Raajanna siricilla : మద్యం టెండర్లలో బినామీల రాజ్యం..
ABN , Publish Date - Oct 27 , 2025 | 12:56 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) మద్యం టెండర్లలో బినామీలదే రాజ్యంగా మారింది. దుకాణాలు దక్కించుకోవడానికి లిక్కర్ వ్యాపారులు తెర వెనుక వ్యూహాలు మొదలుపెట్టారు.
- లక్కు లేకున్నా షాపులు దక్కించుకునేందుకు వ్యూహాలు
- గుడ్‌విల్ రూ.40-60లక్షల వరకు చెల్లించేందుకైనా సిద్ధం
- జిల్లాలో 48 దుకాణాలు.. 1,381 దరఖాస్తులు
- దరఖాస్తుల ద్వారా ఎక్సైజ్ శాఖకు రూ 41.43 కోట్ల ఆదాయం
- నేడు కలెక్టర్ నేతృత్వంలో డ్రా పద్ధతిలో దుకాణాల కేటాయింపు
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మద్యం టెండర్లలో బినామీలదే రాజ్యంగా మారింది. దుకాణాలు దక్కించుకోవడానికి లిక్కర్ వ్యాపారులు తెర వెనుక వ్యూహాలు మొదలుపెట్టారు. ఏది ఏమైనా డ్రాలో దుకాణాలు రాకపోయినా దుకాణాలు వదిలేదన్నట్లుగా ఎన్ని డబ్బులు అయినా గుడ్ విల్ కింద ఇవ్వడానికి మద్యం వ్యాపారులు సిద్ధమవుతున్నారు. డ్రాకంటే ముందే తోటి వ్యాపారులకు దుకాణాలు ఇవ్వడానికి ముందస్తు ఆఫర్లు కూడా ఇస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 48 దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా, 1381 దరఖాస్తులు వచ్చాయి. గౌడ, ఎస్సీ, ఎస్టీల సామాజిక వర్గాలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించింది. జిల్లాలో 9 దుకాణాలు గౌడ సామాజిక వర్గానికి, 5 దుకాణాలు ఎస్సీ వర్గానికి కేటాయించారు. ప్రభుత్వం దరఖాస్తు ఫీజును ఈసారి రూ లక్ష పెంచి రూ.3లక్షలకు నిర్ణయించింది. అయినప్పటికీ మద్యం వ్యాపారులు సిండికేట్ మారి దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులు తగ్గిన పెరిగిన ఫీజుతో ఎక్సైజ్ శాఖకు ఆదాయం మాత్రం యథావిధిగా సమకూరింది. మద్యం వ్యాపారులు గౌడ, ఎస్సీ రిజర్వేషన్లను కూడా తమకు అనుకూలంగా బినామీలుగా మార్చుకొని టెండర్లు వేసినట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాలు లక్కీ డ్రాలో రాకపోయినా వచ్చినవారి నుంచి దుకాణాలు తీసుకోవడానికి గుడ్‌విల్ కింద రూ 40 లక్షల నుంచి రూ 60 లక్షల వరకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు.
ఫ డ్రాపై ఉత్కంఠ..
మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల గడువు ఈనెల 18న ముగిసిన అనుకున్న మేరకు దరఖాస్తులు రాకపోవడంతో ఈనెల 23 వరకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. గడువు పొడిగించడంతో ఎక్సైజ్ శాఖకు ఆదాయంపై ఊరట లభించింది. సోమవారం కలెక్టరేట్ హాల్‌లో కలెక్టర్ గరిమా అగర్వాల్ నేతృత్వంలో డ్రా పద్ధతిలో దుకాణాల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఎక్సైజ్ శాఖ పూర్తి చేసింది. జిల్లాలో 48 మద్యం దుకాణాలకు 1381 దరఖాస్తులు రాగా, సిరిసిల్ల సర్కిల్లో 598 దరఖాస్తులు, వేములవాడ సర్కిల్ 354 దరఖాస్తులు, ఎల్లారెడ్డిపేట సర్కిల్ 429 దరఖాస్తులు వచ్చాయి. 2023-25 సంవత్సరానికి సంబంధించిన లైసెన్స్ కోసం2031 దరఖాస్తుల ద్వారా రూ.40.72 కోట్లు ఆదాయం సమకూరింది. ప్రస్తుతం 2025-27 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 1381 దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా రూ.41.43 కోట్ల ఆదాయం సమకూరింది. ఆరు స్లాబ్‌లో లైసెన్స్ ట్యాక్స్ వసూల్ చేస్తారు. 5 వేల జనాభా ఉన్న ప్రాంతాలకు లైసెన్స్ టాక్స్ రూ.50 లక్షలు, 5 నుంచి 50 వేల వరకు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష జనాభా వరకు రూ 60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల వరకు జనాభా ఉంటే రూ 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల వరకు రూ 85 లక్షల ట్యాక్స్ వసూలు చేస్తారు. 20 లక్షల పైన జనాభా ఉంటే రూ 1.10 కోట్లు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. డ్రా పద్ధతి ద్వారా దుకాణాలు కేటాయిస్తారు. డిసెంబరు 1,2025 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభమవుతాయి.