Share News

Raajanna siricilla : పల్లె ఓటెత్తింది...

ABN , Publish Date - Dec 12 , 2025 | 02:29 AM

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) గ్రామపంచాయతీ తొలి విడత ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది.

Raajanna siricilla :  పల్లె ఓటెత్తింది...

ఫ ఐదు మండలాలు 76 గ్రామపంచాయతీల్లో 79.57 శాతం ఓటింగ్‌

ఫ మొత్తం ఓటర్లు 1,11,148 మంది..పోలైన ఓట్లు 88,442 మంది..

ఫ సర్పంచ్‌ అభ్యర్థులు 295 మంది.. వార్డు సభ్యులు 1377 మంది

ఫ ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పంచాయతీ

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

గ్రామపంచాయతీ తొలి విడత ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది. చిదురుమదురు సంఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడతగా ఐదు మండలాలు 76 గ్రామసర్పంచ్‌లు, 516 వార్డులకు పోలింగ్‌, కౌంటింగ్‌ ఉత్సాహంగా, ఉత్కంఠతగా సాగింది. వేములవాడ అర్బన్‌, వేములవాడ రూరల్‌, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట మండల కేంద్రాల నుంచి ఒక్కరోజు ముందుగానే 2033 మంది సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. 521 పోలింగ్‌ కేంద్రాల్లో గురువారం ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రారంభించి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగింది. ప్రతి పల్లెలోను చివరి వరకు ఎంతో ఉత్సాహంగా ఓట్లు వేయడానికి తరలివచ్చారు. అత్యధికంగా మొదటి విడతలో 79.57 శాతం ఓటింగ్‌ జరిగింది. పోలింగ్‌ ముగిసిన గంట తర్వాత కౌంటింగ్‌ ప్రారంభించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పార్టీలకు ప్రమేయం లేకుండా తమకు అనుకూలమైన వ్యక్తుల కోసం ప్రచారం నిర్వహించారు. పల్లెల్లో ఎటు చూసినా ఎన్నికల సందడి గెలుపు చర్చలు వినిపించాయి. తొలి విడత పంచాయతీ ఎన్నికలను జిల్లా ఇంచార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌లతోపాటు అదనపు కలెక్టర్‌ నగేష్‌, ఎన్నికల పరిశీలకులు పోలింగ్‌, కౌంటింగ్‌లను పర్యవేక్షించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల నుంచి సౌకర్యాలపై అరా తీశారు. పోలింగ్‌, కౌంటింగ్‌లో 521 పోలింగ్‌ కేంద్రాలలో 2033 మంది సిబ్బంది విధులు నిర్వహించారు. ఇందులో చందుర్తిలో 468 మంది, కోనరావుపేటలో 646 మంది,రుద్రంగిలో 246 మంది, వేములవాడలో 304మంది, వేములవాడ రూరల్‌లో 371 మంది స్బింది పాల్గొన్నారు..

ఓటు వేసిన ప్రముఖులు

తొలి విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రుద్రంగిలో ప్రభుత్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. కోనరావుపేట మండలం నాగారంలో బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ చెన్నమనేని వికాస్‌రావు డాక్టర్‌ దీప దంపతులు ఓటు వేశారు. మల్కపేటలో బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు దంపతులు, వేములవాడ రూరల్‌ మండలం రుద్రవరంలో మాజీ ఎమ్మెల్యే రేగులపాటి పాపారావులతో పాటు వివిధ పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఐదు మండలాల్లో పోలైన ఓట్లు 88,442..

జిల్లాలో తొలి విడతలో చందుర్తి, రుద్రంగి, వేములవాడ, వేములవాడ రూరల్‌, కోనరావుపేట మండలాల్లో 76 గ్రామపంచాయతీలు, 516 వార్డుల్లో జరిగిన పోలింగ్‌లో 88,442 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1,11,148 మంది ఓటర్లు ఉండగా 79.57 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐదు మండలాల్లో మొత్తం పోలింగ్‌లో చందుర్తిలో 21,823మంది ఓటు హక్కు వినియోగించుకోగా పురుషులు 9,544 మంది, మహిళలు 12,279 మంది ఉన్నారు. కోనరావుపేటలో 28420మంది ఓటు హక్కు వినియోగించుకోగా పురుషులు 13,099 మంది, మహిళలు 15,321 మంది ఉన్నారు.రుద్రంగిలో 7,987 మంది ఓటు హక్కు వినియోగించుకోగా పురుషులు 3230 మంది, మహిళలు4757మంది ఉన్నారు. వేములవాడలో 14,687 మంది ఓటు హక్కు వినియోగించుకోగా పురుషులు 6,855 మంది, మహిళలు 7,822మంది ఉన్నారు. వేములవాడ రూరల్‌లో15,525 మంది ఓటు హక్కు వినియోగించుకోగా పురుషులు 6,965 మంది, మహిళలు 8,560 మంది ఉన్నారు.

