Share News

raajanna siricilla : కలుపు కష్టాలు..

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:57 AM

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) తెల్ల బంగారంగా దిగుబడినిస్తుందని ప్రతి ఏటా రైతులు పత్తి వైపు మొగ్గు చూపుతూ అనేక కష్టాల మధ్య సాగు చేస్తున్నారు.

raajanna siricilla :  కలుపు కష్టాలు..

- కూలీల కొరతతో అన్నదాతలు సతమతం

- పత్తి చేలల్లో పెరుగుతున్న గడ్డి మొక్కలు

- రైతులకు తప్పని మందుల స్ర్పే

- జిల్లాలో చివరి దశకు చేరుకున్న పత్తి సాగు

- వానాకాలం సాగు 2.43 లక్షల ఎకరాల అంచనా

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

తెల్ల బంగారంగా దిగుబడినిస్తుందని ప్రతి ఏటా రైతులు పత్తి వైపు మొగ్గు చూపుతూ అనేక కష్టాల మధ్య సాగు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సీజన్లో ప్రధానంగా వరి తర్వాత పత్తి పంట సాగు చేస్తారు. రోహిణి కార్తెలోనే ముందస్తుగానే వర్షాలు మురిపించి తర్వాత ముఖం చాటేశాయి. దీంతో పత్తి విత్తనాలు భూమిలోనే మాడిపోతాయని, మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతాయని ఆందోళన చెందుతున్న క్రమంలో ఈనెల మొదటి వారంలో కురిసిన వర్షాలు పత్తికి జీవం పోశాయి. మళ్లీ రైతుల్లో పంట చేతికి వస్తుందని ఆశలు కల్పించాయి. జిల్లాలో నైరుతి ముందే వచ్చిందని రైతులు ముందస్తుగానే పత్తి విత్తనాలు నాటుకున్నారు. అయితే పత్తి మొలకెత్తిన రైతులకు ఇప్పుడు కలుపు కష్టాలు మొదలయ్యాయి. కలుపు విపరీతంగా పెరుగుతుండడం, మరోవైపు కూలీల కొరత ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో పత్తి రైతులు కలుపు తీయడానికి రోజు కూలి రూ 450 నుంచి రూ 500 వరకు ఖర్చు చేస్తున్నారు. జిల్లాలో 49,760 ఎకరాల్లో పత్తిసాగు లక్ష్యంగా పెట్టుకోగా, రైతులు ఇప్పటివరకు 39,540 ఎకరాల్లో విత్తనాలు వేసుకున్నారు. దీంతో పాటు మొక్కజొన్న 2,393 ఎకరాలు, కందులు 279 ఎకరాలు, పెసర 10 ఎకరాలు, ఇతర పంటలు 56 ఎకరాల్లో వేసుకున్నారు.

కలుపు నివారణకు మందుల స్ర్పే..

గడ్డిమందు నిషేధంతో పత్తి సాగులో కలుపు తీయడానికి రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. చేన్లలో ఎక్కువగా తుంగ, గరక, గడ్డిజాతి మొక్కలు ఎక్కువగా పెరిగాయి. వీటి నివారణకు గతంలో గడ్డి మందు ఎక్కువగా ఉపయోగించే వారు. గ్లైకోసెట్‌ వంటి మందులు జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయని, క్యాన్సర్‌ వంటి వాటికి దారి తీస్తుందని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిన మందులు కలుపును నివారించడానికి ఉపయోగపడడం లేదని రైతులు చెబుతున్నారు. కురుస్తున్న వర్షాలకు పత్తి పంటలు కలుపు మొక్కలు పెరగడంతో నిషేధిత మందులను కూడా స్ర్పే చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు వివిధ రకాల పేర్లతో వస్తున్న కలుపు నివారణ మందులను విరివిగా స్ర్పే చేస్తున్నారు. కలుపు నివారణ మందులపై రైతులు ఆధారపడుతున్నారు. జిల్లాలో డ్రోన్‌ ద్వారా మందులు స్ర్పే చేస్తే ఎకరానికి రూ 600 వరకు తీసుకుంటున్నారు. ఖర్చు ఎక్కువ అవుతున్న తప్పని పరిస్థితుల్లో రైతులు గడ్డి మందులను ఉపయోగిస్తున్నారు.

కూలీల కొరతతో వరి నాట్లకు ఇబ్బందులే..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పునాస పంటలకు కూలీల కొరత ఇబ్బందిగా మారింది. వర్షాలు సమృద్ధిగా లేక పోవడంతో వరి నాట్లు వేగం ఆందుకోవడం లేదు. వరినాట్ల కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు రావడంతో ఊపందుకున్నాయి. జిల్లాకు బీహార్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌, ఛత్తీస్‌ఘడ్‌, రాష్ట్రాల నుంచి వలసవచ్చారు. ఎకరానికి రూ 6 వేల నుంచి రూ 7 వేల వరకు తీసుకుంటున్నారు. పత్తి, మొక్కజ్నొ చేన్లలో స్థానిక కూలీలు రూ 450 నుంచి రూ 500 వరకు కూలి తీసుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలంలో 2,43,773 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయడానికి రైతులు సిద్ధమయ్యారు. వరి సాగు లక్షా 84 వేల 860 ఎకరాలు, మొక్కజొన్న 1600 ఎకరాలు, పత్తి 49,760 ఎకరాలు, కందులు 1,155 ఎకరాలు, పెసర 79 ఎకరాలు, ఇతర పంటలు 6,304 ఎకరాలు, ఇతర పంటలు 6,900 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. ఇందులో 37,440 ఎకరాలకు నాట్లు పడ్డాయి. ఇప్పటి వరకు జిల్లాలో 79,718 వేల ఎకరాల్లో నాట్లు వివిధ పంటలు రైతుల వేసుకున్నారు.

జిల్లాలో ఖరీఫ్‌ సాగు ఇలా..

మండలం వరి పత్తి ఇతర మొత్తం

గంభీరావుపేట 18,600 200 530 19,330

ఇల్లంతకుంట 24,000 12,500 1,970 38,470

ముస్తాబాద్‌ 23,000 600 1,650 25,250

సిరిసిల్ల 4,900 850 103 5,853

తంగళ్లపల్లి 19,950 1,000 1,081 22,031

వీర్నపల్లి 8,360 400 32 8,792

ఎల్లారెడ్డిపేట 17,500 3,600 30 21,130

బోయినపల్లి 13,000 7,000 1,310 21,310

చందుర్తి 15,200 6,200 210 21,610

కోనరావుపేట 18,200 4,800 700 23,700

రుద్రంగి 5,900 3,400 805 10,105

వేములవాడ 5,200 5,010 368 10,578

వేములవాడ రూరల్‌ 11,050 4,200 364 15,614

--------------------------------------------------------------------------------------------------

మొత్తం 1,84,860 49,760 9,153 2,43,773

---------------------------------------------------------------------------------------------------

Updated Date - Jul 14 , 2025 | 12:57 AM