దక్షిణాదికి విద్యుత్ అందిస్తున్న రామగుండం ఎన్టీపీసీ..!
ABN , Publish Date - Nov 14 , 2025 | 01:03 AM
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్‌కు చెందిన 2600 మెగావాట్ల రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ దక్షిణాది విద్యుత్ అవసరాలను తీర్చంలో కీలక పాత్ర పోషిస్తున్నది.
జ్యోతినగర్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్‌కు చెందిన 2600 మెగావాట్ల రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ దక్షిణాది విద్యుత్ అవసరాలను తీర్చంలో కీలక పాత్ర పోషిస్తున్నది. యేటా ఉత్పత్తి లక్ష్యాలను అధిగమిస్తూ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. 1978 నవంబరు 14 అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ చేతుల మీదుగా పునాది రాయి పడిన ఈ ప్రాజెక్టులోని యూనిట్లు నిర్ణీత గడువుకన్నా ముందే ఉత్పత్తిని ప్రారంభించాయి. ఈ ప్రాజెక్టులో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రోజుకు 42 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం ఉంటుంది. 2100 మెగావాట్ల సామర్థ్యం ఉన్న స్టేజ్ 1, స్టేజ్ 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి సింగరేణి నుంచి రోజుకు 32వేల మెట్రిక్ టన్నుల కోల్ లింకేజీ ఒప్పందం ఉంది. అలాగే స్టేజ్ 3లోని 500 మెగావాట్ల 7 యూనిట్‌కు ఒడిశాలోని మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి 8వేల మెట్రిక్ టన్నుల బొగ్గు లింకేజీ ఒప్పందం ఉంది. ప్రాజెక్టు అవసరమైన 6.5 టీఎంసీల నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఎన్టీపీసీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నిల్వ ఉంచుతారు.
ఏ రాష్ట్రానికి ఎంత విద్యుత్...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు 754 మెగావాట్లు(29శాతం)
తమిళనాడుకు 572 మెగావాట్లు(22శాతం)
కర్నాటకకు 416 మెగావాట్లు(16శాతం)
కేరళకు 312 మెగావాట్లు(12శాతం)
గోవాకు 130 మెగావాట్లు(5శాతం)
పాండిచ్ఛేరికి 52 మెగావాట్లు(2శాతం)
ఎవరికీ కేటాయించనిది(అన్ అలాటెడ్) 364మెగావాట్ల(14శాతం)
యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభ వివరాలు
స్టేజ్-1
200 మెగావాట్ల 1వ యూనిట్ 1983 అక్టోబర్ 26
200 మెగావాట్ల 2వ యూనిట్ 1984 మే
200 మెగావాట్ల 3వ యూనిట్ 1984 డిసెంబర్
స్టేజ్-2
500 మెగావాట్ల 4వ యూనిట్ 1988 జనవరి
500 మెగావాట్ల 5వ యూనిట్ 1989 మార్చి
500 మెగావాట్ల 6వ యూనిట్ 1989 అక్టోబర్
స్టేజ్-3
500 మెగావాట్ల 7వ యూనిట్ 2004 సెప్టెంబర్
ప్రతిష్టాత్మకమైన అమెరికా పవర్ అవార్డు సొంతం..
ప్రతిష్టాత్మకమైన అమెరికాకు చెందిన పవర్ మేగజైన్ దక్షిణాదిలో అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా గుర్తింపు పొందిన రామగుండం ఎన్టీపీసీని ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రాజెక్టుల్లో గుర్తించింది. రామగుండం ప్లాంటుకు ప్రపంచంలో 2015 ఏడాదికిగాను అత్యుత్తమ ప్రాజెక్టుగా అవార్డును ప్రకటించింది.
ప్రాజెక్టుకు అవార్డులు.. రివార్డులు..
రామగుండం ఎన్టీపీసీకి 47 సంవత్సరాలలో అనేక జాతీయ, అంతర్జాతీయ అ వార్డులు లభించాయి. తాజాగా సీఐఐ సంస్థ నుంచి 2025 ఎనర్జీ ఎక్స్‌లెన్స్ అ వార్డు లభించింది. రామగుండం, టిఎస్‌టిపిపి ప్రాజెక్టులకు స్వర్ణశక్తి అవార్డులు లభించాయి. రాజ్‌భాష హిందీ అమలులో ప్రాజెక్టుకు కేంద్రం నుంచి జాతీయస్థాయి పురస్కారం లభించింది. టిఎస్‌టిపిపికి నేషనల్ సేఫ్టీ 2025 అవార్డు లభించింది.
సామాజిక బాధ్యత..
విద్యుత్ ఉత్పత్తితోపాటు సామాజిక బాధ్యతపైన యాజమాన్యం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నది. సీఎస్‌ఆర్ నిధులు వివిధ కార్యక్రమాలకు ఖర్చు చేస్తోంది. స్వచ్ఛ భారత్ కింద గతంలో తెలంగాణలోని 4 జిల్లాలో 11 కోట్ల రూపాయలతో 777 ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మించారు. గ్రామాలలో మౌళిక వసతుల కల్పన, విద్య, ఆరోగ్యం, వ్యవసాయానికి, స్వయం ఉపాధి కోసం సంస్థ చేయూతనిస్తోంది. వైద్య శిబిరాల నిర్వహణ, పాఠశాల భవనాలు, విద్యార్థులకు పుస్తకాల పంపిణీ, ఉపకార వేతనాల కార్యక్రమాలను చేపట్టింది. స్వయం ఉపాధి కల్పించడంలో భాగంగా మహిళలకు ఉచిత కుట్టు, ఎంబ్రాయిడరీలో శిక్షణ, నిరంతర అక్షరాభ్యాస కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
పర్యావరణ పరిరక్షణకు కృషి
ఎన్టీపీసీ పరిసర ప్రాంతంలో సుమారు 14 లక్షల చెట్లను సంస్థ సంరక్షిస్తున్నది. ప్రాజెక్టు నుంచి వెలువడే బూడిద సమస్యను నివారించడానికి ఎన్టీపీసీ వినూత్న పథకాలను అమలు చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రాజెక్టుకు ఐఎస్‌వో-14001 గుర్తింపు లభించింది. కాగా, సల్ఫర్ డై యాక్సైడ్‌ను నిలువరించేందుకు 500 కోట్ల రూపాయలతో ఎఫ్‌జీడీ(ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్) ప్రాజెక్టును నెలకొల్పుతున్నారు.
టిఎస్‌టిపిపి స్టేజ్ 2 నిర్మాణానికి రెడీ..
2600 మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ ఆవరణలోనే 4000 మెగావాట్ల మరో ప్రాజెక్టును నిర్మిస్తోంది. మొదటి దశలో 800 మెగావాట్ల రెండు యూనిట్లు గత ఏడాదిలో పూర్తయి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది. స్టేజ్ 2 కింద మరో 2400 మెగావాట్ల ప్లాంటు నిర్మించేందుకు అంతా సిద్ధం చేస్తోంది.
సమిష్టి కృషితో ప్రగతి పథంలో
- ఈడీ చందన్ కుమార్ సామంత
ఉద్యోగులు, అధికారులు, కాంట్రాక్టు కార్మికుల సమిష్టి కృషి ఫలితంగా రామగుండం ప్రాజెక్టు ప్రగతిపథంలో నడుస్తోంది. రక్షణతో కూడిన నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యతనిస్తాం. ఉత్పత్తి, రక్షణ, పర్యావరణ పరిరక్షణ, సీఎస్‌ఆర్, ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. ఎన్టీపీసీ రేజింగ్ డే సందర్భంగా సిబ్బందికి, ఈ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు.