Share News

గాంధీ పేరు తొలగించడం దుర్మార్గపు చర్య

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:42 AM

ఉపాధిహామీ పథకం రద్దుచేసి గాంధీ పేరు తొలగించడం దుర్మార్గపు చర్య.. ఊరులో ఉన్న గాంధీ విగ్రహాలు, నోట్లపై ఉన్న గాంధీ బొమ్మను తొలగించగలరా అంటూ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు.

గాంధీ పేరు తొలగించడం దుర్మార్గపు చర్య

సిరిసిల్ల, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : ఉపాధిహామీ పథకం రద్దుచేసి గాంధీ పేరు తొలగించడం దుర్మార్గపు చర్య.. ఊరులో ఉన్న గాంధీ విగ్రహాలు, నోట్లపై ఉన్న గాంధీ బొమ్మను తొలగించగలరా అంటూ ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రశ్నించారు. ఆదివారం ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం రద్దుచేసి, మహాత్మా గాంధీ పేరును తొలగించి అవమానపరిచినందుకు కాంగ్రెస్‌ నాయకుల నిరసనలు వెలువెత్తాయి.. కాంగ్రెస్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్‌ వద్ద ధర్నా నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడు తూ ఉపాధిహామీ పథకం నుంచి మోదీ, అమిత్‌ షాలు మహాత్మా గాంధీ పేరును తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల నుంచి తొలగించలేరని అన్నారు. గాంధీ పేరును తొలగించడం పట్ల మేధావులు, ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండిస్తున్నారని అన్నారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌ గాంధీలో పేర్లే కాకుండా మహాత్మాగాంధీ పేరును కూడా తొలగించే కుట్ర కేంద్రం చేస్తోందని, పెద ప్రజలకు ఉపయోగపడే పథకాలను నీరుగార్చే ప్రయత్నం బీజేపీ చేస్తోందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజెపీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో బీజేపీ పాల్గొన లేదని అన్నారు. గాంధీ నాయకత్వంలో భారతదేశానికి స్వాతంత్య్రం తీసుకురావడం జరిగిందని, మంద బలం, అధికార బలం ఉందని గాంధీ పేరును తీసివేస్తున్నారని, కానీ మోదీ, అమిత్‌ షాలకు దమ్ముంటే గ్రామాల్లో ఉన్న గాంధీ విగ్రహాలను టచ్‌ చేయగలరా, దమ్ముంటే గ్రామాల్లోని గాంధీ విగ్రహాలను టచ్‌ చేసి చూడండన్నారు. దేశంలోని నోట్‌పై ఉన్న గాంధీబొమ్మను తొలగించే సాహసం చేయగలరా అని ప్రశ్నించారు. అసలు స్వాతంత్య్రం ఉద్యమంతో ఏ మాత్రం సంబం ధం లేని బీజేపీ పార్టీ స్వతంత్ర సమరయోధుల త్యాగాలను విస్మరి స్తోందని అన్నారు. బీజేపీ పది సంవత్సరాల పరిపాలనలో పేద ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకం తెలేదన్నారు. బీజేపీ దేశంలో ప్రజలను మతాల, ప్రాంతాల వారీగా విభజించి పాలిస్తుందని అన్నారు. బీజేపీ వెంటనే ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు పెట్టాలని,వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రభంజనం ఉంటుందని రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రి కావడం ఖాయం అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో తిరిగి గాంధీ పేరు పెడుతుందని అన్నారు.

మునిగిపోతున్న బీఆర్‌ఎస్‌..

రెండేళ్లుగా ఫామ్‌ హౌస్‌ నుంచి బయటకు రాని కేసీఆర్‌ కేవలం మునిగిపోతున్న బీఆర్‌ఎస్‌ పార్టీ కోసమే బయటకు వచ్చారని, ప్రజల కోసం మాత్రం కాదని ప్రభుత్వ విప్‌ శ్రీనివాస్‌ అన్నారు. మూడు రోజుల క్రితం బీఆర్‌ఎస్‌ ఎంపీలు మోదీని కలిస్తే కేసీఆర్‌ ఆరోగ్యం ఎలా ఉందని, వారి ఆరోగ్యం కాపాడుకొమ్మని కేసీఆర్‌కు ఒక చీటీ పంపారని అన్నారు. మోదీ కేసీఆర్‌ ఆరోగ్యపై ఆరా తీయడం దేనికి సంకేతమని, బీజేపీ, బీఆర్‌ ఎస్‌ చీకటి దోస్తానా బయట పడిందన్నారు. ఇంకా ఎంత కాలం చీకటి దోస్తానా చేస్తారని అన్నారు. నల్ల చట్టాలకు బీఆర్‌ఎస్‌ బీజేపీకి మద్దతు ఇచ్చిందని, ఉపాధిహామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగిస్తే బీఆర్‌ఎస్‌ నాయకులు నోరు ఎందుకు మెదపడం లేదని అన్నారు. రెండు సంవత్సరాల తర్వాత బయటకు వస్తున్న కేసీఆర్‌పార్టీ కార్యాలయంకి రావడం కాదు, అసెంబ్లీకి రావాలన్నారు. అసెంబ్లీలో ఎనిమిది లక్షల కోట్ల అప్పుల విషయంలో చర్చిద్దామన్నారు. మాజీ మంత్రి రోజా ఇంటికి వెళ్లి కేసీఆర్‌ రాయలసీమను రత్నాల సీమగా మారుస్తానని ఆనాడు చెప్పారని, కృష్ణ గోదావరి జలాలను రాయలసీమకు మళ్లిస్తానని కేసీఆర్‌ చెప్పినదానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, కాళేశ్వరం కూలిపోయిన దానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు చేరువవ్వటంతో కేసీఆర్‌ బయటకు వచ్చారని, కంటోన్మెంట్‌ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయిందని, పంచాయతీ ఎన్నికల్లో 25 శాతాని పడిపోయిన పార్టీని కాపాడుకోడానికి కేసీఆర్‌ బయటకు వస్తున్నాడని అన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మైత్రి బయట పడిందని, బీజేపీ బీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రజా వ్యతిరేకత విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోవు రోజుల్లో బీజేపీ బీఆర్‌ఎస్‌ పార్టీలకు ప్రజలకు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్య నారాయణ, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు ఉమేష్‌రావు, ఆకునూరు బాలరాజు, సూర దేవరాజు, వైద్య శివప్రసాద్‌, గడ్డం నర్సయ్య, ఆడెపు చంద్రకళ, స్వరూ పరెడ్డి, వెంకటరమణ, మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 12:42 AM