మధ్యాహ్న భోజన కార్మికులకు ఊరట
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:05 AM
చాలీచాలని సొమ్ముతో వంట సరుకులను తెస్తూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న కార్మికుల అవస్థలు కాస్త తీరనున్నాయి. సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రభుత్వం వంట ధరలు పెంచాలని నిర్ణయం తీసుకోగా విద్యాశాఖ అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.
జగిత్యాల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): చాలీచాలని సొమ్ముతో వంట సరుకులను తెస్తూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న కార్మికుల అవస్థలు కాస్త తీరనున్నాయి. సర్కారు బడుల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి ప్రభుత్వం వంట ధరలు పెంచాలని నిర్ణయం తీసుకోగా విద్యాశాఖ అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలలో రెండుసార్లు ధరలు పెంచడం ఏజెన్సీ నిర్వాహకులకు మరింత ఊరటనిచ్చింది. పెంచిన ధరలను అమలు చేయాలని కలెక్టర్లు, విద్యా శాఖాధికారులకు సూచించారు. పెరిగిన ధరల ప్రకారం విద్యార్థులకు మరింత రుచికరమైన భోజనం అందించేందుకు అనుకూలంగా ఉంటుందని పలువురు వంట కార్మికులు అంటున్నారు. అయితే వీటిని గతేడాది డిసెంబర్ నుంచి అమలు చేయాల్సి ఉండగా మే 1వ తేదీ నుంచి చేస్తుండడంతో అప్పటి నుంచి చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఒక్కో విద్యార్థికి అయ్యే ఖర్చు 60శాతం కేంద్రం భరించగా 40 శాతం రాష్ట్రప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ మేరకు నిత్యావసర సరుకులు ధరలు పెరిగి ఆహార నాణ్యత తగ్గుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రకటన ఏజెన్సీలకు కొంత మేర కలిసి వచ్చింది.
ఫజిల్లాలో 783 పాఠశాలల్లో పథకం
జిల్లాలోని 783 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 55 వేలకు పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతోంది. ఇందులో సుమారు 38 వేలు ప్రాథమిక, సుమారు 17 వేలు ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నట్లు విద్యాశాఖ రికార్డులు తెలుపుతున్నాయి. సుమారు 10 వేలకు పైగా పదో తరగతి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,566 మంది మధ్యాహ్న భోజన వంట కార్మికులు పనిచేస్తున్నారు. కోడిగుడ్డు బిల్లు సపరేటుగా ఇస్తున్నారు. జిల్లాలో నెలకు సుమారు రూ.కోటి వరకు మధ్యాహ్న బిల్లులు అవుతుంటాయన్న అంచనా ఉంది.
ఫపెరిగిన ధరలతో సతమతం..
ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరల నేపథ్యంలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు కొంతకాలంగా ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం నెలలోనే రెండుసార్లు ధరలు పెంచింది. దీంతో వారిలో హర్షం వ్యక్తమవుతోంది. ఈ పెంచిన ధరలు మే 1వ తేదీ నుంచి అమలు చేయనుంది. అయితే సెప్టెంబరు వరకు బడ్జెట్ విడుదల చేసినప్పటికీ పెండింగ్ బిల్లులను ఏరియర్స్ రూపంలో చెల్లించనున్నారు. అధిక వర్షాలతో కూరగాయలు, ఆకుకూరలు దెబ్బతిన్నాయి. దీంతో ధరలు ప్రస్తుతం మండిపోతున్నాయి. కోడి గుడ్డు ధర కూడా పెరగడంతో అదనపు భారం పడుతోంది.
ఫమెనూ అమలు ఇలా..
ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మెనూ ప్రకారం వంట ఏజెన్సీ నిర్వాహకులు విద్యార్థులకు భోజనం అందించాల్సి ఉంది. సోమవారం అన్నం, కోడిగుడ్లు, వెజిటేబుల్ కర్రీ, మంగళవారం అన్నం పప్పు, ఆకుకూరలు, బుధవారం అన్నం, కోడుగుడ్లు, వెజిటేబుల్ కర్రీ, గురువారం అన్నం, సాంబర్, వెజిటెబుల్ కర్రీ, శుక్రవారం అన్నం కోడిగుడ్లు, వెజిటేబుల్ కర్రీ, శనివారం వెజిటేబుల్ బిర్యానీ అందిస్తారు. ఇలా వారానికి మూడుసార్లు భోజనంతో పాటు ఉడికించిన గుడ్డు అందించాల్సి ఉంటుంది. అయితే కొన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మెనూ అమలు కావడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ధరల పెంపు నేపథ్యంలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించి వారి ఆరోగ్యంపై దృష్టిసారించాలని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.
ఫసకాలంలో బిల్లులు రాక..
మధ్యాహ్న భోజనానికి సంబంధించి బిల్లులు సకాలంలో రావడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. అప్పులు తెచ్చి వంట చేస్తున్నామని బిల్లులు మాత్రం సకాలంలో ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు రోజూ కూరగాయలు తప్పనిసరి వండి పెట్టాలి. అయితే ప్రస్తుతం కూరగాయలు, పప్పు, చింతపండు, కారంతో పాటు వంటగ్యాస్ ధర విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం చెల్లించే డబ్బులు సరిపోవడం లేదు. వారానికి మూడుసార్లు గుడ్డు పెట్టాల్సి రావడంతో ప్రస్తుతం మార్కెట్లో గుడ్డు ధర విపరీతంగా పెరిగి ఆర్థిక భారం పడుతోందని వారు వాపోతున్నారు.
వేతనం అందించాలి
-సుతారి రాములు, వంట కార్మిక సంఘం నాయకుడు
ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపాలి. నెలకు రూ.12 వేలు వేతనం చెల్లించి ఆర్థికంగా ఆదుకోవాలి. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. బిల్లులు సకాలంలో అందించి గ్యాస్ సిలిండర్లను పూర్తిగా రాయితీపై పంపిణీ చేయాలి.
నాణ్యమైన భోజనం అందించాలి
-రాము, జిల్లా విద్యాధికారి
ప్రభుత్వం మధ్యాహ్న భోజన ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బిల్లులు సైతం రెగ్యులర్‌గా చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హెచ్‌ఎం ఇన్‌చార్జీలు బాధ్యత తీసుకోవాలి.
---------------------------------------------------------------
పెంపు ఇలా...(ఒక్కో విద్యార్థికి రూ.లలో..)
---------------------------------------------------------------
తరగతి - పాత ధర - ఈనెల 4న - ఈనెల 17న
---------------------------------------------------------------
1 నుంచి 5 - 5.45 - 6.19 - 6.78
6 నుంచి 8 - 8.17 - 9.29 - 10.17
9 నుంచి 10 -8.17 - 9.29 - 13.17
---------------------------------------------------------------
(వారానికి మూడు గుడ్లు కలిపి)
---------------------------------------------------------------