Share News

‘సహకార’ సిబ్బందికి స్థానచలనం

ABN , Publish Date - May 24 , 2025 | 12:40 AM

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలాన్ని ఆరు నెలలు పొడగించిన ప్రభుత్వం ఆ సహకార సంఘాల్లో పనిచేసే కార్యదర్శులు, క్లర్క్‌లు, సిబ్బంది అందరిని బదిలీ చేయాలని నిర్ణయించింది.

‘సహకార’ సిబ్బందికి స్థానచలనం

- తొలిసారి బదిలీలు చేస్తున్న ప్రభుత్వం

- రాజకీయాలు, రైతుబంధు వివరాల నమోదులో నిర్లక్ష్యమే కారణం

- పాలకవర్గాల ఎన్నికలు అనుమానమే

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలాన్ని ఆరు నెలలు పొడగించిన ప్రభుత్వం ఆ సహకార సంఘాల్లో పనిచేసే కార్యదర్శులు, క్లర్క్‌లు, సిబ్బంది అందరిని బదిలీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులను బదిలీ చేయడం రాష్ట్రంలో ఇదే ప్రథమం.

సిబ్బందిపై పలు విమర్శలు

ఇటీవలి వరకు సీఈవోలుగా పిలిచే సహకార సంఘాల కార్యదర్శులు, క్లర్క్‌లు, ఇతర సిబ్బందిలో 90 శాతానికిపైగా మంది ఆ సంఘం ఏర్పాటైన నాటి నుంచి అక్కడే పనిచేస్తున్నారు. అక్కడే నియమితులై అక్కడే కొనసాగుతూ దశాబ్దాలుగా ఉన్న కారణంగా వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, రాజకీయాల్లోనూ జోక్యం చేసుకుని చైర్మన్ల ఎన్నిక సందర్భంలో కీలకపాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల రైతు భరోసా పథకం అమలు సందర్భంగా రైతుల వివరాలను కంప్యూటర్లలో నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలున్నాయి. దీంతో ప్రభుత్వానికి కొంత చెడ్డపేరు వచ్చిందనే అభిప్రాయం అధికారపార్టీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం సహకార సంఘాల కార్యదర్శులను, సిబ్బందిని బదిలీ చేయాలని నిర్ణయించింది. ఒకే సొసైటీలో వరుసగా ఐదేళ్లపాటు పని చేసిన వారందరిని ఉమ్మడి జిల్లా పరిధిలో వేరే సొసైటీకి బదిలీ చేయాలని పేర్కొంటూ జీవో ఆర్‌టీ నెం. 82ను మే 15న ప్రభుత్వం జారీ చేసింది. కొన్ని సంఘాల్లో కార్యదర్శులే షాడో చైర్మన్లుగా వ్యవహరిస్తున్నారని, రైతులను తమ అదుపు ఆజ్ఞలో ఉంచుకుని చైర్మన్లను రాజకీయంగా వేధిస్తున్నారనే విమర్శలున్నాయి.

ఫ ఉమ్మడి జిల్లా పరిధిలో 132 సహకార సంఘాలు

ప్రభుత్వం జారీ చేసిన జీవోతో ఉమ్మడి జిల్లా పరిధిలోని 500కుపైగా ఉన్న ఉద్యోగులు, సిబ్బందికి బదిలీలు జరుగనున్నాయి. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలో 132 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లాలో 30, జగిత్యాల జిల్లాలో 54, పెద్దపల్లి జిల్లాలో 26, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 22 సంఘాలు ఉన్నాయి. వీటిలో సుమారు 500 మందికిపైగా కార్యదర్శులు, అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో అత్యధికులకు బదిలీలు జరిగే అవకాశం ఉంది. త్వరలోనే బదిలీల ప్రక్రియ ప్రారంభిస్తారని, ఒకటి రెండు నెలల్లోగా అందరి బదిలీలు పూర్తిచేస్తారని తెలిసింది.

ఫ పాలకవర్గాల పొడిగింపా.. నామినేటెడ్‌ చైర్మన్లా..?

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం గత ఫిబ్రవరిలో ముగియగా ప్రభుత్వం ఈ పాలకవర్గాలనే మరో ఆరు నెలలపాటు కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15 నాటికి ఈ పొడగింపు గడువు కూడా ముగిసే అవకాశం ఉన్నది. ఇటు సిబ్బంది బదిలీలు పూర్తయ్యేసరికి అంతే సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు వరకు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోసారి పాలకవర్గాల పదవీకాలాన్ని పొడగిస్తారా అన్న చర్చ ప్రారంభమయింది. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ఒక ఆర్డినెన్స్‌ ద్వారా చైర్మన్లను నామినేట్‌ చేసింది. వారే సహకార సంఘాల పాలకవర్గంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కూడా అలాంటి ఆర్డినెన్స్‌ జారీ చేసి అధికార పార్టీ తమ పార్టీకి చెందినవారినే చైర్మన్లుగా నామినేట్‌ చేసి సహకార సంఘాలను పనిచేయించే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.

Updated Date - May 24 , 2025 | 12:41 AM