Share News

raajanna siricillla : పల్లెలో ‘సోషల్‌’ వార్‌

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:44 AM

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) పంచాయతీ ఎన్నికల్లో సోషల్‌ వార్‌ మొదలైంది. ఒకప్పుడు పంచాయతీ ఎన్నికలంటే గ్రామాల్లో నీలిరంగు, జాజిరంగులతో అభ్యర్థుల పేర్లు, గుర్తులు, అభివృద్ధి నినాదాలతో గోడలన్నీ నింపేవారు.

raajanna  siricillla :  పల్లెలో ‘సోషల్‌’ వార్‌

- సోషల్‌ మీడియాలో ప్రచారపు జోరు

- పంచాయతీ ఎన్నికల్లో వాల్‌రైటింగ్‌, బ్యానర్లు దూరం

- వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ల్లో ‘పంచాయతీ’

- జిల్లాలో మొదటి, రెండో విడతల్లో జోరందుకున్న ప్రచారం

- మొదటి విడతలో సర్పంచ్‌ అభ్యర్థులు 295 మంది, వార్డు అభ్యర్థులు 1377 మంది

- రెండో విడతలు సర్పంచ్‌ అభ్యర్థులు 279 మంది, వార్డు అభ్యర్థులు 1296 మంది

- తుది విడతలో సర్పంచ్‌ అభ్యర్థులు 514 మంది, వార్డు అభ్యర్థులు 1834 మంది

- 9వ తేదీ వరకు అభ్యర్థుల ఉపసంహరణలు గడువు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పంచాయతీ ఎన్నికల్లో సోషల్‌ వార్‌ మొదలైంది. ఒకప్పుడు పంచాయతీ ఎన్నికలంటే గ్రామాల్లో నీలిరంగు, జాజిరంగులతో అభ్యర్థుల పేర్లు, గుర్తులు, అభివృద్ధి నినాదాలతో గోడలన్నీ నింపేవారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలతో గోడరాతలకు కాలం చెల్లింది. ఆ తర్వాత బ్యానర్లు, ఫ్లెక్సీలు గ్రామ చౌరస్తాలో సందడిగా మారినా ఎన్నికల కమిషన్‌కు ప్రతి పైసా లెక్కలు చెప్పాల్సి ఉండడంతో వాటిని తగ్గించారు. ఇక అభ్యర్థులకు అరచేతిలో ప్రచార హస్తంగా మొబైల్‌ ఫోన్లు మారాయి. అభ్యర్థుల ఫొటోలు, గుర్తుల డిజైన్లతో వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఫేస్‌బుక్‌లో చక్కర్లు కొడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 సర్పంచ్‌ స్థానాలు, 2268 వార్డు స్థానాలకు నోటిఫికేషన్లు జారీ చేసి ఎన్నికలకు స్వీకారం చుట్టారు. మూడు విడతల్లో జరుగుతున్న ఎన్నికల్లో మొదటి, రెండో విడత అభ్యర్థుల లెక్క తేలిపోయింది. ప్రచార బాట పట్టారు.

ఇప్పటి వరకు 27 మంది సర్పంచులు ఏకగ్రీవమయ్యారు. తొలి విడతలో ఐదు మండలాల్లో 85 సర్పంచ్‌ స్థానాలు ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో ఏకగ్రీవం కాగా, 76 గ్రామపంచాయతీలు 295 మంది సర్పంచ్‌ అభ్యర్థులు, 229 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా, 519 వార్డుల్లో 1377 మంది అభ్యర్థులు బరిలో ఉన్నాయి. రెండో విడతలో మూడు మండలాల్లో 88 సర్పంచులు, 758 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. సర్పంచ్‌ స్థానాల్లో 11 మంది అభ్యర్థులు, 182 మంది వార్డు ఆభ్యర్థులు ఏకగ్రీవం కాగా, సర్పంచ్‌ అభ్యుర్థులు 279 మంది, 1296 వార్డు అభ్యర్థులు మంది పోటీలో ఉన్నారు. తుది విడతలో నాలుగు మండలాల్లో 87 సర్పంచులు, 762 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి. శనివారం నామినేషన్ల పరిశీలన జరిపారు. మిగిలిన నామినేషన్లలో సర్పంచ్‌ స్థానాలకు 514 నామినేషన్లు, 1834 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు వచ్చాయి. ఈనెల 9వ తేది వరకు ఉపసంహరణలకు గడువు ఉంది.

రాజకీయ వేడి రగిలిస్తున్న సామాజిక మాధ్యమాలు

దేశ రాజకీయాలు, ఎంపీ ఎన్నికలకు పరిమితమైన సామాజిక మాధ్యమాలు ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికల్లోను రాజకీయాలను వేడి రగిలిస్తున్నాయి. ఎలాంటి ఖర్చు లేకుండా నయా ట్రెండ్‌ సోషల్‌ మీడియా మారింది. ప్రతి ఒక్కరికి స్మార్ట్‌ ఫోన్‌తో పాటు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను ఫాలోయింగ్‌ అవుతున్నవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో సోషల్‌ మీడియా ట్రెండింగ్‌ పెరిగింది. రకరకాల రీల్స్‌ చేయడం గ్రామాల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు గ్రామాల్లో వారిగా సామాజిక గ్రూపులు ఏర్పాటుచేసి పోస్టులు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. ఒక్క అభ్యర్థి వాట్సాప్‌లో 20 గ్రూపుల వరకు ఏర్పాటుచేసి తమను గెలిపిస్తే చేసే పనులపై సొంత కథనాలు పోస్టులు పెడుతున్నారు. పలు సోషల్‌ మీడియా ఛానల్‌ నిర్వాహకులు ప్యాకేజీల ద్వారా పనిచేయడం మొదలు పెట్టారు. మరోవైపు ప్రధాన రాజకీయ పార్టీల భంగపడిన అభ్యర్థులు, పార్టీలు నాయకులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండగా, వాటిని ఖండిస్తూ మద్దతుదారుల పోస్టులు రాజకీయ చర్చలకు దారి తీస్తున్నాయి.

