రాజీవ్ యువ వికాసానికి తప్పని ఎదురుచూపులు
ABN , Publish Date - Jun 05 , 2025 | 12:53 AM
నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో పెట్టుబడి సాయం అందించేందుకు శ్రీకారం చుట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు.
జగిత్యాల, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో పెట్టుబడి సాయం అందించేందుకు శ్రీకారం చుట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. వ్యవసాయ రంగంతో పాటు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుతో యువత ఆర్థిక పురోగతి పొందేలా ప్రభుత్వం కార్యాచరణ చేసింది. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ సామాజిక వర్గాల నుంచి అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు. ఆయా సామాజిక వర్గాల నుంచి దరఖాస్తులు పోటెత్తాయి. జిల్లా వ్యాప్తంగా 47,787 మంది యువతీ యువకులు రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అర్హుల ఎంపికకు ఇంటర్వ్యూల నిర్వహణ సైతం పూర్తి చేసింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో లబ్ధిదారులకు సాయం అందించాల్సి ఉండగా పలు ఆరోపణల నేపథ్యంలో కార్యక్రమం ఆకస్మికంగా వాయిదా పడింది.
దరఖాస్తుదారుల్లో నిరాశ
ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం యూనిట్ల పంపిణీని వాయిదా వేయడంతో ఆయా కేటగిరీల కింద దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. మొదటగా ప్రభుత్వం దరఖాస్తుదారులకు మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూంలు నిర్వహించి, అర్హులైన వారికి యూనిట్ విలువ ప్రకారం ఐదు విడతల్లో అక్టోబరు వరకు మంజూరు పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా మొదటి విడతలో కేటగిరీ-1లో రూ.50 వేలు, కేటగిరీ-2 లో రూ. లక్ష వరకు ఎంపికైన లబ్ధిదారులకు జూన్ 2వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు మంజూరు పత్రాలు పంపిణీ చేసి 15వ తేదీలోపు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. నెలాఖరులోపు రాయితీ విడుదల చేసి గ్రౌండింగ్ పూర్తి చేయాలని తొలుత భావించారు. కానీ ఈ పంపిణీ ప్రక్రియ వాయిదా పడటంతో లబ్ధిదారుల్లో నిరాశ నెలకొంది. అయితే ఈనెల 5వ తేదీన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో యువ వికాసంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
పూర్తి స్థాయి పరిశీలన తర్వాతే..
జిల్లాలో ఒకటి, రెండు కేటగిరీల్లో సుమారు 3వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో అర్హులైన వారిని గుర్తించి రాష్ట్ర ఆవిర్భావం రోజున లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభించాలని తొలుత అధికారులు భావించారు. కానీ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడం, అర్హుల ఎంపికలో పొరపాట్లు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయిలో పరిశీలన తర్వాతే లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలన్న డిమాండ్లు వ్యక్తమయ్యాయి. మరింత లోతుగా విచారణ చేసి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సాయం అందించాలన్న ఆలోచనతో జూన్ 2వ తేదీన ప్రారంభం కావాల్సిన కార్యక్రమం వాయిదా పడినట్లు తెలుస్తోంది. తిరిగి ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో అనే విషయంపై స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారులు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు...
రాజీవ్ యువ వికాసం పథకం లబ్ధిదారులకు రుణాలు, ఆర్థిక సాయం అందజేత విషయమై సంబంధిత అధికారులు ప్రభుత్వం నుంచి తదుపరి వచ్చే మార్గదర్శకాల మేరకు నడుచుకుంటామని అంటున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని చెబుతున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిపొందడానికి నిత్యం పదుల సంఖ్యలో దరఖాస్తుదారులు సంబంధిత శాఖల అధికారులను సంప్రదిస్తున్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై స్పష్టత లేకపోవడంతో దరఖాస్తుదారులకు ఎలాంటి సమాచారం అందించాలో తెలియక అధికారులు సైతం అయోమయానికి గురవుతున్నారు.
-------------------------------------------------------------------------------------
కార్పొరేషన్ పేరు.....యూనిట్ల లక్ష్యం.....వచ్చిన దరఖాస్తులు
-------------------------------------------------------------------------------------
ఎస్సీ...........................4,402................................11,300
ఎస్టీ...........................674....................................1,437
మైనారిటీ....................764....................................3,922
బీసీ..............................7,013.................................31,128
-------------------------------------------------------------------------------------
మొత్తం........................12,853..............................47,787
-------------------------------------------------------------------------------------