Share News

Raajanna siricilla : రైతు బీమాకు వేళాయె..

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:57 AM

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) అన్నదాతల కుటుంబాలకు ధీమాగా మారిన రైతుబీమాకు వేళయింది. కొత్త పట్టాదారులు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.

Raajanna siricilla :  రైతు బీమాకు వేళాయె..

- 13 తేదీలోగా దరఖాస్తుల స్వీకరణ

- 14న పాలసీ రెన్యూవల్‌

- రైతువేదికల వద్ద దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు

- ప్రభుత్వమే ప్రీమియం డబ్బుల చెల్లింపు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

అన్నదాతల కుటుంబాలకు ధీమాగా మారిన రైతుబీమాకు వేళయింది. కొత్త పట్టాదారులు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎనిమిదోసారి ఎల్‌ఐసీ ద్వారా ఫార్మర్స్‌ గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ స్కీంలో 2025-26 సంవత్సరానికి సంబంధించి రైతులను చేర్చే ప్రక్రియ మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం 80,185 మంది రైతులు బీమాలో నమోదై ఉన్నారు. ఈసారి కూడా ప్రభుత్వం రైతు కుటుంబాలకు ధీమా కల్పించేందుకు ప్రభుత్వం ప్రీమియం చెల్లించి అమలు చేస్తోంది.

- 60 ఏళ్లు నిండిన రైతులు తొలగింపు

రైతు బీమాలో చేరడానికి 18 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉన్న వారు అర్హులు. గతంలో ఈ పథకం పరిధిలో ఉన్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. గతంలో పాలసీలో ఉన్న వారందరి డేటాను పరిశీలించి తిరిగి పాలసీని పునరుద్ధరించ నున్నారు. ఇందులో 60 సంవత్సరాలు నిండిన రైతులను తొలగిస్తారు. దీంతోపాటు రైతు బీమా నమోదు చేసుకున్న రైతులు వారి నామినీ ఏదైనా కారణంతో మృతిచెందినా, కొత్త నామినీలను నమోదు చేసే అవకాశం కల్పించింది. కొత్త నామినీ ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా పాటు ఇతర వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

- కొత్త పట్టాదారులకు అవకాశం

రైతు బీమా పాలసీలో కొత్త పట్టాదారుల అవకాశం కల్పిస్తూ దరఖాస్తులను ఈనెల 13 తేదీ వరకు వ్యవసాయ అధికారులకు అందించాలి. రైతులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌ కార్డు, నామినీ ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో దరఖాస్తులు చేసుకోవచ్చు. కొత్త, పాత పట్టాదారులు, ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాదారుల వివరాలను గ్రామాల వారీగా బీమా పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను వ్యవసాయశాఖ నాలుగు కేటగిరీలుగా విభజించింది. ప్రాధాన్య క్రమంలో పాలసీ నమోదును పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టింది. కొత్త పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన వారికి కేటగిరీ ప్రాధాన్యం ఇస్తూ వారి వివరాలను బీమా పోర్టల్‌లో నమోదు చేయడానికి ఈనెల 13వ తేదీ వరకు పూర్తిచేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఐదెకరాల కన్నా తక్కువ వ్యవసాయ భూమి కలిగిన..

పాత పట్టాదారుల వివరాలను కూడా రెండో కేటగిరీ కింద 13వ తేదీలోగా అప్‌లోడ్‌ చేయాలి. మూడో కేటగిరీ కింద గతంలో రైతు బీమా కింద ఎనిమిదో సంవత్సరం పాలసీలోను కొనసాగే అర్హులైన రైతుల వివరాలను మండల వ్యవసాయ అధికారులు లాగిన్‌లో అందుబాటులో ఉంచాలని, పొరపాట్లు ఉంటే సవరించడంతోపాటు కొత్త వివరాలు ఏమైనా వస్తే వాటిని చేర్చి తిరిగి ఏఈవో లాగిన్‌లోకి పంపాలి. ఈ ప్రక్రియ 12వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐదెకరాల భూమిపైన ఉన్న రైతులు ఇప్పటివరకు రైతు బీమా పరిధిలోకి రాని వారిని గుర్తించి వారు వివరాలను సైతం 13వ తేదీ నాటికి పోర్టల్‌లో చేర్చాల్సి ఉంటుంది. ఈనెల 14 వ తేదీ వరకు రైతు బీమా పాలసీలు రెన్యువల్‌ చేయనున్నారు. రైతులు బీమా కోసం తన వివరాలను అందించడానికి రైతు వేదికల వద్ద వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

- రూ 133.75 కోట్ల బీమా పరిహారం

జిల్లాలో 2018 నుంచి ఇప్పటివరకు బీమా పథకంలో రైతులు నమోదవుతూ వస్తున్నారు. 2024-25 సంవత్సరంలో 80,185 మంది రైతులు నమోదయ్యారు. ఈసారి కొత్తగా ఆరు వేల మంది రైతులు నమోదయ్యే అవకాశం ఉంది. జిల్లాలో ఇప్పటివరకు రైతు బీమా ద్వారా 2,675 మంది రైతు కుటుంబాలు బీమా పరిహారం పొందారు. 2018లో 318 మంది, 2019లో 337 మంది, 2020లో 536 మంది, 2021లో 387 మంది, 2022లో 376మంది, 2023లో 385 మంది, 2024లో 336 మంది రైతులు చనిపోగా వారి కుటుంబాలు బీమా సాయాన్ని పొందాయి. ఇప్పటివరకు రూ 133.75 కోట్ల వరకు బీమా పరిహారం పొందారు.

వ్వవసాయ లెక్కలు ఇలా..

ప్రభుత్వం గతంలో జరిపిన వ్యవసాయ గణాంకాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,10,883 మంది రైతులకు సంబంధించి 2,43,157.16 ఎకరాల వ్యవసాయ భూమి లెక్కలోకి వచ్చింది. ఎస్సీలకు సంబంధించి 15,219 మంది రైతులకు 25,242.04 ఎకరాల భూమి ఉంది. ఎస్టీలకు సంబంధించి 3,742 మంది రైతులకు 8,769.14 ఎకరాల భూమి ఉండగా ఇతర సామాజిక వర్గాల్లో 91,919 మంది రైతులకు 2,09,627.17 ఎకరాలు ఉంది. 20,879 మంది మహిళ రైతులకు 44,460.15 ఎకరాల భూమి ఉంది.

కొత్త రైతులు దరఖాస్తు చేసుకోవాలి

- అఫ్జల్‌ బేగం, జిల్లా వ్యవసాయ అధికారి

ప్రభుత్వం రైతు బీమా పథకం రెన్యువల్‌ కోసం మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతులు 13వ తేదీలోగా బీమా పాలసీ కోసం దరఖాస్తులు చేసుకోవాలి. ఇప్పటికే బీమా పథకంలో ఉన్న రైతులు నామినీలు, ఇతర మార్పులు, చేర్పులు ఉంటే వివరాలు అందించాలి. రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండి దరఖాస్తులు తీసుకుంటారు.

Updated Date - Aug 11 , 2025 | 12:57 AM