Raajanna siricilla : అభ్యర్థుల ఎంపికపై కుస్తీ..
ABN , Publish Date - Nov 28 , 2025 | 12:43 AM
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) పంచాయతీ ఎన్నికల పోరులో మొదటి విడత నామిషన్ల గడువు శుక్రవారంతో ముగుస్తుంది. దీంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కుస్తీ పడుతున్నాయి.
- మొదటి విడత నామినేషన్లకు రేపే గడువు
- పల్లె ఓట్లపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఫోకస్
- పల్లెల్లో రిజర్వేషన్ల లెక్కలతో ఆశావహులపై చర్చ
- మద్దతు కోసం ఆశావహుల ప్రయత్నాలు
- ముఖ్య నేతలతో ఆయా పార్టీల అధిష్ఠానాల చర్చలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
పంచాయతీ ఎన్నికల పోరులో మొదటి విడత నామిషన్ల గడువు శుక్రవారంతో ముగుస్తుంది. దీంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కుస్తీ పడుతున్నాయి. ఎన్నికల కమిషన్ మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణలో గురువారం మొదటి విడత ఎన్నికలకు నామిషన్ల స్వీకరణ ప్రారంభించారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా పల్లెల్లో ఎన్నికల కోలాహలం ఏర్పడింది. ఆశావహుల్లో ఎవరు నిలబడతారు, ఎవరు గెలుస్తారనే చర్చ గ్రామీణుల్లో జోరుగా సాగుతోంది. ఇదే క్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు తాజా రిజర్వేషన్ల ప్రకారం, సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులపైన పార్టీల నేతలు ఫోకస్ పెంచారు. జిల్లాలో 260 సర్పంచులు, 2268 వారు సభ్యుల స్థానాలు ఉండగా, తాజా రిజర్వేషన్ల ప్రకారం సర్పంచ్‌ల్లో 56 బీసీలకు రిజర్వ్ కాగా, మహిళకు 24 స్థానాలు, జనరల్‌గా 32 స్థానాలు ఉన్నాయి. వంద శాతం ఎస్టీ పంచాయతీలు 26 ఉండగా 11 మహిళలకు, 15జనరల్‌కు కేటాయించారు. మిగతా నాలుగు ఎస్టీ స్థానాల్లో రెండు మహిళలు, రెండు జనరల్‌గా ఉన్నాయి. ఎస్సీలకు 53 స్థానాలు కేటాయించగా, 24 మహిళలకు, 29 జనరల్‌గా ఉన్నాయి. జనరల్ స్థానాలు 121ఉండగా 58 మహిళకు, 63 జనరల్ స్థానాలుగా కేటాయించారు. 2268 వార్డుల్లో వందశాతం ఎస్టీ పంచాయతీల్లో 176 వార్డులు ఉండగా 88మహిళకు, 88 జనరల్, ఇతర 53 ఎస్టీ వార్డుల్లో 18 మహిళలకు, 35 జనరల్‌గా కేటాయించారు. 442 ఎస్సీ వార్డులలో 177 మహిళకు, 26 జనరల్‌గా ఉన్నాయి. 553 బీసీ వార్డుల్లో 222 మహిళకు, 331 జనరల్ స్థానాలుగా ఉన్నాయి. 1044 జనరల్ వార్డులో ్ల471 మహిళలకు, 573 జనరల్‌గా ఉన్నాయి. దీన ప్రకారం, జనరల్ బీసీ రిజర్వుడు స్థానాల్లో ఆశావహుల నుంచి గట్టి పోటీ ఉండగా, ఎస్టీ ఎస్సీ పోటీ తక్కువగానే కనిపిస్తోంది. దీంతో అభ్యర్థులు ఎంపికపై, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మండల నాయకులు జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఆశావహులు పార్టీల మద్దతు కోసం నేతల చుట్టూ తిరుగుతున్నారు.
అధికార కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం
అధికార కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జోష్ పెంచాయి. పోటీకి దూరంగా ఉన్న వాళ్లు సైతం మళ్లీ అనుకూలంగా రిజర్వేషన్లు ఉన్నవారు పోటీకి ముందుకు వస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపితేనే రాబోయే పరిషత్, బల్దియా ఎన్నికల్లో సులువుగా నెగ్గుకురావచ్చని భావిస్తున్నారు. వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నీ తానై నడిపిస్తుండగా, ఇటీవల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మూడు రోజుల క్రితమే సంగీతం శ్రీనివాస్‌ను అధిష్ఠానం నియమించింది. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు, ఓటమిలతో నూతన అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ప్రాబల్యంపై ప్రభావం బయట పడుతుందని పార్టీలో చర్చ జరుగుతోంది. జిల్లాలోని బోయినపల్లి మండలం చొప్పదండి నియోజవర్గంలో ఉంది ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఇల్లంతకుంట మండలం మానకొండూరు నియోజకవర్గంలో ఉంది కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడంతో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుపై ఆసక్తిగానే చర్చ జరుగుతోంది.
ఎన్నికలపై విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీల దృష్టి
పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులు, రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, సహకార సంస్థల ఎన్నికల్లో కీలకంగా మారే పరిస్థితి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు కూడా పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మద్దతు గెలిచినా, ఓటమిపాలైనా రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపైన సర్వే చేయించారు. జిల్లాలోని మండలాల ముఖ్య నాయకులతో సమీక్షలు నిర్వహించారు. వేములవాడ నుంచి ఇటీవల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూసిన చల్మెడ లక్ష్మీనరసింహారావు నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యతలు కీలకంగా మారనున్నాయి. బీఆర్‌ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ వైఫల్యాలు పల్లెల్లో ప్రచారం చేయాలని వ్యూహాత్మకంగా కనిపిస్తున్నారు. మరోవైపు బీజేపీ జిల్లాలో తన ఉనికిని చాటుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంటు పరిధిలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఉండడంతో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కూడా చర్చ మొదలైంది. ఇటీవలనే బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రెడ్డబోయిన గోపిని నియమించారు. వేములవాడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన చెన్నమనేని వికాస్‌రావుపై వేములవాడ నియోజకవర్గంలోని మండలాల సర్పంచుల గెలుపు బాధ్యతలు ప్రధానంగా ఉండబోతున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీలు ఎంతవరకు ప్రభావం చూపుతోందనే ఆసక్తి జిల్లా ప్రజల్లో కనిపిస్తోంది.