Share News

Raajanna siricilla : ‘లోకల్‌’ పోరు..

ABN , Publish Date - Sep 01 , 2025 | 01:07 AM

(ఆంధ్రజ్యోతి, సిరిసిల) లోకల్‌ పోరుకు ప్రభుత్వం చకచకగా ముందుకు పోతోంది. ఆదివారం శాసనసభలో బీసీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది.

Raajanna siricilla :  ‘లోకల్‌’ పోరు..

- బీసీ బిల్లుతో రిజర్వేషన్లు సుగమం

- బీసీ ఆశావహుల్లో ఉత్సాహం

- వరుసగా స్థానిక సంస్థ ఎన్నికలు

- మొదట పంచాయతీ.. తర్వాత పరిషత్‌

- జిల్లాలో 260 సర్పంచులు, 2268 వార్డులు సభ్యులు

- 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల)

లోకల్‌ పోరుకు ప్రభుత్వం చకచకగా ముందుకు పోతోంది. ఆదివారం శాసనసభలో బీసీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. దీంతోపాటు పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్ట సవరణకు ఆమోదం లభించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ ఆశావహులో ఉత్సాహం పెరిగింది. సెప్టెంబర్‌లోనే ఎన్నికల నిర్వహణకు క్యాబినెట్‌ నిర్ణయం తీసుకోవడంతో గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామపంచాయతీ, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదట పంచాయతీ ఎన్నికలు అదే వరుసలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలు కూడా జరగనుండడంతో రాజకీయ పార్టీల్లో హడావుడి మొదలైంది.

ఫ జిల్లాలో బీసీల ఆధిపత్యం..

స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ బిల్లు ఆమోదం లభించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీల ఆధిపత్యం స్థానిక సంస్థల్లో పెరుగుతుందని భావిస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల స్థానాలతో పాటు జనరల్‌ స్థానాల్లో బీసీలు తమ ఉనికి చాటుకోనున్నారు. 2019 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లతో పాటు జనరల్‌ స్థానాల్లో ఎక్కువ సంఖ్యలో బీసీలు గెలుపొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామపంచాయతీ, జడ్పీటీసీలు, ఎంపీటీసీల జనరల్‌ స్థానాల్లో 42 మంది బీసీలు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో 12 జడ్పీటీసీ స్థానాల్లో ఒకటి ఎస్టీ మహిళ, ఒకటి ఎస్సీ మహిళ, రెండు ఎస్సీ జనరల్‌, ఒకటి బీసీ మహిళ, ఒకటి బీసీ జనరల్‌, మూడు జనరల్‌ మహిళ, మరో మూడు జనరల్‌కు కేటాయించారు. రిజర్వేషన్ల ప్రకారం ఆరు మహిళలకు, ఆరు జనరల్‌గా ఉన్నాయి. 123 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, 68 మహిళలకు, 58 జనరల్‌కు కేటాయించారు. ఇందులో ఎస్టీలకు ఆరు కేటాయించగా, 5 మహిళలకు, ఒకటి జనరల్‌గా ఉంది. 28 ఎస్సీలకు కేటాయించగా, 17 మహిళలకు, 11 జనరల్‌, 25 బీసీలకు కేటాయించగా, 14 మహిళలకు, 11 జనరల్‌ స్థానాలుగా ఉన్నాయి. 64జనరల్‌ స్థానాలు ఉండగా, 29 మహిళలకు, 25 జనరల్‌గా కేటాయించారు. ఈసారి రిజర్వేషన్లు మార్పు ఏలా ఉంటుందనే చర్చ కొనసాగుతోంది. జిల్లాలో 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. జిల్లాలో 255 గ్రామపంచాయతీలు ఉండగా, 252 గ్రామాపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 252 సర్పంచ్‌ స్థానాల్లో బీసీలకు 56 స్థానాలు, ఎస్సీలకు 51 స్థానాలు, ఎస్టీలకు 30 స్థానాలు, జనరల్‌ 115 స్థానాలు రిజర్వ్‌ చేశారు. వీటిలో బీసీ రిజర్వేషన్‌ 80 స్థానాలు కలుపుకొని జనరల్‌ స్థానాల్లో 24 గెలుపొందారు.

