Raajanna siricilla : కలిసిరాని కాలం
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:03 AM
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) అన్నదాతలకు కరువు లేకున్నా కష్టాలు తప్పలేదు. సకాలంలో వర్షాలు కురవక విత్తనాలు మొలకెతక్త పంటల సాగు ఆలస్యం కావడంతో రైతు లు ఇబ్బందులు పడ్డారు.
- నిండా ముంచిన మొంథా తుఫాన్
- కన్నీళ్లు నింపిన అతివృష్టి.. అనావృష్టి
- ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతులు
- కాలచక్రం - 2025
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
అన్నదాతలకు కరువు లేకున్నా కష్టాలు తప్పలేదు. సకాలంలో వర్షాలు కురవక విత్తనాలు మొలకెతక్త పంటల సాగు ఆలస్యం కావడంతో రైతు లు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు అల్పపీడనం తోడు మొంథా తుఫాన్ తెచ్చిన అతివృష్టి పంటలను నాశనం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొంథా తుఫాన్ రైతులను అతలాకుతలం చేస్తే పత్తి కొనుగోలుకు తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్ ఇబ్బందులు పెట్టింది. రైతు భరోసాకు ఎదురు చూశారు. ఈ ఏడాది కొత్తగా యూరియా కొనుగో లుకు యాప్ ముందుకు వచ్చింది. నాలుగేళ్ల క్రితం మొదలైన ఆయిల్ పామ్ సాగు దిగుబడి ఇవ్వడం మొదలైంది. సిరిసిల్ల జిల్లా రైతులకు 2025 సంవత్సరం కలిసిరాని కాలంగా మిగిలిపోయింది.
అతలాకుతలం చేసిన తుఫాన్
యాసంగి పంట చేతికొచ్చే సమయంలో భూగర్భ జలాలు అడుగంటి సాగునీటి కష్టాలను ఎదుర్కొన్నారు. ఇది దిగుబడిపై ప్రభావం చూపింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం ప్రారంభంలోనే నైరుతి ఆశలు కల్పించడంతో రైతులు ముందస్తుగానే సాగుకు సిద్ధమయ్యారు. కానీ తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో వర్షాల కోసం ఎదురుచూసే పరిస్థితి వచ్చింది. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురవడం రైతులకు ఊరట ఇచ్చినా పంట చేతికొచ్చే దశలో మొంథా తుఫాన్ తీరని నష్టాన్ని మిగిలించింది. భారీ వరదలతో వరి పొలాలు నేలవాలి పత్తి పంట దెబ్బ తింది. యాసంగిలో 1.82 ఎకరాల్లో పంటలు సాగు చేయగా వరి 1.78 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. వానాకాలం సీజన్లో 2.43 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా వరి 1.84లక్షల ఎకరాల్లో సాగు చేశారు. అల్పపీడనం, మొంథా తుఫాన్ ప్రభావంతో వరి పంటలు దెబ్బతినడం, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతులు నష్టపోయారు. భారీ వర్షాలకు జిల్లాలోని మిడ్ మానేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. సిరిసిల్ల మానేరు, మూలవాగుల నుంచి వరద నీరు, శ్రీరాంసాగర్ వరద కాలువ నుంచి నీరు నింపడంతో చివరకు మిడ్‌మానేరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. జిల్లాలోని ఎగువ మానేరు ప్రాజెక్టు, మల్కపేట రిజర్వాయర్, నిమ్మపల్లి ప్రాజెక్టు, సింగసముద్రం చెరువులతో పాటు జిల్లాలోని 666 చెరువులు నిండాయి. కొన్ని చెరువులు మత్తడి దూకాయి. జిల్లాలో భూగర్భ జలాలు మళ్లీ పెరగడంతో యాసంగి సాగుకు ఢోకా లేదని రైతులు ఆశగా ఉన్నారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన పంటలను కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. భారీ వర్షాల్లో చిక్కుకున్న కొందరిని ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా రక్షించిన సందర్భాలున్నాయి.
