను దాఖలు చేయడానికి ఈనెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు తుది గడువుగా నిర్ణయించారు.
ఫఆసక్తి చూపని వ్యాపారులు..
చేప పిల్లల సరఫరాకు సంబంధించి వ్యాపారుల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నారు. డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని బిడ్ దాఖలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు వ్యాపారులు ముందుకు వస్తారో లేదో అన్న చర్చ కొనసాగుతోంది. గత యేడాది చేప పిల్లలను సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు రాష్ట్ర వ్యాప్తంగా బిల్లులు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. స్థానికంగా ఉత్పత్తి చేసిన పిల్లలను మాత్రమే సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో టెండర్ల దాఖలుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. గతంలో స్థానికంగా ఉత్పత్తి చేయకుండా పొరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి సైతం చేప పిల్లలను దిగుమతి చేసుకోవడంతో ఆశించిన మేర దిగుబడులు రాక మత్స్యకారులకు నష్టం వాటిల్లిందని తెలుస్తోంది.
ఫజిల్లాలో మత్స్య శాఖ పరిస్థితి ఇలా..
జిల్లా వ్యాప్తంగా 254 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 18,500 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 65 మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 3,425 మంది మహిళలు, 189 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో 14,597 మంది పురుషులు సభ్యులుగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ చెరువులకు 3,174 హెక్టార్ల విస్తీర్ణం, డిపార్ట్‌మెంట్ చెరువులకు 15,162 హెక్టార్ల విస్తీర్ణం ఉంది.
ఫజిల్లాలో 1.68 కోట్ల చేప పిల్లల పంపిణీ లక్ష్యం..
జిల్లాలో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు కలిపి 765 వరకు ఉన్నాయి. కుంటలు, చిన్న చెరువుల్లో 35-40 మిల్లీమీటర్ల చేప పిల్లలు 54 లక్షలు వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మరో 1.14 కోట్లు 80-100 మిల్లీమీటర్ల చేపపిల్లలు సరఫరా చేయడానికి టెండర్లును ఆహ్వానించారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో 1.68 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు టెండర్లను నిర్వహిస్తున్నారు. ఇందుకు కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను ఆహ్వానించారు. జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో చేపపిల్లలను వదలడం వల్ల మత్స్య పారిశ్రామిక సంఘాల్లోని 18,022 మంది సభ్యులకు జీవనోపాధి లభించనుంది. ఇందులో మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు సైతం ఉన్నాయి.
ఫనాలుగు రకాల చేప పిల్లలు..
జిల్లాలోని పలు చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నాలుగు రకాల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో బంగారు తీగ, కట్ల, మృగాల, రోహు, సాధారణ రకం చేప పిల్లలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు రొయ్య పిల్లలను వదలాలని జిల్లా మత్స్య శాఖ నిర్ధేశించుకుంది. గత యేడాది చేప పిల్లల పంపిణీలో జాప్యం జరిగింది. అప్పటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత యేడాది సకాలంలో పంపిణీ చేపట్టాలని మత్స్య శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
ఫకమిటీ పర్యవేక్షణలో..
కలెక్టర్ సత్యప్రసాద్ దిశా నిర్దేశంతో చేప పిల్లల పంపిణీకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది. టెండర్ల కమిటీ చైర్మన్‌గా అడిషనల్ కలెక్టర్, మెంబర్ కం కన్వీనర్‌గా జిల్లా మత్స్య శాఖ అధికారి, సభ్యులుగా పశు సంవర్థక శాఖ అధికారి, ఈడీఎం, ఇరిగేషన్ ఈఈలు ఉన్నారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో చేపపిల్లల టెండర్లు, మత్స్యకారులకు పంపిణీ, చెరువుల్లో వదిలేంత వరకు వారి పర్యవేక్షణలో ప్రక్రియ కొనసాగుతుంది.
మత్స్యకారులకు నగదు రూపంలో ఇవ్వాలి
-జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి
మత్స్యకారులకు చేప పిల్లలకు బదులుగా నగదు రూపంలో ఇస్తే సకాలంలో చేప పిల్లలను కొనుగోలు చేసి చెరువుల్లో వదులుకునేందుకు అవకాశం ఉంటుంది. చెరువుల నీటి నిల్వ సామర్థ్యం, విస్తీర్ణత పరిగణలోకి తీసుకొని నగదు పంపిణీ చేసినట్లయితే ఆశించిన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఈమేరకు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశా.
ఆలస్యమైతే పెరగవు..
-మర్రి నర్సయ్య, మత్స్య కార్మికసంఘం నాయకుడు
చేప పిల్లలను జూలై, ఆగస్టులో పంపిణీ చేస్తే బాగా పెరిగేవి. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో పంపిణీ చేయడం వల్ల ఆశించిన స్థాయిలో పెరగవు. మత్స్యకారులకు అనుకూలంగా సకాలంలో టెండర్ల నిర్వహణ పూర్తి చేయాలి. అనువైన సమయంలోనే చేప పిల్లలను నీటిలో వదిలితే దిగుబడి కలిసి వస్తుంది. లేదంటే ఆశించిన ఫలితాలు రావు.
టెండర్లు స్వీకరిస్తున్నాం
-సురేశ్, జిల్లా మత్స్య శాఖ అధికారి
ప్రభుత్వం నిర్ణయించిన ధరకు చేప పిల్లలను సరఫరా చేసేందుకు గాను రాష్ట్ర మత్స్యశాఖ టెండర్లను నిర్వహిస్తోంది. కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో గడువును పొడిగిస్తూ మూడోసారి టెండర్లను ఆహ్వానించాం. ఈనెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఆన్‌లైన్‌లో టెండర్లను దాఖలు చేయవచ్చు. అదే రోజు సాయంత్రం టెండర్లు ఓపెన్ చేస్తాం.