Share News

రేషన్‌ కార్డులు వచ్చేశాయి..

ABN , Publish Date - May 03 , 2025 | 12:30 AM

ఎన్నో ఏళ్లుగా రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హుల నిరీక్షణకు తెరపడింది. పేదలకు రేషన్‌ కార్డులను జారీ చేసింది. ఇటీవల కుల గణన ద్వారా చేపట్టిన సర్వే అధారంగా గుర్తించిన వారికి, అలాగే మీ సేవలో దరఖాస్తులు చేసుకున్న వారి అర్హతలపై కుటుంబాలను గుర్తించి జనవరి మాసంలో సర్వేలు చేశారు.

రేషన్‌ కార్డులు వచ్చేశాయి..

- మీ సేవ కేంద్రాల చుట్టూ దరఖాస్తుదారుల ప్రదక్షిణలు

- 9,731 కుటుంబాలు మాత్రమే గుర్తింపు

- పదేళ్లుగా రేషన్‌ కార్డులకు ఎదురుచూపులు

- జిల్లాలో 1,73,578 రేషన్‌ కార్డులు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఎన్నో ఏళ్లుగా రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హుల నిరీక్షణకు తెరపడింది. పేదలకు రేషన్‌ కార్డులను జారీ చేసింది. ఇటీవల కుల గణన ద్వారా చేపట్టిన సర్వే అధారంగా గుర్తించిన వారికి, అలాగే మీ సేవలో దరఖాస్తులు చేసుకున్న వారి అర్హతలపై కుటుంబాలను గుర్తించి జనవరి మాసంలో సర్వేలు చేశారు. దానికి అనుగుణంగా రేషన్‌ కార్డులు జారీ కావడంతో మీ సేవ కేంద్రాలకు వెళ్లి దరఖాస్తుదారులు మంజూరీని చూసుకుంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్‌ కార్డులు ఇస్తామని ప్రకటించడమే కాకుండా నిరంతర ప్రక్రియగా ఉంటుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో సర్వేలు చేసి ఆన్‌లైన్‌ ద్వారా మంజూరీ ఇచ్చారు. ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులతో పాటు మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించింది. కొత్త రేషన్‌ కార్డుల జారీకి సంబంధించి కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 2023 డిసెంబరు 26 నుంచి 2024 జనవరి 8 వరకు ఆరు గ్యారంటీల ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. ఆరు గ్యారంటీల్లో రేషన్‌ కార్డు ఆప్షన్‌ లేకపోయినా అదనంగా దరఖాస్తులను స్వీకరించారు. ఆరు గ్యారంటీల్లో 1.91 లక్షల దరఖాస్తులు రాగా, 40 వేల మంది రేషన్‌ కార్డులు, మార్పులు, చేర్పులకు దరఖాస్తులు చేసుకున్నారు. అందరికి కార్డులు వస్తాయని ఎదురుచూసిన క్రమంలో ఈ సంవత్సరం జనవరిలో 9,731 మంది తెల్ల రేషన్‌ కార్డులకు అర్హులుగా గుర్తించి మంజూరు చేశారు.

ఫ చేర్పులు, మార్పులపై అయోమయం..

కొత్తగా రేషన్‌ కార్డులు జారీ అయిన నేపథ్యంలో జిల్లాలో దరఖాస్తుదారుల్లో తెల్ల రేషన్‌ కార్డు లేనివారిని 9,731 మంది కుటుంబాలను గుర్తించారు. జనవరిలోనే కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రావడంతో పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం మే నెల నుంచే బియ్యాన్ని పంపిణీ చేసే దిశగా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జిల్లాలో బోయినపల్లిలో 553, చందుర్తిలో 655, ఇల్లంతకుంటలో 903, గంభీరావుపేటలో 717, కోనరావుపేటలో 836, ముస్తాబాద్‌లో 903, రుద్రంగిలో 914, సిరిసిల్లలో 1420, తంగళ్లపల్లిలో 710, వీర్నపల్లిలో 217, వేములవాడ అర్బన్‌లో 819, వేములవాడలో 421, వేములవాడ రూరల్‌లో 496, ఎల్లారెడ్డిపేటలో 767 కుటుంబాలకు రేషన్‌ కార్డులు అందించే దిశగా సర్వే చేసి మీ సేవ ద్వారా ఆహార భద్రత కార్డుల మంజూరు పత్రాలను అందుబాటులో ఉంచారు.

జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో కొత్త కార్డులు రాకపోగా కనీసం ఉన్న కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చకపోవడం, చేర్పులు, మార్పులు కూడా జరుగలేదు. జిల్లాలో చేర్పులు, మార్పులకు సంబంధించిన 20,606 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రేషన్‌ కార్డుల్లో పిల్లల పేర్లు, కోడళ్ల పేర్లు చేర్చాలంటూ వేలాది మంది కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు ఈ నేపథ్యంలో కొత్త రేషన్‌ కార్డుల జారీతో పాటు చేర్పులు, మార్పులు పూర్తిస్థాయిలో జరగలేదనే విమర్శలు ఉన్నాయి. మీ సేవ కేంద్రాల్లో మార్పులు కనిపించకపోవడంతో మళ్లీ ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో చేర్పుల మార్పుల దరఖాస్తుల పెండింగ్‌లో బోయినపల్లిలో 1,321, చందుర్తిలో 1,760, కోనరావుపేటలో 1,403, ముస్తాబాద్‌ 1,914, రుద్రంగిలో 948, సిరిసిల్లలో 2,689, తంగళ్లపల్లిలో 1,333, వీర్నపల్లిలో 481, వేములవాడ రూరల్‌లో 1,105, వేములవాడలో 2,105, ఎల్లారెడ్డిపేటలో 2,032 దరఖాస్తులు ఉన్నాయి. 2018 సంవత్సరానికి ముందు దరఖాస్తులు చేసుకున్న వారిలో 2021 ఆగస్టులో 2,271 మందికి రేషన్‌ కార్డులు అందించారు. ఆ తరువాత మళ్లీ రేషన్‌ కార్డులు జారీ చేయడం చేర్పులు, మార్పులు పక్రియ ముందుకు రావడంతో లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తం అవుతోంది.

ఫ త్వరలో స్మార్ట్‌ కార్డులు..

ప్రభుత్వం ఆహార భద్రత కార్డుల ద్వారా కుటుంబంలోని మూడేళ్ల వయస్సు దాటిన వారందరికి 6 కిలోల ఉచిత బియ్యాన్ని అందిస్తుంది. గత ప్రభుత్వం ఆహార భద్రత కార్డులుగా పేరు మార్చినప్పటికి లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేయలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రేషన్‌ కార్డులను త్వరలో స్మార్ట్‌ కార్డులుగా జారీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు రేషన్‌ పత్రాలను జిరాక్స్‌ చేయించుకొని బియ్యం పొందుతున్నారు. త్వరలోనే డిజిటల్‌ కార్డులు జారీ అవుతాయని భావిస్తున్నారు.

ఫ జిల్లాలో 5,22,967 మంది లబ్ధిదారులు...

రాజన్న సిరిసిల జిల్లాలో 1,74,304 రేషన్‌ కార్డులు ఉండగా లబ్ధిదారులు 5,22,967 మంది ఉన్నారు. ఇందులో అంత్యోదయ కార్డులు 13,752, ఆహార భద్రత కార్డులు 1,60,349 కార్డులు, అంత్యోదయ అన్నయోజన కార్డులు 203 ఉన్నాయి. వీటి పరిధిలో 5,22,967 మంది లబ్ధిదారులు ఉన్నారు. అంత్యోదయ లబ్ధిదారులు 37,453మంది, ఆహారభద్రత లబ్ధిదారులు 4,85,308 మంది, అన్నయోజన లబ్ధిదారులు 206 మంది ఉన్నారు.

Updated Date - May 03 , 2025 | 12:30 AM