ఫ రేపు పంచాయతీ తుది ఓటర్‌ జాబితా

స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన ఓటర్‌ జాబితాలు సిద్ధమవుతున్నాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఇప్పటికే డ్రాఫ్ట్‌ ఓటర్‌ జాబితా వెల్లడించి అభ్యంతరాలను స్వీకరించారు. ఆదివారం వాటిని పరిష్కరించి ఓటరు జాబితాలో అవసరమయ్యే సవరణలను చేసి సెప్టెంబర్‌ 2న తుది ఓటర్‌ జాబితాను వెల్లడించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామపంచాయతీలో 3,52,134 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చారు. ఇదే క్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు చేస్తున్న సన్నాహాల్లో భాగంగా సెప్టెంబర్‌ 6న ఓటర్లు, పోలింగ్‌ కేంద్రాల నోటిఫికేషన్‌ వెల్లడిస్తారు. 8వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్‌, మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. 9న అభ్యంతరాలు పరిష్కరించి. 10న తుది ఓటరు జాబితాను వెల్లడిస్తారు.

ఫ ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీ ఉండగా, 2268 వార్డులు ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో 3,52,134 మంది ఓటర్లు ఉన్నట్లు లెక్క తేల్చి గ్రామాల్లో డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ ప్రదర్శించారు. గ్రామాల్లో వార్డుల వారీగా ఓటరు జాబితాలను రూపొందించే క్రమంలో ఓకే కుటుంబంలోని ఓటర్లందరూ ఓకే పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో ఉండే విధంగా సవరించారు. మృతిచెందిన ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించారు. కొత్త ఓటర్లను జాబితాలో చేర్చారు. అధికారులు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో 200 మంది ఓటర్లు ఉన్న గ్రామల్లో 1734 పోలింగ్‌ కేంద్రాలు, 400 ఓటర్ల వరకు 468 పోలింగ్‌ కేంద్రాలు, 650 ఓటర్ల వరకు ఉన్న పంచాయతీల్లో 76 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. పంచాయతీ ఎన్నికల్లో 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నారు. 260 సర్పంచ్‌లు, 2268 వార్డులకు ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే బ్యాలెట్‌ బాక్సులు సిద్ధంగా ఉంచారు. సర్పంచ్‌ ఎన్నికలకు పెద్ద బాక్సులు, వార్డు సభ్యులకు చిన్న బ్యాలెట్‌ బాక్సులు జిల్లాకు వచ్చాయి. జిల్లాలో పోలింగ్‌ స్టేషన్ల పక్రియను కూడా పూర్తి చేశారు. అంతకుమించి ఓటర్లు ఉంటే రెండవ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేస్తారు. 200 మంది ఓటర్లు ఉన్న చోట ఒక ప్రిసైడింగ్‌ అధికారి ఒక పోలింగ్‌ అధికారి ఉంటారు. 201 నుంచి 400 వరకు ఒక ప్రిసైడింగ్‌ అధికారి ఇద్దరు పోలింగ్‌ అధికారులు, 401 నుంచి 650 వరకు ఉంటే ప్రిసైడింగ్‌ అధికారితో పాటు ముగ్గురు పోలింగ్‌ అధికారులను నియమిస్తారు.

జిల్లాలో 12 జడ్పీటీసీలు, 123 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. బోయినపల్లి, చందుర్తి, ఇల్లంతకుంట, గంభీరావుపేట, కోనరావుపేట, ముస్తాబాద్‌, రుద్రంగి, తంగళ్లపల్లి, వీర్నపల్లి, వేములవాడ రూరల్‌, వేములవాడ అర్బన్‌, ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎంపీటీసీ స్థానాల్లో బోయినపల్లి మండలంలో 11 స్థానాలు, చందుర్తిలో 10, ఇల్లంతకుంటలో 14, గంభీరావుపేటలో 13, కోనరావుపేటలో 12, ముస్తాబాద్‌లో 13, రుద్రంగిలో 5, తంగళ్లపల్లిలో 14, వీర్నపల్లిలో 5, వేములవాడ రూరల్‌లో 7, వేములవాడ అర్బన్‌లో 6, ఎల్లారెడ్డిపేటలో 13 స్థానాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌ సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది నియామకాలకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలో 709 పోలింగ్‌ కేంద్రాలు, 3700 మంది పోలింగ్‌ సిబ్బందిని ఇప్పటికే గుర్తించారు.

Updated Date - Sep 01 , 2025 | 01:07 AM