Raajanna siricilla : టెట్ టెన్షన్
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:54 AM
ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) పరీక్షలు అంటే విద్యార్థులకు టెన్షన్ పట్టుకుంటుంది. కానీ ఇప్పుడు ఉపాధ్యాయుల్లో టెట్ పరీక్షపై ఆందోళన నెలకొన్నది.
- సుప్రీంకోర్టు తీర్పుతో ఉపాధ్యాయుల్లో గుబులు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
పరీక్షలు అంటే విద్యార్థులకు టెన్షన్ పట్టుకుంటుంది. కానీ ఇప్పుడు ఉపాధ్యాయుల్లో టెట్ పరీక్షపై ఆందోళన నెలకొన్నది. రెండేళ్లలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో గుబులు పట్టుకుంది. డీఎస్సీ రాసి అర్హత సాధించి ఉద్యోగంలోకి వచ్చిన వారికి ఇప్పుడు టెట్ అర్హత విధించడం సరైనది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. కొత్త సిలబస్‌తో టెట్ అర్హత సాధించడం కష్టతరమనే ఆందోళన ఉపాధ్యాయుల నుంచి వ్యక్తం అవుతోంది. టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత ఉండాలనే నిబంధన ఎలా ఉన్నా అసలు ఉద్యోగం ఉంచుతారా అనే ఆందోళన మొదలైంది.
జిల్లాలో 70 శాతానికి పైగా..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో489 పాఠశాలు ఉండగా 337 ప్రాథమిక పాఠశాలలు, 38 ప్రాథమికోన్నత పాఠశాలలు, 114 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి పాఠశాలల్లో 2,073 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 750 మంది, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 167మంది, ఉన్నత పాఠశాలల్లో 1,156 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో పీఈటీ, పీడీలు మినహాయిస్తే దాదాపు 70 శాతం సుమారుగా 1,400 మంది టెట్ అర్హత సాధించాల్సి ఉంది. టెట్‌లో అర్హత సాధించాలంటే పరీక్షలు కేటగిరీగా ఓబీసీలకు 90 మార్కులు, బీసీలకు 75 మార్కులు, ఎస్సీ, ఎసీ,్టపీహెచ్‌సీలకు 60 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. బీఎడ్, డీఎడ్‌తో సంబంధం లేకుండా ఎస్జీటీలుగా కొనసాగుతున్న టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు, ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయులు పేపర్ -1 పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇంతకుముందే పేపర్ -1 ఉత్తీర్ణత సాధించిన వారు మళ్లీ రాయాల్సిన అవసరం లేదు. టెట్ లేని ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి కావాలన్నా, స్కూల్ అసిస్టెంట్లకు జిహెచ్‌ఎం పదోన్నతులు కావాలన్నా పేపర్-2 ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి టెట్ తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23న ఎన్‌సీటీఈ ఉత్తర్వులు జారీ చేసింది. దీని తర్వాత టెట్ అర్హత సాధించిన వారే డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఐదేళ్ల లోపు సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులు మినహా జిల్లాలో వివిధ క్యాడర్లలో ఉన్న మిగతావారు టెట్ రాయాల్సి ఉంటుంది. సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు టెట్ పరీక్షకు హాజరయ్యేలా జీవోలో సవరణ చేశారు.
ఫ ఈ నెల 29వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ
ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రెండో విడత నోటిఫికేషన్‌విడుదల చేశారు. శనివారం నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలైంది ఈ నెల 29వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకున్న వారికి వచ్చే సంవత్సరం జనవరి 3 నుంచి 31 వ తేదీ వరకు ఆన్‌లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించనున్నారు.
అందరికీ ఒకే సిలబస్
ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టెట్ అర్హత కోసం పరీక్ష రాసే ఉపాధ్యాయులతో పాటు నిరుద్యోగులకు ఒకే విధమైన సిలబస్ అర్హత పరీక్ష ఉండబోతుంది. విద్యా బోధనకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మళ్లీ టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాలంటే మళ్లీ సిలబస్ చదవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పాఠశాలల సమయంలో తరగతుల బోధన తప్ప చదువుకునే వీలుండదు. దీంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.