జూనియర్ కళాశాల భవనాల మరమ్మతులు
ABN , Publish Date - Aug 13 , 2025 | 01:07 AM
జిల్లాలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోవడం లేదు. నిధుల కోసం సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లు తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుక వెళ్లినా కూడా నిధులు మంజూరు కాలేదు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోవడం లేదు. నిధుల కోసం సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లు తమ ఉన్నతాధికారుల దృష్టికి తీసుక వెళ్లినా కూడా నిధులు మంజూరు కాలేదు. దీంతో ఇబ్బందులు పడుతూనే విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుండగా, అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల భవనాల మరమ్మ తులకు నిధులు మంజూరు చేసింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని 12 జూనియర్ కళాశాలల భవనాల మరమ్మతులకు 2 కోట్ల 6 లక్షల రూపాయలు మంజూరు చేసింది. ధర్మారం జూనియర్ కళాశాలకు 13 లక్షల రూపాయలు, రామగుండం బాలుర కళాశాలకు 8 లక్షల రూపాయలు, రామగుండం బాలికల జూనియర్ కళాశాలకు 59 లక్షల 50 వేల రూపాయలు, గోదావరిఖని జూనియర్ కళాశాలకు 16 లక్షల రూపాయలు, కాల్వశ్రీరాంపూర్ జూనియర్ కళాశాలకు 9 లక్షల 50 వేల రూపాయలు, ఓదెల జూనియర్ కళాశాలకు 12 లక్షల 50 వేల రూపాయలు, పెద్దపల్లి బాలుర కళాశాలకు 17 లక్షల రూపాయలు, మంథని బాలుర జూనియర్ కళాశాలకు 25 లక్షల రూపాయలు, మంథని బాలికల జూని యర్ కళాశాలకు 23 లక్షల రూపాయలు, కమాన్‌పూర్ జూనియర్ కళాశాలకు 9 లక్షల రూపాయలు, ముత్తారం జూనియర్ కళాశాలకు 9 లక్షల 50 వేల రూపాయలు, జూలపల్లి జూనియర్ కళాశాలకు 4 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి.
ఫ విద్యార్థుల ఇబ్బందులు
నాలుగైదేళ్లుగా జూనియర్ కళాశాలల భవనాలకు మరమ్మతులు లేక విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో నిర్మించిన భవనాలు పాతబడుతున్నాయి. నాలుగైదేళ్లకోసారి అయినా భవనాలకు రంగులు వేయడం లేదు. విద్యుత్ వైరింగ్, స్విచ్చులు మార్పిడి చేయక వర్షాలకు గోడలు పదునెక్కి విద్యుత్ షాక్ వస్తున్నాయని చెబుతున్నారు. కిటికీలు ఊడిపోవడం, అక్కడక్కడ దర్వాజలు, తలుపులు దెబ్బతిన్నాయి. ఓదెలలో బోరింగ్ మోటార్ రిపేరింగ్‌తో పాటు బోర్ వెల్ కూడా పనిచేయడం లేదు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో భవనాలకు మరమ్మతులు చేసినట్లయితే విద్యార్థుల ఇబ్బందులు తొలగనున్నాయి. ఈ పనులకు సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు తయారు చేస్తున్నారు. ఆ తర్వాత పనులు చేపట్టనున్నారని అధికారులు తెలుపుతున్నారు.
ఫ కళాశాలల్లో పెరిగిన ప్రవేశాలు
జిల్లాలో గల 14 జూనియర్ కళాశాలల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2,134 మంది విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ, హెచ్‌ఈసీ, సీఈసీ కోర్సులతో పాటు వృత్తి విద్య కోర్సుల్లో మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందారు. గత ఏడాది 2,034 మంది ప్రవేశాలు పొందగా, ఈ ఏడాది గత ఏడాదికంటే 100 మంది అదనంగా ప్రవేశాలు పొందారు. కళాశాలల ఆరంభానికి ముందుకు వేసవిలో అధ్యాపకులు ప్రవేశాల కోసం ముమ్మరంగా ప్రచారం చేశారు. ప్రభుత్వ కళాశాలలో చేరడం వల్ల ఉచిత విద్య అందించడంతో పాటు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందు తాయని, ఇంటర్ పూర్తయిన తర్వాత ఇంజినీరింగ్ చదివే విద్యార్థులకు ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా విద్యను అందిస్తారని ప్రచారం చేశారు. అలాగే ఎప్ సెట్, జేఈఈ పరీక్షలకు శిక్షణ ఇస్తామని, మెటీరియల్ కూడా అందిస్తున్నామని అధ్యాపకులు ముందస్తుగా చేసిన ప్రచారం అనుకూలించడంతో 100 మంది అదనంగా చేరారు. ఇంకా ప్రవేశాలు పొందేందుకు ఈ నెలాఖరు వరకు కూడా అవకాశం ఉందని ఇంటర్‌మీడియెట్ నోడల్ అధికారి కల్పన ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.