మహిళా ఓటింగ్‌ అధికం

జిల్లాలోని తొలి విడతలోని ఐదు మండలాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మహిళలు అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో 1,11,148 ఓటర్లు ఉండగా పురుషులు 53,492మంది, మహిళలు 57,638 ఉన్నారు. ఇందులో ఎన్నికల్లో 88,442 మంది ఓటు వేశారు. పురుషులు 39,693 మంది, మహిళలు 48,739 మంది. ఇతరులు 10 మంది ఓటు వేశారు. 9,046 మంది మహిళలు అధికంగా ఓటు వేశారు. తొలి విడతలో 79.57 శాతం పోలింగ్‌ జరగగా పురుషులు 74.20 శాతం, మహిళలు 84.56 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

తొలి విడతలో 76 గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఐదు మండలాల్లోని 76 గ్రామాల్లో 700 మంది పోలీస్‌ సిబ్బందిని ఎన్నికల నిర్వహణకు ఉపయోగించారు. ఎస్పీ మహేష్‌ బీ గీతే పర్యవేక్షణలో అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో పాటు ప్రత్యేక బృందాలను, 25 రూట్లలో మొబైయిల్‌ బృందాలు, ఏడు జోనల్‌ బృందాలు, ఐదు క్విక్‌ రియాక్షన్స్‌ బృందాలు, రెండు స్ట్రైకింగ్‌ ఫోర్స్‌లను చూరుకుగా పని చేశాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టారు. 14 సమస్యాత్మక, 13 సున్నితమైన గ్రామాలుగా గుర్తించి ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద అభ్యర్థుల తరపున గెలుపు కోసం వారి అనుచరులు ప్రచారం నిర్వహిస్తుండగా పోలీసులు వెళ్లగొట్టడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కోనరావుపేట మండలంలో మల్కపేటలో పోలింగ్‌ బూత్‌లో ఏజంట్లు ఒక అభ్యర్థికి ఓట్లు వేయాలని చెప్పడంతో వివాదస్పదంగా మారింది. గొడవకు దారి తీయడంతో పోలీసులు అడ్డుకొని శాంతింపజేశారు. ఎస్పీ స్వయంగా పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి సూచనలు చేశారు. పోలింగ్‌ కేంద్రం వద్ద పోలీసులు వృద్ధులను స్వయంగా వీల్‌చైర్‌లో తీసుకెళ్లి ఓటును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. గ్రామాల్లో ప్రశాంతంగా పోలింగ్‌ ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

పోలింగ్‌ సరళి ఇలా

మండలం 9గంటలకు 11గంటలకు 1.00గంటలకు(ఫైనల్‌)

చందుర్తి 14.75శాతం 41.06 శాతం 77.68శాతం

కోనరావుపేట 17.81శాతం 52.19 శాతం 82.04 శాతం

రుద్రంగి 18.20 శాతం 46.04 శాతం 71.98శాతం

వేములవాడ 19.88శాతం 53.23శాతం 79.42శాతం

వేములవాడరూరల్‌ 18.03శాతం 49.55శాతం 82.47శాతం

----------------------------------------------------------------------------------------

మొత్తం 17.46 శాతం 48.19 శాతం 79.57శాతం

----------------------------------------------------------------------------------------

మండలాల వారీగా పోలైన ఓట్లు

మండలం మొత్తం ఓటర్లు 9గంటలకు 11గంటలకు 1.00గంటలకు(ఫైనల్‌)

చందుర్తి 28094 4143 11535 21823

కోనరావుపేట 34641 6169 18080 28420

రుద్రంగి 11096 2020 5109 7987

వేములవాడ 18492 3676 9843 14687

వేములవాడ రూరల్‌ 18825 3394 9327 15525

------------------------------------------------------------------------------------------------------------------------------------------------

మొత్తం 111148 19402 53894 88442

------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Updated Date - Dec 12 , 2025 | 02:29 AM