Share News

మూడో విడతకు రె‘ఢీ’

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:53 AM

: జిల్లాలో మూడో విడత పంచాయతీ సమరానికి సర్వం సిద్ధమైంది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో గల ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి, వెల్గటూరు, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో బుధవారం పోలింగ్‌, కౌంటింగ్‌ జరగనుంది.

మూడో విడతకు రె‘ఢీ’

జగిత్యాల, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మూడో విడత పంచాయతీ సమరానికి సర్వం సిద్ధమైంది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో గల ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి, వెల్గటూరు, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో బుధవారం పోలింగ్‌, కౌంటింగ్‌ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వారం రోజుల పాటు గ్రామాల్లో అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇక పోలింగ్‌ సమయం ఆసన్నం కావడంతో పోటీలో ఉన్నవారిలో టెన్షన్‌ మొదలైంది. అధికార కాంగ్రెస్‌ పార్టీ, విపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు హోరాహోరిగా తలపడుతున్నారు. మరి ఎవరిని అదృష్టం వరిస్తుందో బుధవారం తేలిపోనుంది.

ఫ1,75,024 మంది ఓటర్లు..

జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 119 గ్రామ పంచాయతీలు, 1,088 వార్డులకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారు. అయితే 6 గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, 228 వార్డుల ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 113 సర్పంచ్‌ స్థానాలకు 450 మంది, 860 వార్డులకు 2,364 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాలో తుది విడత పంచాయతీల్లో 1,75,024 మంది ఓటర్లున్నారు. ఇందులో ధర్మపురిలో 35,389 మంది, బుగ్గారంలో 17,347 మంది, ఎండపల్లిలో 24,077 మంది, వెల్గటూరులో 22,684 మంది, గొల్లపల్లిలో 39,658 మంది, పెగడపల్లిలో 35,869 మంది ఓటర్లున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగనుంది. అనంతరం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించడంతో పాటు ఉప సర్పంచ్‌ ఎన్నిక కూడా నిర్వహిస్తారు. ఎన్నికల నిర్వహణకు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎస్పీ అశోక్‌ కుమార్‌ల పర్యవేక్షణలో యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

ఫఏకగ్రీవ పంచాయతీలు..

జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 6 సర్పంచ్‌ స్థానాలు, 228 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలోని పెగడపల్లి మండలం రాములపల్లిసర్పంచ్‌గా అమిరిశెట్టి లక్ష్మీనారాయణ, రాజారాంపల్లి సర్పంచ్‌గా ఇస్తావత్‌ రమేశ్‌ నాయక్‌, ఎండపల్లి మండలం కొండాపూర్‌ సర్పంచ్‌గా తాటిపర్తి రాజవ్వ, ధర్మపురి మండలం దోనూర్‌ సర్పంచ్‌గా దాసరి పురుషోత్తం, నర్సయ్యపల్లి సర్పంచ్‌గా పోతనశెట్టి నర్సయ్య, బోదరి నక్కల చెరువు గూడెం సర్పంచ్‌గా గోపు రాజన్నలు ఏకగ్రీవమయ్యారు.

ఫ1,088 పోలింగ్‌ కేంద్రాలు..

జిల్లా వ్యాప్తంగా తుది విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా 1,088 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధర్మపురిలో 224 పోలింగ్‌ కేంద్రాలు, బుగ్గారంలో 96, ఎండపల్లిలో 138, వెల్గటూరులో 168, గొల్లపల్లిలో 246, పెగడపల్లిలో 216 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 1,534 బ్యాలెట్‌ బాక్సులను అందుబాటులో ఉంచారు.

మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 11 జోన్లు, 45 రూట్లు ఏర్పాటు చేశారు. ఇందులో ధర్మపురిలో 4 జోన్లు, 8 రూట్లు, బుగ్గారంలో 2 జోన్లు, 6 రూట్లు, ఎండపల్లిలో 4 జోన్లు, 4 రూట్లు, వెల్గటూరులో 3 జోన్లు, 5 రూట్లు, గొల్లపల్లిలో 4 జోన్లు, 12 రూట్లు, పెగడపల్లిలో 4 జోన్లు 10 రూట్లు ఏర్పాటు చేశారు.

ఫతుది విడతలో పోలింగ్‌ సిబ్బంది ఇలా...

జిల్లాలో తుది విడతలో 1,306 మంది పీవోలు, 1,703 మంది ఓపీవోలు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇందులో ధర్మపురిలో 269 మంది పీవోలు, 368 మంది ఓపీఓలు, బుగ్గారంలో 115 మంది పీఓలు, 166 మంది ఓపీఓలు, ఎండపల్లిలో 166 మంది పీఓలు, 228 మంది ఓపీఓలు, వెల్గటూరులో 202 మంది పీఓలు, 246 మంది ఓపీఓలు, గొల్లపల్లిలో 295 మంది పీఓలు, 356 మంది ఓపీఓలు, పెగడపల్లిలో 259 మంది పీఓలు, 338 మంది ఓపీఓలు విధులు నిర్వర్తించనున్నారు. పలువురు నోడల్‌ అధికారులు, స్టేజ్‌-1 రిటర్నింగ్‌ ఆఫీసర్లు, స్టేజ్‌-1 ఏఆర్‌ఓలు, స్టేజ్‌-2 ఆర్‌ఓలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, స్టాటిక్‌ సర్వేలైన్స్‌ బృందం అధికారులు పనిచేయనున్నారు.

అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి

-కలెక్టర్‌ సత్యప్రసాద్‌

తుది విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎన్నికల విదులు కేటాయించిన సిబ్బందికి పంపిణీ కేంద్రాల నుంచి మెటీరియల్‌ అందించాం. సంబంధిత సిబ్బంది పోలింగ్‌ స్టేషన్లకు చేరుకున్నారు. ఏజెంట్ల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించి పోలింగ్‌ ప్రారంభించనున్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నాం. ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి.

Updated Date - Dec 17 , 2025 | 12:53 AM