భక్త జనసంద్రంగా రాజన్న క్షేత్రం..
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:58 PM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయం సోమవారం భక్తజన సందోహంగా మారింది.
వేములవాడ కల్చరల్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయం సోమవారం భక్తజన సందోహంగా మారింది. రాజన్నకు ఎంతో ఇష్టమైన సోమవారం కావడంతో భక్తులు ఆదివారం రాత్రి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయ వసతిగదుల్లో విడిది చేసిన భక్తులు ఉదయాన్నే ఆలయ ధర్మగుండంలో పవిత్రస్నానాలను ఆచరించారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. ధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్‌ల ద్వారా ఆలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీపార్వతిపరమేశ్వరులను దర్శించుకున్నారు. రాజన్నకు ఎంతో పీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో రమాదేవి ఆధ్వర్యంలో ఉద్యోగులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
వైభవంగా ప్రారంభమైన శ్రీదేవినరాత్రోత్సవాలు..
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీదేవినవరాత్రోత్సవాలను సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఉదయం పుణ్యావచనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి రోజున దుర్గాదేవి అమ్మవారు భక్తులకు శైలపుత్రి అలకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారికి అభిషేకం, సతీసమేత పూజ, పరివార దేవతలకు అభిషేకాలు, గాయత్రి హవనం నిర్వహించారు.
అమ్మవారిని దర్శించుకున్న విప్ ఆది శ్రీనివాస్..
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీస్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. శ్రీదేవినవరాత్రోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనయుడు ఆది కార్తీక్‌తో కలిసి అమ్మవారి పూజలో పాల్గొన్నారు. అర్చకులు వేదోక్త ఆశీర్వచనం ఇచ్చి రాజన్న ప్రసాదాన్ని అందజేశారు.
దుర్గామాత దీక్ష తీసుకున్న భక్తులు..
శ్రీదేవినవరాత్రోత్సవాల్లో భాగంగా వేములవాడ పట్టణం, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దీక్ష చేపట్టారు. నాగిరెడ్డి మండపంలో సుమారు రెండు వందల మంది భక్తులు దుర్గామాత దీక్ష చేపట్టారు.