Raajanna siricilla :రిజర్వేషన్ రివర్స్..
ABN , Publish Date - Nov 24 , 2025 | 12:52 AM
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) పల్లెపోరు ఆశావాహుల ఆశలు తారుమారు చేస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయడంతో బీసీల్లో నిరాశ నింపింది.
- ఆశావహుల ఆశలు తారుమారు
- పాత రిజర్వేషన్లతో చేజారిన అదృష్టం
- 50శాతం మించకుండా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి
- తుది ఓటర్ జాబితా వెల్లడి
- జిల్లాలో 3.53 లక్షల మంది ఓటర్లు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
పల్లెపోరు ఆశావాహుల ఆశలు తారుమారు చేస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయడంతో బీసీల్లో నిరాశ నింపింది. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. కమిషన్ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్-2018 చట్టాన్ని సవరించింది. దీంతో గత పంచాయతీ ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లను మార్చాల్సి వచ్చింది. 50 శాతం రిజర్వేషన్ల ప్రక్రియ మించకుండా మహిళకు 50 శాతం కేటాయిస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రకారం బీసీ రిజర్వేషన్లకు 2024 కులగణన సర్వేను ప్రామాణికంగా తీసుకున్నారు. దీంతో రిజర్వేషన్లు ప్రక్రియలో చోటుచేసుకున్న మార్పులు సర్పంచ్ పదవులు వస్తాయని ఆశపడ్డ ఆశావహులు అదృష్టం దూరం కావడంతో లబోదిబోమంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 సర్పంచ్ స్థానాలు, 2268 వార్డులు ఉన్నాయి. వీటికి సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేశారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. జిల్లాలో సెప్టెంబర్ 29 నాటి నోటిఫికేషన్‌లో ఇచ్చిన రిజర్వేషన్లలో మళ్లీ మార్పులు చోటు చేసుకోవడంతో అయోమంలో పడ్డారు. ఇప్పటివరకు పల్లెల్లో హడావుడి చేసిన ఆశావహులు రిజర్వేషన్ రివర్స్‌తో డీలాపడ్డారు. జిల్లాలో 42 శాతం బీసీ రిజర్వేషన్లలో గిరిజన తండాల్లో ఒకటి రెండు బీసీ కుటుంబాలు ఉన్నవారికి సైతం అవకాశం వచ్చింది. సర్పంచ్ పదవి వస్తుందని భావిస్తున్న క్రమంలోనే రిజర్వేషన్ల మార్పుతో చేతిదాకా వచ్చిన అదృష్టం దూరం కావడంతో నిరాశ చెందుతున్నారు.
రిజర్వేషన్ల ఖరారుతో పల్లెల్లో సందడి..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామపంచాయతీ సర్పంచులు, వార్డుల రిజర్వేషన్లు ఖరారు కావడంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహులు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చినవారు పోటీకి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు జిల్లాలో 260 సర్పంచ్ల స్థానాల్లో జనరల్ స్థానాలు 64, జనరల్ మహిళా 57, ఎస్సీ జనరల్ 31, ఎస్సీ మహిళా 25, ఎస్టీ జనరల్ 17, ఎస్టీ మహిళలకు 13 స్థానాలు రిజర్వేషన్ కానున్నాయి. చందుర్తి మండలంలో 19 సర్పంచుల్లో ఐదు జనరల్, నాలుగు జనరల్ మహిళ, మూడు బీసీ జనరల్, రెండు బీసీ మహిళ, రెండు ఎస్సీ జనరల్, రెండు ఎస్సీ మహిళ, ఒకటి ఎస్టీ మహిళ రిజర్వ్ అయ్యాయి. కోనరావుపేటలో 28 సర్పంచుల్లో ఆరు జనరల్, ఆరు జనరల్ మహిళ, మూడు బీసీ జనరల్, రెండు బీసీ మహిళ, మూడు ఎస్టీ జనరల్, రెండు ఎస్టీ మహిళలకు రిజర్వు కాగా, గంభీరావుపేటలో 22 సర్పంచుల్లో ఐదు జనరల్, ఐదు జనరల్ మహిళ, మూడు బీసీ జనరల్, రెండు బీసీ మహిళ, రెండు ఎస్సీ జనరల్, రెండు ఎస్సీ మహిళ, మూడు ఎస్టీ జనరల్, ఇల్లంతకుంట మండలంలో 35 సర్పంచుల్లో తొమ్మిది జనరల్, తొమ్మిది జనరల్ మహిళ, తొమ్మిది బీసీ జనరల్, నాలుగు బీసీ మహిళ, నాలుగు ఎస్సీ జనరల్, నాలుగు ఎస్సీ మహిళ, వేములవాడ అర్బన్ మండలంలో 11 సర్పంచ్ స్థానాల్లో మూడు జనరల్, మూడు జనరల్ మహిళ, ఒకటి బీసీ జనరల్, ఒకటి బీసీ మహిళ, రెండు ఎస్సీ జనరల్, ఒకటి ఎస్సీ మహిళ, వేములవాడ రూరల్ మండలంలో 17 సర్పంచ్ స్థానాల్లో ఐదు జనరల్, నాలుగు జనరల్ మహిళ, రెండు బీసీ జనరల్, రెండు బీసీ మహిళ, రెండు ఎస్సీ జనరల్, రెండు ఎస్సీ మహిళ, రుద్రంగి మండలంలో 10 సర్పంచ్ స్థానాల్లో జనరల్ ఒకటి, బీసీ జనరల్ ఒకటి, నాలుగు ఎస్టీ జనరల్, నాలుగు ఎస్టీ మహిళలకు కేటాయించారు. ఎల్లారెడ్డిపేట మండలంలో 26 సర్పంచ్ స్థానాల్లో ఆరు జనరల్, ఐదు జనరల్ మహిళ, మూడు బీసీ జనరల్, రెండు బీసీ మహిళ, మూడు ఎస్సీ జనరల్, రెండు ఎస్సీ మహిళ, మూడు ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళ, ముస్తాబాద్ మండలంలో 22 సర్పంచ్ స్థానాల్లో ఆరు జనరల్, ఐదు జనరల్ మహిళ, మూడు బీసీ జనరల్, రెండు బీసీ మహిళ, మూడు ఎస్సీ జనరల్, రెండు ఎస్సీ మహిళ, ఒకటి ఎస్టీ జనరల్, వీర్నపల్లి మండలంలో 17 సర్పంచుల్లో నాలుగు జనరల్, మూడు జనరల్ మహిళ, రెండు ఎస్సీ జనరల్, ఒకటి ఎస్సీ మహిళ, మూడు ఎస్టీ జనరల్, నాలుగు ఎస్టీ మహిళలకు కేటాయించారు. బోయినపల్లి మండలంలో 23 సర్పంచ్ స్థానాల్లో ఆరు జనరల్, ఆరు జనరల్ మహిళ, మూడు బీసీ జనరల్, రెండు బీసీ మహిళ, మూడు ఎస్సీ జనరల్, ఎస్సీ మహిళ, తంగళ్ళపల్లి మండలంలో 30 సర్పంచ్ స్థానాల్లో ఎనిమిది జనరల్, ఏడు జనరల్ మహిళ, మూడు జనరల్. మూడు బీసీ మహిళ, ఐదు ఎస్సీ జనరల్, నాలుగు ఎస్సీ మహిళలకు రిజర్వ్ కానున్నట్లు బావిస్తున్నారు.
జిల్లాలో 3.53 లక్షల మంది ఓటర్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే విధంగా అధికార యాంత్రాంగం ఏర్పాటు చేస్తోంది. ఆదివారం తుది ఓటరు జాబితాలను గ్రామపంచాయతీల వారీగా ప్రదర్శించారు. జిల్లాలో తుది ఓటర్ జాబితా ప్రకారం 3 లక్షల 53 వేల 351 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1701772 మంది, మహిళలు 182559 మంది ఉన్నారు. వీళ్లలో అధికంగా 11787 మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలో 260 గ్రామపంచాయతీలు, 2268 వార్డు సభ్యులు ఉండగా, 1734 పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 200 మంది ఓటర్లు ఉన్నవరకు 1734 పోలింగ్ కేంద్రాలు, 400 ఓటర్ల వరకు 468 పోలింగ్ కేంద్రాలు, 650 ఓటర్ల వరకు ఉన్న పంచాయతీల్లో 76 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్నిసిద్ధం చేస్తున్నారు. అంతకుమించి ఓటర్లు ఉంటే రెండవ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. 200 మంది ఓటర్లు ఉన్న చోట ఒక ప్రిసైడింగ్ అధికారి ఒక పోలింగ్ అధికారి ఉంటారు. 201 నుంచి 400 వరకు ఒక ప్రిసైడింగ్ అధికారి ఇద్దరు పోలింగ్ అధికారులు, 401 నుంచి 650 వరకు ఉంటే ప్రిసైడింగ్ అధికారితో పాటు ముగ్గురు పోలింగ్ అధికారులను నియమిస్తారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ బాక్సులు, నోడల్ అధికారుల నియామకం, ఆర్వోలు, పీవోలు, ఏపీవోలకు రెండు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టారు. సర్పంచ్‌లకు గులాబీ రంగు, వార్డు మెంబర్లకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు ముద్రించడానికి సిద్ధం చేశారు. నోటిఫికేషన్ రావడమే తరువాయి జిల్లా యంత్రాంగం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉంది.
జిల్లాలో గ్రామపంచాయతీ ఓటర్లు
మండలం పురుషులు మహిళలు మొత్తం
బోయిన్‌పల్లి 14753 1572 30505
చందుర్తి 13445 14649 28094
ఇల్లంతకుంట 19644 20902 40546
గంభీరావుపేట 17811 18996 36807
కోనరావుపేట 17180 18045 35225
ముస్తాబాద్ 18658 19842 38500
రుద్రంగి 6454 7208 13665
తంగళ్లపల్లి 19395 20683 40079
వీర్నపల్లి 5769 5958 11727
వేములవాడ 8953 9523 18492
వేములవాడరూరల్ 9020 9805 18825
ఎల్లారెడ్డిపేట 19690 21196 40886
మొత్తం 170772 182559 353351
=====================================================================