Rajanna siricilla : ‘స్వశక్తి’ చీరలతో భరోసా..
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:33 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వం అందిస్తున్న వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు ఉపాధి భరోసానిస్తున్నాయి. కాలంతో పోటీ పడలేక మరమగ్గాల మధ్యనే బతుకులు వెళ్లదీస్తున్నారు.
- జిల్లా నేతన్నలకు 4.30 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు
- 9600పైగా మరమగ్గాల ద్వారా 3.17 కోట్ల మీటర్లు ఉత్పత్తి
- నాణ్యతలో తేడా రాకుండా చర్యలు
- నేడు పరిశీలించనున్న మంత్రి సీతక్క
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వం అందిస్తున్న వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు ఉపాధి భరోసానిస్తున్నాయి. కాలంతో పోటీ పడలేక మరమగ్గాల మధ్యనే బతుకులు వెళ్లదీస్తున్నారు. నిత్యం ఆకలి చావులు, ఆత్మహత్యలు చవిచూసిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో స్వశక్తి చీరల ఆర్డర్లు నేతన్నలకు బతుకు భరోసా కల్పించాయి. ఇందిరా మహిళా శక్తి పథకంలో తెలంగాణ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు ప్రతి సంవత్సరం రెండు చీరలు అందించే విధంగా నిర్ణయించారు. ఆ మేరకు నేతన్నలకు చేతినిండా పని కలిగే విధంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు చీరల ఉత్పత్తి ఆర్డర్లను ఇచ్చారు. బతుకమ్మ పండుగకు స్వశక్తి మహిళలకు చీరలు అందించే దిశగా ఏర్పాట్లు చేసినా పూర్తిస్థాయిలో చీరలు ఉత్పత్తి కాకపోవడంతో వాయిదా పడినట్లు సమాచారం. సిరిసిల్లలో చీరల ఉత్పత్తిని గత ఆగస్టు 15లోగానే పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినా పూర్తి కాకపోవడంతో సెప్టెంబరు 30 వరకు పొడిగించిన ఆ గడువు కూడా ముగిసింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లు సిరిసిల్లలో మరమగ్గాలపై వస్త్ర ఉత్పత్తి చివరి దశకు చేరుకోవడంతో స్వశక్తి మహిళలకు చీరలు అందించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సోమవారం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బతుకమ్మ చీరల ఉత్పత్తిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించనున్నారు.
మరమగ్గాల కార్మికులకు చేతి నిండా పని..
సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకు చేతినిండా ఉపాధి కలుగుతుందనే ఆలోచనతో చీరల ఉత్పత్తి ఆర్డర్లను అందించారు. నాణ్యతలో ఎలాంటి తేడా రాకుండా పలు చర్యలు తీసుకున్నారు. స్వశక్తి మహిళకు డ్రెస్ కోడ్‌గా ఉండే విధంగా ఉత్పత్తి చేసిన చీరలను పంపిణీ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఉత్పత్తి చేసిన వస్త్రాన్ని ప్రాసెసింగ్, ప్రింటింగ్ పూర్తిచేసి వివిధ జిల్లాల్లోని గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. మహిళలకు అందించే స్వశక్తి చీరను సిరిసిల్లలో ఆగస్టులో చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఆర్డర్లు అందించే ముందే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిజైన్లు పరిశీలించి ఖరారు చేశారు. గత ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరల ఆర్డర్లు 2017 నుంచి 2023 వరకు ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదని నిలిపివేసింది. ప్రభుత్వం నుంచి ఆర్డర్లు లేకపోవడంతో వస్త్ర పరిశ్రమ ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయింది. నేతన్నల ఆత్మహత్యలు, కార్మిక సంఘాల ఆందోళనలు, అనేక విషాద సంఘటనల మధ్య ప్రభుత్వం మళ్లీ సిరిసిల్ల నేతన్నల ఉపాధిని దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన చీరలను ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా స్వశక్తి సంఘాల మహిళలకు డ్రెస్ కోడ్‌గా ఉండే విధంగా నాణ్యమైన చీరలను ఉత్పత్తి చేయడానికి నిర్ణయించింది. ఇందులో భాగంగా సిరిసిల్ల మరమగ్గాల కార్మికుల పని కల్పించే దిశగా ఆర్డర్లను ఇవ్వడంతో కార్మికులకు నిరంతరంగా ఉపాధి కలుగుతుందని భరోసా వచ్చింది.
ఫ 3.17 కోట్ల మీటర్ల ‘స్వశకి’్త బట్ట ఉత్పత్తి..
స్వశక్తి మహిళలకు ఏడాదికి రెండు చీరలు ఇచ్చే విధంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చారు. మొదటి విడతగా ఈ సంవత్సరం జనవరి, మార్చి మాసంలో 4.30 కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లు రావడంతో మరగ్గాల చప్పుళ్లు మళ్లీ నిరంతరం వినిపిస్తున్నాయి. సిరిసిల్ల మరమగ్గాలపైన 1.30 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తి జరుగుతోంది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కార్మికుల కొరత తీవ్రంగా ఉండడంతో స్వశక్తి చీరలు ఉత్పత్తి మొదట్లో వేగంగా జరగలేదు. తరువాత ఉత్పత్తి లక్ష్యం దిశగా వేగం పుంజుకుంది. గతంలో బతుకమ్మ చీరల ఉత్పత్తి కోసం తెలంగాణలోని వరంగల్, జగిత్యాల, నల్లగొండ, వికారాబాద్ లాంటి జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా నేత కార్మికులు సిరిసిల్లకు వచ్చి ఉపాధి పొందారు. బతుకమ్మ చీరలు ఉత్పత్తి ఆర్డర్లు రాకపోవడంతో కార్మికులు మహారాష్ట్రలోని బీవండి, షోలాపూర్, గుజరాత్‌లోని సూరత్ వంటి ప్రాంతాలకు వెళ్లారు. మరికొందరు ఇతర పనుల్లో స్థిరపడ్డారు. దీంతో స్వశక్తి చీరల ఉత్పత్తి ఇబ్బందికరంగా మారింది. సిరిసిల్లలో దాదాపు 30వేల వరకు మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో జియోట్యాగింగ్ చేసిన మరమగ్గాలు 27 వేల వరకు ఉన్నాయి. ఇందులో స్వశక్తి చీరల ఉత్పత్తి 131 మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ(మ్యాక్స్)ల ద్వారా 9600 మరమగ్గాలపైన ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పటివరకు 4.30కోట్ల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆర్డర్‌లో 3.17 కోట్ల మీటర్లు ఉత్పత్తి జరిగింది. మరో వారం రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోనున్నారు.