Share News

Raajanna siricilla : ఫసల్‌ బీమా లేనట్లేనా..?

ABN , Publish Date - Nov 01 , 2025 | 12:48 AM

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) ప్రకృతి వైపరీత్యాలకు రైతులు నిండా మునుగుతున్నారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలకు ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు కాస్తోకూస్తో ధీమా నిచ్చే ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) నాలుగేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు.

Raajanna siricilla :  ఫసల్‌ బీమా లేనట్లేనా..?

- పంటల బీమాపై స్పష్టత కరువు

- నాలుగేళ్లుగా అటకెక్కిన బీమా పథకం

- బీఆర్‌ఎస్‌ బాటలోనే కాంగ్రెస్‌..

- జిల్లాలో మొంథా తుఫాన్‌తో పంట నష్టం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ప్రకృతి వైపరీత్యాలకు రైతులు నిండా మునుగుతున్నారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలకు ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు కాస్తోకూస్తో ధీమా నిచ్చే ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై) నాలుగేళ్లుగా అమలుకు నోచుకోవడం లేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణలో ఫసల్‌ బీమాను అమలుచేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఫసల్‌ బీమాను అమలు చేస్తామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అదే దారిలో విస్మరించిందనే విమర్శలు వస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు గత యాసంగిలోనే ఫసల్‌ బీమా వస్తుందని భావించిన అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ముగుస్తున్న వానాకాలం సీజన్‌లో ఫసల్‌ బీమా అమలుచేస్తారని ప్రచారం జరిగిన రైతులకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో అల్పపీడన ప్రభావంతో పంట నష్టం చవిచూసిన రైతులకు మొంథా తుఫాన్‌ భారీ నష్టాన్ని కలిగించింది. ఈ పరిస్థితుల్లో ఫసల్‌ బీమా ఉపయోగపడేదని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో 11 క్లస్టర్లుగా విభజించి ఫసల్‌ బీమా అమలుచేయాలని భావించారు. కానీ ఆచరణకు రావడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసుత్త వానాకాలం సీజన్‌లో 2.34 లక్షల ఎకరాలు వివిధ పంటలు వేసుకున్నారు. రాబోయే యాసంగిలో 1.93 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేస్తారని అంచనా వేశారు. ప్రతి సీజన్‌లోనూ వడగండ్ల వర్షాలు, కుంభవృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోతూనే ఉన్నారు. పంట చేతికి వచ్చే దశలో రైతులకు నష్టం కలగకుండా 2016లో ఫసల్‌ బీమా పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ పథకాన్ని 2020లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిలిపివేసింది. బీమాపై అవగాహన లేకపోవడంతో రైతులు సద్వినియోగం చేసుకోలేదు. ఏప్రిల్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంటల బీమా పథకానికి విధివిధానాలు రూపొందించాలని ఆదేశాలు ఇచ్చిన యాసంగి వచ్చిన ఎలాంటి కదలిక కనిపించడం లేదు.

బీమాతో రైతులకు ధీమా...

వానాకాలం, యాసంగి సీజన్లలో పంటలు వేసుకునే రైతులకు ఫసల్‌భీమా యోజన ధీమాగా ఉంటుంది. పంట నీటమునిగిన వడగండ్ల వాన, ఇసుక మేటలు వేసినా తుఫాను ప్రభావంతో పంటలకు కలిగే నష్టాలకు బీమా వర్తిస్తుంది. బీమాకు సంబంధించి ప్రీమియంలో రైతు వాటా వానాకాలం సీజన్‌లో 2 శాతం, యాసంగిలో 1.5 శాతం, వాణిజ్య ఉద్యానవన పంటలకు 5 శాతం ఉంటుంది. మిగిలిన ప్రీమియంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 50 శాతం చొప్పున భరిస్తుంది. ఇందులో రైతు వాటా ప్రభుత్వమే చెల్లిస్తుందని గతంలో ప్రకటించారు. ప్రస్తుతం దీనిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. వానాకాలంలో ఐదు పంటలు, యాసంగిలో 6 పంటలకు వర్తించే యోచన కూడా చేశారు. వానాకాలంలో వరి, కందులు, మొక్కజొన్న, వేరుశెనగ, జొన్న, యాసంగిలో వరి, పప్పుదినుసులు, మొక్కజొన్న, వేరుశెనగ, మినుములు, జొన్న పంటలకు వర్తింప చేస్తారని రైతులు భావించారు. కానీ ఫసల్‌ బీమా యోజనపై మార్గదర్శకాలే జారీ కాలేదు. ఫసల్‌ బీమా యోజన అమలు జరిగితే 2.5 ఎకరాల పంట నష్టంలో 33 నుంచి 50 శాతం వాటిల్లితే వరికి రూ 1.05 లక్షలు, మొక్కజొన్న రూ 90 వేల పరిహారం అందుతుంది. జిల్లా, మండల, గ్రామాల యూనిట్‌లుగా పంటల బీమా వర్తిస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారు.

జిల్లాలో 1.10 లక్షల మందికి లబ్ధి

ఫసల్‌ బీమా యోజన అమలుచేస్తే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1.10 లక్షల మంది రైతులతో పాటు 80వేల మంది కౌలు రైతులకు కూడా ఉపయోగపడనుంది. జిల్లాలో పట్టాదారులతో పాటు కౌలు రైతులకు కూడా ప్రభుత్వం భరోసా కల్పించే హామీలు ఇచ్చిన నేపథ్యంలో కౌలు రైతులకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. జిల్లాలోని 13 మండలాలు, 171 రెవెన్యూ గ్రామాలు, 260 గ్రామ పంచాయతీల పరిధిలో 83 వేల హెక్టార్లలో భూకమతాలు ఉన్నాయి. జిల్లాలో 2.43 లక్షల ఎకరాల భూములు ఉండగా, 2.47 ఎకరాకలలోపు కమతాలకు సంబంధించిన 81,416 ఎకరాలు 75931 మంది రైతుల వద్ద ఉంది. 2.47 నుంచి 4.93 ఎకరాలకు సంబంధించి 25092 మంది రైతుల వద్ద 86460 ఎకరాలు, 4.94 నుంచి 9.87 ఎకరాలకు సంబంధించి 8346 మంది రైతుల వద్ద 53560 ఎకరాలు, 9.88 నుంచి 24.70 ఎకరాలకు సంబంధించి 1427 మంది రైతుల వద్ద 18962 ఎకరాల భూమి ఉంది. 87 మంది రైతుల వద్ద 24.71 ఎకరాలకు పైన 2756 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో వానాకాలంలో 2.40 లక్షల ఎకరాలు, యాసంగిలో 1.90 లక్షల ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా వరి రెండు సీజన్‌లలోనూ 1.80 లక్షల ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ఫసల్‌ బీమా యోజన అమలైతే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని ఎదురుచూస్తున్నారు.

Updated Date - Nov 01 , 2025 | 12:48 AM