కాంగ్రెస్‌లో కాయకల్ప చికిత్స
ABN , Publish Date - Mar 12 , 2025 | 01:19 AM
కాంగ్రెస్‌లో కాయకల్ప చికిత్స ప్రారంభమైందా అంటే ఔననే సమాధానం వస్తున్నది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షీ నటరాజన్ నియామకంతో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
కాంగ్రెస్‌లో కాయకల్ప చికిత్స ప్రారంభమైందా అంటే ఔననే సమాధానం వస్తున్నది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షీ నటరాజన్ నియామకంతో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మొదటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉంటూ వస్తున్నవారికి, ఏ అవకాశం దక్కని సీనియర్లకు, పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసే వారికి పెద్ద పీట వేసేందుకు రంగం సిద్ధమవుతున్నదంటూ పార్టీలో ప్రచారం జరుగుతున్నది. ఏఐసీసీ కార్యదర్శులు, ఆ స్థాయి నేతలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, ముఖ్యకార్యకర్తలతో భేటీ అయి పార్టీ ఆయా నియోజకవర్గాల పరిధిలో, ఆయా జిల్లాల్లో ప్రస్తుతమున్న పరిస్థితిపై విచారిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పలువురు నేతలు, కార్యకర్తలను మూడు రోజుల క్రితం గాంధీభవన్‌కు పిలిపించుకొని వేర్వేరు సమయాల్లో వారితో ఒక్కొక్కరితో భేటీ అయి పలు అంశాలను కూలంకషంగా చర్చించి వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిసింది. గాంధీభవన్‌కు పిలిపించిన వారి వ్యక్తిగత విషయాలను ప్రశ్నించి, ఎంత కాలం నుంచి పార్టీలో ఉన్నారు. గతంలో లభించిన అవకాశాలు, ఏయే సందర్భాల్లో టికెట్ ఆశించారు, అప్పుడు ఏమి జరిగింది, ప్రస్తుతం జిల్లాలో, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, ఎన్నికైన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు ఎలా పనిచేస్తున్నారు. వారు కేడర్‌తో సమన్వయంతో ఉంటున్నారా..., నియోజకవర్గంలో పార్టీ బలమేంటీ, బలహీనతలు ఏమిటీ, సరిదిద్దుకోవలసిన లోటుపాట్లు ఏమున్నాయనే విషయాలపై లోతుగా ప్రశ్నించి, వివరాలు రాసుకున్నట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఎనిమిది మందిని పార్టీ ఏఐసీసీ కార్యదర్శి పిలిపించుకొని ఈ విషయాలను విచారించారని తెలిసింది.
జిల్లాలో పార్టీ పరిస్థితిపై విచారణ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన మూడు రోజుల్లోనే ఈ భేటీలు జరిగినా నేరుగా ఆ అంశాన్ని ప్రస్తావించకుండా నేతల పరిస్థితి, పార్టీ పరిస్థితి, చేయాల్సిన మార్పులపై విచారించారని చెబుతున్నారు. విచారణలో పాల్గొని వచ్చిన నేతలు ఏ విషయాలను బయటికి చెప్పకుండా గుంభనంగా ఉంటున్నా కార్యకర్తలకు, పార్టీ వీడని వారికి ఇప్పటి వరకు అవకాశాలు దక్కకుండా అన్యాయం జరిగిన వారికి త్వరలోనే మంచిరోజులు రాబోతున్నాయంటూ పార్టీలో చర్చించుకుంటున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు కూడా ఏఐసీసీ కార్యదర్శితో మాట్లాడి వచ్చిన వారిని తమ గురించి ఏమైనా ప్రశ్నించారా.. అసలు ఏమి అడిగారు. మీరేమి చెప్పారంటూ ఎంక్వయిరీ చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జిగా మీనాక్షీ నటరాజన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీశ్రేణుల్లో తమకు ఏదో జరుగబోతుందన్న నమ్మకం పెరిగింది. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క నేతల ఆటలు ఇక సాగవు అంటూ పార్టీ కేడర్ చర్చించుకుంటూ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు.
నామినేటెడ్ పోస్టులపై ప్రచారం
జిల్లాలో పలువురు సీనియర్ నేతలకు త్వరలోనే వివిధ నామినేటెడ్ పోస్టులు లభిస్తాయని ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు ఇప్పటికే జాబితాను సిద్ధం చేసుకున్నా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యం లో వాటిలో పలు మార్పులు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు అవకాశాలు లభించని పలువురు సీనియర్లకు పదవులు దక్కబోతున్నాయంటూ ప్రచారం జరుగుతున్నది. మార్చి నెలాఖరువరకు నామినేటెడ్ పోస్టుల భర్తీ పూర్తి చేసి పార్టీ నేతలందరిని స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సిద్ధం చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.