rajanna siricilla : మళ్లీ వ్యవసాయ యాంత్రీకరణ..
ABN , Publish Date - Jul 28 , 2025 | 01:02 AM
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అనుసరించే దిశగా వచ్చిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఆరేళ్ల తరువాత మళ్లీ రైతుల్లో ఆశలు కల్పించింది.
- 2025-26 ఆర్థిక సంవత్సరానికి పథకం వర్తింపు
- కొత్త మార్గదర్శకాలను విడుదల చేసిన ప్రభుత్వం
- ఆగస్టు 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ
- జిల్లాకు 2,246 యూనిట్లు, రూ.74.31 లక్షలు మంజూరు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అనుసరించే దిశగా వచ్చిన వ్యవసాయ యాంత్రీకరణ పథకం ఆరేళ్ల తరువాత మళ్లీ రైతుల్లో ఆశలు కల్పించింది. గతంలో అమల్లో ఉన్న వ్యవసాయ యాంత్రీకరణ పఽథకం 2016- 17 అప్పటి ప్రభుత్వం నిలిపివేసింది. మళ్లీ ఈ పథకాన్ని ప్రస్తుత వానాకాలం సీజన్ నుంచి యాసంగి వరకు పూర్తిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలతో జీవో నంబర్ 234ను రెండురోజుల క్రితం జారీ చేసింది. 2025-26 సంవత్సరానికి ఈ పథకాన్ని వర్తింపచేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమలు చేసేందుకు అడుగులు వేసింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు 198యూనిట్లకు రూ.58.84 లక్షలు మంజూరుచేశారు. కానీ ఆర్థిక సంవత్సరం చివరి మాసం మార్చిలో పథకం వర్తింపచేయడానికి ప్రభుత్వం పూనుకోవడంతో రైతులకు యాంత్రీకరణ అందించలేకపోయారు. ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా చర్యలకు పూనుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రూపొందించిన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకాన్ని రైతులకు అందించడానికి 2025-26 సంవత్సరానికి ఈ పథకాన్ని వర్తింపచేసే విధంగా యాంత్రీకరణ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాకు 2246 యూనిట్లు, రూ.74.31 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. యాంత్రీకరణ పథకంలో ఎస్సీ, ఎస్‌టీ, బీసీలతో పాటు మహిళా రైతులకు 50శాతం సబ్సిడీ, జనరల్ రైతులకు 40 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. దానికి అనుగుణంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వ్యవసాయ అధికారులు యాంత్రీకరణ సన్నాహాలు మొదలుపెట్టారు.
సెప్టెంబరు 7 నుంచి పరికరాల పంపిణీ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అందిస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి రైతుల నుంచి ఆగస్టు 5 నుంచి 15 తేదీ వరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. గతంలో దరఖాస్తులు చేసిన రైతులను సైతం పరిగణనలోకి తీసుకొని దరఖాస్తులకు సంబంధించి నివేదికను కలెక్టర్‌కు అందిస్తారు. కలెక్టర్ ఆగస్టు 16 నుంచి 20 తేదీ వరకు పరిశీలిస్తారు. దరఖాస్తు తిరస్కరిస్తే అందుకు కారణాలను రైతులకు తెలియజేస్తారు. ఆగస్టు 21 నుంచి 27వ తేదీ వరకు యాంత్రీకరణకు ఎంపిక చేసిన రైతుల నుంచి డీడీలు తీసుకుంటారు. ఆగస్టు 27నుంచి సెప్టెంబర్ 5 తేదీ వరకు లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులు ఇస్తారు. సెప్టెంబర్ 7నుంచి 17 తేదీ వరకు రైతులకు పరికరాల పంపిణీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించారు.
15 రకాల యాంత్రీకరణ పరికరాలు
వ్యవసాయ రంగంలో ఆధునికత తీసుకువచ్చే దిశగా ఉమ్మడి రాష్ట్రంలో యాంత్రీకరణ పథకం కొనసాగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొద్దిరోజులు కొనసాగినా గత ఆరేళ్లుగా నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం గత యాసంగి నుంచి యాంత్రీకరణ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో నిర్ణయం తీసుకోవడంతో అందించలేకపోయారు. రైతుల నుంచి వ్యవసాయ పరికరాల కోసం వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని 15 రకాల యంత్రపరికరాలను అందించడానికి జాబితాను రూపొందించారు. ఇందులో రోటవేటర్‌లు, నాగళ్లు, కల్టివేటర్, స్ర్పేయర్లు, పవర్‌టిల్లర్లు, డ్రోన్, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్, బండ్ ఫార్మార్, బ్యాటరీ ఆపరేటెడ్ స్ర్పేయర్లు వంటివి అందించనున్నారు.
రైతుల్లో హర్షం...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం, యాసంగి సీజన్లలో దాదాపు 4.14 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. వానాకాలం సీజన్‌లో 2.43 లక్షల ఎకరాలు, యాసంగిలో 1.74 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తారు. వ్యవసాయ కూలీల కొరతతో ప్రతి సీజన్‌లోనూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సబ్సిడీపై యంత్రాలు ఇవ్వడం ద్వారా ఇబ్బందులు తొలగుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో వ్యవసాయ పరికరాల కొనుగోలు చేయాలంటే పెద్దమొత్తంలో ఖర్చు అవుతుంది. కల్టీవేటర్ బయట తయారు చేస్తే రూ.30 నుంచి రూ.50 వేలు, రోటవేటర్ కొనాలంటే రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది. పురుగుల మందు పిచికారి యంత్రాల ధర మార్కెట్‌లో రూ.3 వేల నుంచి రూ.పది వేల వరకు ఉన్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా సగం ధరకే పరికరాలు రానుండడంతో చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
లబ్ధిదారుల ఎంపిక కష్టమే..
వ్యవసాయ అధికారులకు వ్యవసాయ పరికరాలు అందించడం ఎలా ఉన్నా లబ్ధిదారులను ఎంపిక చేయడం కత్తిమీద సాములాగే మారుతుంది. మహిళా రైతుల నుంచి పోటీ ఉండడమే కాకుండా రాజకీయ జోక్యం కూడా పెరుగుతుంది. అధికార పార్టీ చెందిన వారి ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.