Share News

భక్తజన సంద్రంగా రాజన్న క్షేత్రం

ABN , Publish Date - Aug 04 , 2025 | 12:59 AM

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి శైవక్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది.

భక్తజన సంద్రంగా రాజన్న క్షేత్రం

వేములవాడ కల్చరల్‌, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి శైవక్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. రాష్ట్రం నలుమూలలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ఆవరణతో పాటుగా ప్రాంగణం రద్దీగా కనబడింది. శ్రావణ మాసం ఆదివారం సందర్భంగా భక్తులు ఉదయాన్నే ఆలయ ధర్మగుండంలో పవిత్రస్నానాలను ఆచరించారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. రాజన్నకు ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు భక్తులు మూడు గంటలపాటు క్యూలైన్‌లో బారులు తీరినట్లు భక్తులు తెలిపారు. కాగభ ధర్మదర్శనం, శీఘ్రదర్శనం, బ్రేక్‌దర్శనం క్యూలైన్‌ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరకున్నారు. శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని శ్రీరాజరాజేశ్వరీ అమ్మవారికి నూతన వస్ర్తాలు ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించకున్నారు. పరివార దేవతాలయాల్లో భక్తులు కుంకుమ పూజలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు తలేత్తకుండా ఆలయ ఈవో రాధాబాయి ఆధ్వర్యంలో సంబందిత అధికారులు క్యూలైన్‌లు త్వరితగతిన కదిలేలా చర్యలు తీసుకున్నారు.

రాజన్న సేవలో మహారాష్ట్ర రవాణా కమిషనర్‌ వివేక్‌ భీమన్వార్‌..

వేములవాడ రాజరాజేశ్వర స్వామిని మహారాష్ట్ర రాష్ట్ర రవాణా సంస్థ కమిషనర్‌ వివేక్‌ భీమన్వార్‌ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. రాజన్న ఆలయానికి ఆదివారం ఉదయం వచ్చిన ఆయనకు ఆలయాధికారులు స్వాగతం పలికి స్వామివారి ప్రత్యేక దర్శనం సౌకర్యం కల్పించారు. రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకున్న అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వచనం ఇవ్వగా, అధికారులు రాజన్న ప్రసాదాన్ని అందజేశారు.

ఆకట్టుకున్న లంబోదర కల్చరల్‌ డాన్స్‌ ఫెస్టివల్‌..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ ఓపెన్‌స్లాబ్‌లో ఆదివారం శ్రీలంబోదర కల్చరల్‌ అకాడమి ఆధ్వర్యంలో శ్రావణ మాస శివపాద నృత్యనీరాజనం 2025 సంగీత, నృత్య ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి నాట్య గురువులు, కళాకారులు, తల్లిదండ్రులు, బాలకళాకారులు హాజరయ్యారు. ఈ మహోత్సవానికి రాజన్న ఆలయ ఈవో రాధాబాయి ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి కళాకారులను ఘనంగా సన్మానించి అభినందించారు.

పలు విభాగాలను పర్యవేక్షించిన ఈవో..

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని ప్రధాన విభాగాలను ఈవో రాధాబాయి ఆదివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఈవో మెయిన్‌ టెంపుల్‌, ప్రసాద విక్రయ విభాగం, ప్రోటోకాల్‌ విభాగం, సెంట్రల్‌ గోదాం, బుకింగ్‌ కౌంటర్‌, ప్రచార శాఖ, భక్తుల సమాచార కేంద్రాల్లో నిర్వహణ తీరును సమీక్షించారు. అధికారులు, సిబ్బందితో సమావేశంలో ప్రసాదాల తయారీలో ఉపయోగించే పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని, స్వామివారికి నివేదించే ప్రసాదం శుద్ధి, ప్రమాణాలపరంగా లోపం లేకుండా ఉండేలా చూడాలని సూచించారు. సెంట్రల్‌ గోదాంలో సరుకుల నిల్వలు, రిజిస్టర్ల నిర్వహణ, టికెట్‌ కౌంటర్లలో జరిగే లావాదేవీలు, సమాచార కేంద్రాల్లో భక్తులకు అందే సేవలపై సమీక్ష జరిపారు. టికెట్లు జారీ విధానం సక్రమంగా కొనసాగాలని, ఉద్యోగులంతా సమయపాలన పాటించాలని స్పష్టం చేశారు. భక్తులకు సమాచార కేంద్రంలోని సిబ్బంది భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని, ప్రసాద నాణ్యతలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. ప్రతి విభాగంలో రికార్డుల నిర్వహణ సరైన విధంగా కొనసాగించాలని ఉద్యోగులకు, సిబ్బందికి సూచించారు.

Updated Date - Aug 04 , 2025 | 12:59 AM