Share News

Rajanna siricilla : అమ్మో అమెరికానా..!

ABN , Publish Date - Sep 22 , 2025 | 12:40 AM

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) ఉన్నత చదువులు, ఉపాధి, మెరుగైన జీవితం కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేల సంఖ్యలో అగ్రరాజ్యం అమెరికాకు అనేక సంవత్సరాలుగా వెళ్తున్నారు.

Rajanna siricilla :  అమ్మో అమెరికానా..!

- కూలుతున్న డాలర్‌ డ్రీమ్స్‌

- ట్రంప్‌ ఆంక్షలపై కుటుంబ సభ్యుల ఆందోళనలు

- హెచ్‌1బీ నిబంధనలతో చదువులు, ఉద్యోగాలపై ప్రభావం

- నిత్యం పార్ట్‌టైం ఉద్యోగంపై కలవరమే

- తల్లిదండ్రుల్లో గుబులు..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

ఉన్నత చదువులు, ఉపాధి, మెరుగైన జీవితం కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వేల సంఖ్యలో అగ్రరాజ్యం అమెరికాకు అనేక సంవత్సరాలుగా వెళ్తున్నారు. ఇటీవల వెళ్లిన వారిలో కొంతమంది మాత్రమే తమ లక్ష్యాలను చేరుకున్నారు. అనేకమంది యువతి, యువకులు అక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ స్థిరపడాలనుకునే వారి ఆశలు కూలిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దేశ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చి ఉంటున్న వారిపై అనేక ఆంక్షలు పెడుతున్నాడు. ముఖ్యంగా భారతీయుల విషయంలో ఆంక్షలు పెరుగుతుండడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వారి కుటుంబ సభ్యులు కలవరపడుతున్నారు. తాజాగా ట్రంప్‌ హెచ్‌వన్‌బీ వీసాలపై పెట్టిన ఆంక్షలతో జిల్లాలోని ఎన్నారైలు, ఎమ్మెస్‌ చదువుల కోసం వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో అలజడి మొదలైంది. అమెరికా యూనివర్సిటీలో జిల్లాకు చెందిన యువత ఐటీతో పాటు ఇతర రంగాల్లో ఓపీటీ, స్టెమ్‌ ఓపీటీల అనంతరం అమెరికా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. ఆ తర్వాత హెచ్‌1బీ వీసాలు కూడా పొందారు. కొందరు గ్రీన్‌కార్డును సైతం సొంతం చేసుకున్నారు. జిల్లా నుంచి పదివేల మంది విద్యార్థులు ఎన్నారైలుగా ఉన్నారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టెమ్‌ ఓపీటీల కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడుగా హెచ్‌1బీ వీసాకు ప్రతి ఏటా రూ 90 లక్షల వరకు కంపెనీలు చెల్లించాలని నిబంధన పెట్టడంతో ఉద్యోగాలపై ప్రభావం పడింది. అమెరికాలోని మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, గూగుల్‌, ఆపిల్‌తో పాటు అనేక అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అమెరికాను వీడి ఎవరు వెళ్లవద్దని, ఎవరైనా విదేశాలకు వెళ్లి ఉంటే వెంటనే రావాలని ఆదేశాలు ఇచ్చాయి. హెచ్‌1బీ వీసా అనుమతికి, రెన్యువల్‌ రూ లక్ష డాలర్ల వరకు చెల్లించాల్సినా ఆంక్షలు మధ్యతరగతి కుటుంబాల్లో ఆందోళనలు ఏర్పడ్డాయి

ఫ చెదురుతున్న విదేశీ కలలు

అమెరికాలాంటి సంపన్న దేశాలకు వెళ్లే విదేశీ కలలు చెదిరిపోతున్నాయి. ‘మా అబ్బాయి, అమ్మాయి ఎమ్మెస్సీ కోసం అమెరికాకు పంపించాము... చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం చేస్తున్నారు... అమెరికా సంబంధమే చూసి పెళ్లిచేశాం... బిడ్డ అమెరికా సిటిజన్‌’ అంటూ గర్వంగా చెప్పుకున్న సందర్భాలు జిల్లాలో ఉన్నాయి. అలాగే ‘బిడ్డ అల్లుడు అందరూ అక్కడే.. మేము వెళ్లొచ్చాం..’ అని గొప్పగా చెప్పుకోవడం చూశాం. దీనిని చూసి తమ పిల్లల్ని కూడా అదే బాటలో పంపించారు. పిల్లలు మంచి జీవితాన్ని పొందుతారని ఉన్నత, మధ్య తరగతి వర్గాలతోనే కాకుండా కుటుంబాల పిల్లలు, కార్మికులు వ్యవసాయ కూలీలు, చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ కష్టపడి చదివించిన పిల్లలను బ్యాంకు రుణాలు తీసుకుని అమెరికాకు పంపించారు. ఇంజనీరింగ్‌ చదివి జీఆర్‌ఈ, టోఫెల్‌లాంటి పరీక్షలు రాసి ఎఫ్‌1 స్టూడెంట్‌ వీసా పొంది బ్యాంకుల నుంచి రూ 30 నుంచి 50 లక్షల వరకు రుణాలు పొంది అమెరికా చదువుల కోసం ఆర్థిక భారాన్ని భరిస్తూ భవిష్యత్తు బాగుంటుందని ఆశతో వెళ్లారు. ఇతర దేశాల విద్యార్థులు, ఉద్యోగులపైన ట్రంప్‌ అధికారంలోకి రావడంతోనే పలు నిబంధనలతో ఇబ్బందులు పడుతున్న తీరు వామ్మో అమెరికా.. అనే పరిస్థితి వచ్చింది. ఎఫ్‌1 వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో పాటు అమెరికాలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తున్న వారిని తిప్పి పంపిస్తుండంతో నిత్యం పార్ట్‌టైమ్‌ పనులు చేసుకొనే విద్యార్థులు కలవరపడుతున్నారు. అంతేకాకుండా పెళ్లిళ్లపై ప్రభావం చూపుతున్నాయి. ఇండియాకు వస్తే తిరిగి వెళ్లలేని పరిస్థితిలో తల్లిదండ్రులే ఎంతో అట్టహాసంగా పెళ్లి జరిపించాలని కోరికలను వదిలి అమెరికాకు వెళ్లి సాదాసీదాగా పెళ్లిళ్లు చేసి వస్తున్నారు. ట్రంప్‌ ఆంక్షలు రోజురోజుకు మారుతున్న తీరుపై జిల్లాలోని ఎన్నారై కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి.

ఫ ట్రంప్‌ నిబంధనలు భయపెడుతున్నాయి..

- ఎల్లాల వినోద, మంగళపల్లి

ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు. పెద్దకొడుకు ఉద్యోగం వచ్చింది. రెండో కొడుకు రెండు సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం చూస్తున్నారు. ట్రంప్‌ పెడుతున్న ఇబ్బందులు భయపెడుతున్నాయి. పాత పద్ధతులుఉంటే బాగుండు.

ఫ భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి..

- కేతిరెడ్డి శరత్‌రెడ్డి పెద్దలింగాపూర్‌

అమెరికా అధ్యక్షుడు హెచ్‌1బీ వీసాపై తీసుకున్న నిర్ణయం విద్యార్థులకు శాపంగా మారుతోంది. నా కొడుకు రెండు సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లాడు. 40 లక్షల వరకు ఖర్చు అయింది. చదువు పూర్తయినా ఉద్యోగం రాలేదు. హెచ్‌1బీ వీసా వార్షిక దరఖాస్తుకు లక్ష డాలర్లు పెట్టడం విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. భారత ప్రభుత్వం జోక్యం చేసుకొని అమెరికాకు వెళ్లిన విద్యార్థులకు భరోసానివ్వాలి.

Updated Date - Sep 22 , 2025 | 12:40 AM