Raajanna siricilla : నాయకా..! వినాయకా..!!
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:04 AM
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) ఆది దేవుడిగా కొలిచే గణనాథుల ఉత్సవాలకు భక్తులు సిద్ధమవుతున్నారు. వినాయక నవరాత్రుల కోసం యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
- గణేశ్ ఉత్సవాలకు సిద్ధమవుతున్న భక్తులు
- స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఆశావహులకు ముందస్తు ఖర్చు
- పెరిగిన ధరలతో భక్తులకు తప్పని అధిక భారం
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ఆది దేవుడిగా కొలిచే గణనాథుల ఉత్సవాలకు భక్తులు సిద్ధమవుతున్నారు. వినాయక నవరాత్రుల కోసం యువజన సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విగ్రహాల తయారీ కూడా ముగిసింది. అమ్మకాల కోసం భారీ విగ్రహాలు కొలువుదీరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పల్లెల్లో వినాయక ఉత్సవాలతోనే రాజకీయ మద్దతును ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి స్థానిక సంస్థల్లో పోటీచేయడానికి సిద్ధపడ్డ ఆశావహులు తహతహలాడుతున్నారు. హైకోర్టు ఆదేశాలతో సెప్టెంబరు 30లోగా ఎన్నికలు జరిగే పరిస్థితులు ఏర్పడ్డ నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహుల ఉత్సాహాన్ని వినాయక ఉత్సవ నిర్వాహకులు సైతం ఉపయోగించుకుంటున్నారు. జిల్లాలో 260 గ్రామపంచాయతీలు, 2,268 వార్డులు ఉన్నాయి. సర్పంచుల నుంచి మొదలుకొని వార్డు సభ్యులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్ స్థానాలపై కన్నేసిన వివిధ పార్టీల నాయకులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు రాజకీయ ఎదుగుదల వ్యూహరచనలో యువతను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వినాయక ఉత్సవాలకు అవసరమయ్యే విగ్రహాలు, ఏర్పాట్లకు సంబంధించి ఉచితంగానే అందజేస్తున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా సిద్ధమవుతున్న క్రమంలో ఎన్నికలు కూడా దసరా వరకు నిర్వహించే అవకాశం ఉంది. ఈక్రమంలో యువజన సంఘాలు ఆశావహుల నుంచి ఆశిస్తున్న వినాయక విగ్రహాలు, మండపాలు, సౌండ్ సిస్టమ్ వంటివి సమకూర్చకుంటే దూరమవుతామనే భావనతో ఆశావహులు కూడా కాదనలేకపోతున్నట్లు చర్చించుకుంటున్నారు. కొందరు ఆశావహులు ముందస్తు ఖర్చు చూసి కొంత ఇబ్బంది పడుతున్నా తప్పని పరిస్థితిగానే మారిపోయింది. ఉత్సవాలకు ఖర్చు చేస్తున్నా నాయకులు మాత్రం ఫ్లెక్సీల ఏర్పాటుతో పాటు మైకుల్లో తమను ప్రమోట్ చేస్తూ ప్రచారం చేయాలని ఒప్పందం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో నిర్వాహకులకు కొంత భారం తగ్గినట్లుగానే భావిస్తున్నారు.
ఫ ధరల మోత...
తొలిపూజను అందుకునే గణేష్ ఉత్సవాల సందడి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదలైంది. జిల్లా కేంద్రంలో చిన్నవిగ్రహాల నుంచి భారీ విగ్రహాలను తయారుచేసి అమ్మకాలకు ఉంచారు. మరోవైపు భారీ విగ్రహాలను ఇతర ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనే భారీ సైజుల్లో విగ్రహాలు తయారు చేస్తున్నారు. స్థానిక కళాకారులతో పాటు రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కళాకారులను రప్పించి విగ్రహాలు చేయించారు. మరికొందరు వ్యాపారులు మహారాష్ట్ర, హైదరాబాద్, విజయవాడ, జగిత్యాల, వరంగల్ ప్రాంతాల నుంచి భారీ విగ్రహాలను తీసుకువచ్చి విక్రయాలు జరుపుతున్నారు. మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చిన విగ్రహాలు కలరింగ్‌తోపాటు విభిన్నంగా కనిపిస్తున్నాయి. సిరిసిల్లలోనే పెద్ద సైజు విగ్రహాలు 15 వేల రూపాయల నుంచి 70వేల రూపాయల వరకు విగ్రహాలు తెచ్చి అమ్మకాలు జరుపుతున్నారు. లక్ష నుంచి మూడు లక్షల రూపాయల వరకు ఉండే భారీ విగ్రహాలను సైతం యువజన సంఘాల నాయకులు హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి ప్రతిష్ఠించడానికి ఏర్పాట్లు చేశారు. గతంలోకంటే ఈసారి ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరిగాయి. చిన్న విగ్రహాలు సైతం భారీ ధరలే ఉండడంతో సామాన్య ప్రజలకు ఉత్సవాలు భారంగానే మారుతున్నాయి. ఆగస్టు 27న ప్రారంభమయ్యే చవితి ఉత్సవాల కోసం సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో మండపాలను ఏర్పాటు చేస్తున్నారు.