Raajanna siricilla : వెక్కిరిస్తున్న ఖాళీలు..
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:44 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) అంగన్‌వాడీ ఖాళీల భర్తీ ఊరిస్తూ వెక్కిరిస్తున్నాయి. తరచూ భర్తీపై ప్రభుత్వ ఆశలు కల్పిస్తున్న నోటిఫికేషన్ మాత్రం రావడం లేదు.
- జిల్లాలోని అంగన్‌వాడీల్లో 234 పోస్టులు ఖాళీ..
- పోస్టుల భర్తీ కోసం నిరుద్యోగుల ఎదురుచూపులు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
అంగన్‌వాడీ ఖాళీల భర్తీ ఊరిస్తూ వెక్కిరిస్తున్నాయి. తరచూ భర్తీపై ప్రభుత్వ ఆశలు కల్పిస్తున్న నోటిఫికేషన్ మాత్రం రావడం లేదు. మహిళా దినోత్సవం సందర్భంగా నోటిఫికేషన్ ఇస్తామని మంత్రి ఇచ్చిన హామీ కూడా ఆచరణలోకి రాలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 586 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా టీచర్లు, ఆయాల ఖాళీలు 234కు చేరాయి. టీచర్లు, ఆయాలకు పదవీ విరమణ బెనిఫిట్స్ రావడంతో ప్రతినెలా 10 నుంచి 15 మంది వరకు పదవీ విరమణ పొందుతున్నారు. దీంతో టీచర్ పోస్టు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యత పక్కనే ఉన్న కేంద్రాల టీచర్లకు అప్పగించడంతో అదనపు భారం మోయాల్సి వస్తోంది. దీనికి తోడు ప్రభుత్వం ఇటీవల వివిధ యాప్‌ల ద్వారా ఫొటో క్యాప్చర్ విధానం తీసుకురావడంతో కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నిరుద్యోగ మహిళలు అంగన్‌వాడీ ఖాళీల భర్తీ నోటిఫికేషన్ కోసం నిరీక్షిస్తున్నారు.
జిల్లాలో 55 టీచర్లు, 179 ఆయాల ఖాళీలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 586 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 20 మినీ కేంద్రాలు ఉండగా వాటిని పూర్తిస్థాయి కేంద్రాలుగా మార్చారు. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో రిటైర్‌మెంట్ పక్రియను అమల్లోకి తేవడంతో ఒకేసారి జిల్లాలో 122 పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రతినెలా ఖాళీలు పెరుగుతున్నాయి. గతంలో ఉన్న ఖాళీలతో కలుపుకోని జిల్లాలో 234 పోస్టులు భర్తీ కావాల్సి ఉంది. జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల్లో 55 టీచర్లు, 179 ఆయాలు ఖాళీగా ఉన్నాయి. సిరిసిల్ల ప్రాజెక్ట్ పరిధిలో 362 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 41 టీచర్ పోస్టులు, 109 అయాలు, వేములవాడ ప్రాజెక్ట్ పరిధిలో 224 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా 14 టీచర్ పోస్టులు, 70 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెద్ద మొత్తంలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే నిరుద్యోగ మహిళలకు ఊరటనిస్తుందని భావిస్తున్నారు.
ఈసారి ఇంటర్ అర్హత..
అంగన్‌వాడీల్లో ఖాళీల భర్తీకి సంబంధించి గతంలో విద్యార్హతల్లో టీచర్లకు పదవ తరగతి, ఆయాలకు 7వ తరగతి అర్హతగా ఉంది. ప్కీ స్కూల్‌గా మార్చి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పూర్వ విద్యను అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈసారి టీచర్లు, ఆయాలకు ఇంటర్మీడీయట్ అర్హతగా నిర్ణయించారు. టీచర్లు, ఆయాలకు వయస్సు 18 నుంచి 35 ఏళ్లుగా నిర్ణయించారు. ఇప్పటికే జిల్లా సంక్షేమ శాఖ అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఖాళీల నివేదికలను ప్రభుత్వానికి పంపించారు. మార్గదర్శకాలు రావాల్సి ఉంది.
అంగన్‌వాడీల్లో 30532 మంది లబ్ధిదారులు
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 586 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 30532 మంది పౌష్టికాహారాన్ని పొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో గర్భిణులు 3234 మంది, 2609 మంది బాలింతలు ఉన్నారు. వీరితో పాటు 3 సంవత్సరాలలోపు పిల్లలు 16848 మంది, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు 7841 మంది ఉన్నారు. వీరికి ఆరోగ్యలక్ష్మి ద్వారా పౌష్టికాహారం, ఆరు నెలల నుంచి 3 సంవత్సరాలలోపు చిన్నారులకు బాలామృతంతో పాటు 16 కోడిగుడ్లు, హోం రేషన్ అందిస్తున్నారు. చిన్నారులకు ఒక్కపూట సంపూర్ణభోజనం, గుడ్డు, పాలు కుర్‌కురేవంటి స్నాక్స్‌లు అందిస్తున్నారు. సమర్థవంతంగా అంగన్‌వాడీ కేంద్రాలు కొనసాగుతున్నప్పటికీ ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉండడంతో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.