రాజన్నకు భక్త నీరాజనం
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:56 AM
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. శ్రావణ మాసం చివరి రోజు కావడంతో భక్తులు శుక్రవారం పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
- శ్రావణమాసం చివరి రోజున మొక్కులు చెల్లింపు
- మహాలక్ష్మి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన మహిళలు
వేములవాడ కల్చరల్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. శ్రావణ మాసం చివరి రోజు కావడంతో భక్తులు శుక్రవారం పెద్దసంఖ్యలో తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయం సందడిగా మారింది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్‌లో గంటల తరబడి నిరీక్షించారు. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు పార్వతిరాజరాజేశ్వరస్వామి వారిని దర్శించుకుని, కోడెమొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
- మహిళలు ప్రత్యేక పూజలు..
శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా రాజరాజేశ్వరీదేవి అమ్మవారికి ఉదయం, సాయంత్రం విశేషపూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా మహిళలు అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి నూతన వస్ర్తాలు, ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం మహిళలు పసుపు, కుంకుమ, కునుములతో వాయినం ఇచ్చిపుచ్చుకుని తులసి పూజలో తరించారు.