రీల్స్‌ వీడియోలు.. పాటలు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి, రెండో విడత గుర్తుల కేటాయింపుతో పోటీలో ఉన్న సర్పంచ్‌, వార్డు అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించడానికి వీడియో రికార్డులతో రీల్స్‌, ఆడియో పాటలు, మాటలతో ప్రచారాలు జోరుగా సాగిస్తున్నారు. గ్రామాల్లో తాము చేయబోయే పనులు సేవా కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం చేస్తున్నారు. పార్టీ నాయకులు, స్నేహితులు, బంధువులు, సన్నిహితుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టుకునే విధంగా విజ్ఞప్తులు చేస్తున్నారు. రకరకాల కొటేషన్లు, హెచ్చరికలతో ఆడియో ప్రచారాలు చేస్తున్నారు మరోవైపు యువత డబ్బు, మద్యానికి ఓటు వేయవద్దంటూ పోస్టులు పెడుతున్నారు. పార్టీలో ఉన్న యాక్టివ్‌ కార్యకర్తలు తమ అభ్యర్థి తరఫున పోస్టులు పెడుతూ అదరగొడుతున్నారు.

గ్రూపుల్లో రాజకీయ చర్చలు

జిల్లాలో పంచాయతీ ఎన్నికల చర్చలు కూడా వాట్సాప్‌ గ్రూపులు వేదికగా మారాయి. కుల సంఘాలు, యువజన సంఘాలు, స్నేహితుల గ్రూపులు, మహిళల కిట్టీ పార్టీ గ్రూపులు.. ఇలా రకరకాల పేర్లతో ఏర్పడిన సోషల్‌ మీడియాలో ఎవరికివారు ఎవరిని గెలిపించాలంటూ చర్చలు పెడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు పడుతున్న తీరుపై కూడా కామెంట్లు పెడుతున్నారు. దీంతో గ్రూపుల మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.

గుర్తులు గుర్తుండే విధంగా..

పోటీ చేస్తున్న అభ్యర్థులకు గుర్తులు ఓటర్లకు గుర్తుండే విధంగా చేయడమే ప్రధాన సమస్యగా ఉంది. బ్యాలెట్‌లపై పేర్లు, ఫొటోలు ఉండకపోవడంతో కొత్త గుర్తులను ప్రచారం చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. సోషల్‌ మీడియాతో పాటు వ్యక్తిగత ప్రచారంతో ప్రతి ఓటరును కలుస్తూ తమ గుర్తు చేరేలా ప్రచారం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు విడతల్లో ఈ నెల 11,14,17 తేదిలలో జరిగే ఎన్నికల్లో పోటీలో ఉండే సర్పంచ్‌ అభ్యర్థులకు 30 గుర్తులను, వార్డు సభ్యులకు 20 గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించారు. వాటిలో ఉంగరం, కత్తెర, బ్యాట్‌, ఫుట్‌బాల్‌, లేడీస్‌ పర్సు, టూత్‌ పేస్ట్‌, టీవీ రిమోట్‌, స్పానర్‌, చెత్త డబ్బా, బ్లాక్‌ బోర్డ్‌, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్‌, డోర్‌ హ్యాండిల్‌, చాయ్‌ జల్లెడ, చేతికర్ర, మంచం, పలక, టేబుల్‌, బ్యాటరీలైట్‌, బ్రష్‌, బ్యాట్‌మెన్‌, తెరచాపతో పడవ, బిస్కెట్‌, ఫ్లూట్‌, చైన్‌, చెప్పులు, బెలూన్‌, క్రికెట్‌ స్టంప్స్‌ గుర్తులు ఉన్నాయి. వార్డు సభ్యుల అభ్యర్థులకు గౌను, గ్యాస్‌స్టవ్‌, స్టూల్‌, గ్యాస్‌ సిలిండర్‌, బీరువా, విజిల్‌, కుండ, డిష్‌ యాంటీనా, గరాటా, మూకుడు, ఐస్‌ క్రీమ్‌, గాజు గ్లాస్‌, పోస్ట్‌ డబ్బా, ఎన్వలప్‌ కవర్‌, హాకీస్టిక్‌ బాల్‌, నెక్‌టై, కటింగ్‌ ప్లేయర్‌, పెట్టే, విద్యుత్‌ స్తంభం, చాయ్‌కెటిల్‌ గుర్తులను అభ్యర్థులకు కేటాయిస్తున్నారు. అభ్యర్థులకు నచ్చకుంటే ఓటును నోటాకు వేసే అవకాశం కూడా ఇచ్చారు.

Updated Date - Dec 08 , 2025 | 12:44 AM