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
అల్పపీడన వర్షాలు రైతులను మురిపించినా యూరియా మాత్రం కష్టాలను నింపింది. యూరియా కోసం రైతులు పొద్దంతా సొసైటీల వద్ద పడిగాపులు పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు 25,370 మెట్రిక్ టన్నుల యూరియా సకాలంలో సరఫరా లేక ఇబ్బందులు పడ్డారు. పోలీస్ బందోబస్తు మధ్య రైతులకు యూరియా సరఫరా చేశారు. తెల్లవారు జాము నుంచే రైతులు సొసైటీల వద్దకు వచ్చి చెప్పులు క్యూలైన్‌లో పెట్టారు. ఎరువుల కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు రైతులకు మద్దతుగా నిలిచాయి. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూరియా కోసం యాప్ ద్వారా బుకింగ్ చేసుకుని పొందే వీలు కల్పించింది. యాప్‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఫ రూ. 1226 కోట్ల విలువైన ధాన్యం సేకరణ
జిల్లాలో యాసంగి, వానాకాలం సీజన్లకు సంబంధించిన ధాన్యం అమ్ము కోవడానికి రైతులు కేంద్రాల వద్ద పడిగాపులు పడ్డారు. సకాలంలో తూకం వేయకపోవడం, మిల్లర్లు తేమ పేరుతో కొర్రీలు పెట్టడం వంటి సమ స్యలను రైతుల ఎదుర్కొన్నారు. యాసంగి, ప్రస్తుతం ముగుస్తున్న వానాకాలం సీజన్‌కు సంబంధించి రూ 1,226 కోట్ల విలువైన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ కొనుగోలు చేసింది. యాసంగి సీజన్‌లో 43,911 మంది రైతుల నుంచి రూ.589 కోట్ల విలువైన 2.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ప్రస్తుత వానకాలం సీజన్‌కు సంబంధించి 47,481 మంది రైతుల నుంచి రూ.637.86 కోట్ల విలువైన 2.66 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.
ఫ పత్తి రైతు దిగాలు
తెల్ల బంగారం రైతులకు ఈ ఏడాది ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. అనావృష్టి, అతివృష్టితో పత్తి రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. జిల్లాలో 46,385 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. జిల్లాలో ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన పత్తి విక్రయానికి కపాస్ కిసాన్ యాప్ తీసుకురావడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. సీసీఐ తీసుకొ చ్చిన నిబంధనతో రైతులు పత్తిని దళారులకు అమ్ముకున్నారు. జిల్లాలో వేములవాడ మండలం నాంపల్లిలో లక్ష్మీ నరసింహ కాటన్ ఇండస్ట్రీస్, సంకేపల్లిలో లక్ష్మీ ఇండస్ట్రీస్, కోనరావుపేట మండలం సుద్దాలలో శ్రీ కావేరి కాటన్ ఇండస్ట్రీస్, ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లిలో శ్రీ రాజరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్, గాలిపెళ్లిలో శ్రీ సప్తగిరి ఇండస్ట్రీస్‌లో కొనుగోళ్లు చేపట్టారు. రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిలో 8 తేమ శాతం కంటే తక్కువ ఉంటే క్వింటాలకు రూ. 8110, తేమ 10 శాతం ఉంటే క్వింటా లుకు రూ. 7947, తేమ 11శాతం ఉంటే రూ.7,866, తేమ 12 శాతం ఉంటే రూ7,785 మద్దతు ధర చెల్లిస్తారు. రైతులకు స్లాట్ బుక్ చేసుకోవడం ఇబ్బందిగా మారింది. మరోవైపు సీసీఐ పత్తి కొనుగోళ్లలో పరిమితి విధించడం రైతుల్లో ఆందోళన కలిగించింది. గత సంవత్సరం సీసీఐ ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసింది. ఈసారి ఎకరానికి 7 క్వింటాళ్లకే పరిమితి విధించింది.
ఫ యాంత్రీకరణ వాయిదా
గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకంపై నీలి నీడలు పోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత యాంత్రీకరణ పథకం అమల్లోకి తీసుకు వస్తున్నామని ప్రకటించినా మూడుసార్లు వాయిదా పడింది. ఈ సంవత్సరం దరఖాస్తు స్వీకరించిన రైతులకు యాంత్రికరణ అందలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు 198యూనిట్లకు రూ.58.84 లక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహించే వ్యవసాయ యాంత్రీకరణలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నిధులను మంజూ రు చేస్తుంది. వ్యవసాయ యాంత్రీకరణలో తొలిసారిగా మహిళా రైతుల కు పనిముట్లు అందించడానికి నిర్ణయించారు. 13 రకాల యాంత్రీకరణ పరికరాలు ఇవ్వాలని నిర్ణయించారు. 50 శాతం రాయితీతో మహిళ రైతు లకు మాత్రమే యంత్రాలు, పరికరాలు ఇవ్వాలని నిర్ణయించారు. యాంత్రీకరణలో ట్రాక్టర్ రూ.5 లక్షలు, రోటోవేటర్ రూ. 1.44 లక్షలు, పవర్ టిల్లర్ రూ. లక్ష, స్ర్టాబేలర్స్ రూ లక్ష, మేయిజ్ షెల్లర్ రూ. లక్ష, కల్టీవేటర్, ప్లవ్, కేజీవీల్, రోటే ఫడ్లర్ రూ 75,906, పవర్ స్పేయర్ రూ.45 వేలు, బ్రష్ కట్టర్ రూ.35 వేలు, పవర్ వీడర్ రూ.35 వేలు, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ రూ.30వేలు, బండ్ ఫార్మర్ రూ.13 వేలు, బ్యాటరీ అపరేటర్ స్పేయర్ రూ. 5 వేలు 50 శాతంతో అందించడానికి దర ఖాస్తులు స్వీకరించారు.