వానమ్మా.. ఒక్కసారి రావమ్మా..
ABN , Publish Date - Jul 17 , 2025 | 01:12 AM
కార్తెలు కరిగిపోతున్నా చిరుజల్లులే తప్ప భారీ వర్షాల జాడలేదు. ‘పూనాస’ సాగు ప్రారంభమై రెండు నెలలు దగ్గర పడుతున్నా వర్షాలు లేక సాగు పనులు జోరందుకోవడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానకాలం సాగుపై వర్షాభావ పరిస్థితులు, కమ్ముకుంటున్న కరువు మేఘాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా ఉన్న శ్రీ రాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్ట్, అన్నపూర్ణ అనంతగిరి ప్రాజెక్ట్, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లతో పాటు చెరువులు, కుంటల్లోకి నీరు చేరగా వెలవెలబోతున్నాయి.
- కార్తెలు కరిగిపోతున్నా రాలని చినుకులు..
- వేసవి ముగుస్తుండగానే మొదలైన వర్షాలు
- రెండు నెలలు కావస్తున్నా కురవని భారీ వర్షం
- వెలవెలబోతున్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు
- జోరందుకోని వరి నాట్లు.. వాడిపోతున్న పత్తి మొలకలు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
కార్తెలు కరిగిపోతున్నా చిరుజల్లులే తప్ప భారీ వర్షాల జాడలేదు. ‘పూనాస’ సాగు ప్రారంభమై రెండు నెలలు దగ్గర పడుతున్నా వర్షాలు లేక సాగు పనులు జోరందుకోవడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానకాలం సాగుపై వర్షాభావ పరిస్థితులు, కమ్ముకుంటున్న కరువు మేఘాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. జిల్లాలో ప్రధానంగా ఉన్న శ్రీ రాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్ట్, అన్నపూర్ణ అనంతగిరి ప్రాజెక్ట్, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లతో పాటు చెరువులు, కుంటల్లోకి నీరు చేరగా వెలవెలబోతున్నాయి. మిడ్ మానేరు ప్రాజెక్టుల్లో డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నాయి. మిడ్ మానేరు ప్రాజెక్టులో 27.55 టీఎంసీల సామర్థ్యం కాగా 6.833 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో పాటు 3.50 టీఎంసీల సామర్థ్యం గల అన్నపూర్ణ ప్రాజెక్టులో 1.22 టీఎంసీలు, ఎగువ మానేరు ప్రాజెక్టులో 2.0 టీఎంసీలకు 0.61 టీఎంసీలు నీటి నిలువలు ఉన్నాయి. రోళ్లు పగిలే రోహిణీకార్తెలోనే వర్షాలు ఆశలు రేకెత్తించి ఆ తర్వాత చిరుజల్లులతో దిగాలు పరుస్తోంది. జిల్లాలో వరినాట్ల జోరు లేక సగం వరకు కూడా నాట్లు పడలేదు. తొలి వర్షాలతో పత్తి విత్తనాలు వేసుకున్న రైతులు మొలక దశలో నీళ్లు లేక వాడిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాలో 32 శాతం లోటు వర్షపాతమే...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో జూన్ మాసం నుంచి ఇప్పటివరకు 46 రోజుల్లో 2032.5 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం 158.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో 32 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని బోయిన్‌పల్లి, చందుర్తి, వేములవాడ రూరల్, వేములవాడ, సిరిసిల్ల, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతంలో కోనరావుపేట, ముస్తాబాద్, తంగళ్ళపల్లి, ఇల్లంతకుంట మండలాలు ఉన్నాయి. గత సంవత్సరం 728.5 సాధారణ వర్షపాతానికి 896.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
సాగని సాగు....
జిల్లాలో వానకాలం సాగు జోరుగా సాగడం లేదు. రెండు పాయింట్ 2.43 లక్షల ఎకరాల సాగు అంచనాలో ఇప్పటివరకు 1.16లక్ష ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగు చేశారు. వర్షాభావ పరిస్థితులతో వరి నాట్లు సగం కూడా పూర్తికాలేదు. పత్తి సాగు మాత్రం ముందస్తుగానే విత్తనాలు వేసుకోవడంతో చివరి దశకు చేరుకుంది. జిల్లాలో వానాకాలంలో 2లక్షల 43వేల 766ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయడానికి రైతులు సిద్ధమయ్యారు. వరి సాగు లక్షా 84వేల 860 ఎకరాలు, మొక్కజొన్న 1,600 ఎకరాలు, పత్తి 49,760 ఎకరాలు, కందులు 1,155 ఎకరాలు, పెసర 79 ఎకరాలు, ఇతర పంటలు 6,304 ఎకరాలు, ఇతర పంటలు 6,900 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశారు. జిల్లాలో ఇప్పటివరకు వరి సాగు 71,690 ఎకరాలు, మొక్కజొన్న 2,403 ఎకరాలు, పత్తి 41,840 ఎకరాలు, కందులు 391 ఎకరాలు, పెసర 15 ఎకరాలు, ఇతర పంటలు 16 ఎకరాలు, ఇతర పంటలు 6,900 ఎకరాల్లో సాగు చేశారు.
జూలై 16 వరకు జిల్లాలో వర్షపాతం (మిల్లీమీటర్లలో)
మండలం సాధారణం కురిసింది
రుద్రంగి 263.9 119.9
చందుర్తి 277.1 167.7
వేములవాడ రూరల్ 245.2 142.9
బోయినపల్లి 220.1 117.0
వేములవాడ 250.2 144.0
సిరిసిల్ల 246.3 141.7
కోనరావుపేట 213.5 172.0
వీర్నపల్లి 229.0 152.9
ఎల్లారెడ్డిపేట 224.0 169.9
గంభీరావుపేట 218.4 165.8
ముస్తాబాద్ 196.3 163.3
తంగళ్లపల్లి 250.5 207.7
ఇల్లంతకుంట 188.2 199.9
-----------------------------------------------------
సగటు వర్షపాతం 232.5 158.8
-----------------------------------------------------
జిల్లాలో ఇప్పటి వరకు ఖరీఫ్ సాగు (ఎకరాల్లో)
మండలం మొత్తం వరి పత్తి
గంభీరావుపేట 7055 7000 50
ఇల్లంతకుంట 27420 14500 12000
ముస్తాబాద్ 8904 8500 300
సిరిసిల్ల 1355 800 550
తంగళ్లపల్లి 2910 2000 850
వీర్నపల్లి 4300 4000 300
ఎల్లారెడ్డిపేట 9000 7500 1500
బోయినపల్లి 9980 3500 6400
చందుర్తి 12120 6000 6100
కోనరావుపేట 14200 11000 3200
రుద్రంగి 3994 210 2190
వేములవాడ 5118 680 4400
వేములవాడ రూరల్ 10039 6000 4000
---------------------------------------------------------------------
మొత్తం 116395 71690 41850
---------------------------------------------------------------------