Raajanna siricilla : పల్లె మురిసేలా ’అభివృద్ధి’ జాతర
ABN , Publish Date - Aug 23 , 2025 | 01:15 AM
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో కొద్ది రోజులుగా పల్లెల్లో స్తబ్ధత నెలకొంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పల్లెల్లో అభివృద్ధి పరిస్థితి మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి
- జిల్లాలో ఉపాధిహామీ పనులకు శ్రీకారం
- 260 గ్రామాలు..2,068 పనులతో కార్యాచరణ
- తొలి రోజు రూ 7.79 కోట్లతో 255 పనులకు భూమి పూజలు
- అభివృద్ధి, ఆస్తుల కల్పనే లక్ష్యంగా పనులు
- పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేకపోవడంతో కొద్ది రోజులుగా పల్లెల్లో స్తబ్ధత నెలకొంది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పల్లెల్లో అభివృద్ధి పరిస్థితి మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తాజా నిర్ణయంతో గ్రామాల్లో కొత్త పనులతో భూమి పూజలు, పాత పనులు పూర్తి చేయడం, ప్రారంభోత్సవాలతో సందడిగా మారింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఎంతో అట్టహాసంగా ఉపాధి హామీ పనుల జాతర-2025 మొదలైంది.
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి, ఆస్తుల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ), ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 260 గ్రామపంచాయతీల్లో శుక్రవారం ఏక కాలంలో పనుల జాతర సందడి మొదలైంది. జిల్లాలోని కోనరావుపేట, చందుర్తి మండలాల్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రైతులకు పాడి గేదెల పంపిణీ చేపట్టారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ముస్తాబాద్ మండలం ఆవునూరులో పశువుల పాక నిర్మాణానికి భూమిపూజ చేశారు. బోయిన్‌పల్లి మండలంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, తంగళ్లపల్లిలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ పలు పనులకు భూమి పూజ చేశారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, ఇల్లంతకుంట, వేములవాడ, వేములవాడరూరల్, రుద్రంగి మండలాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పనులకు శ్రీకారం చుట్టారు.
- తొలి రోజు 255 పనులకు శ్రీకారం..
ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 260 గ్రామాల పరిధిలో 2,068 పనులు చేపట్టాలని గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాచరణ రూపొందించింది. ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా ద్వారా జీవనోపాధి కార్యక్రమాల ప్రణాళిక రూపొందించారు. మహిళా సంఘాలకు పశువులు, గొర్రెల షెడ్లు, కోళ్ల పెంపకం, పండ్ల తోటలు, వ్యవసాయ బావులు నిర్మాణం, పొలం బాటలు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో టాయిలెట్లు, ఇంకుడు గుంతలు వంటి పనులు చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందించారు. జిల్లాలోని గ్రామాల్లో ప్రజాప్రతినిధులు అధికారులు ప్రారంభించిన పనులు వచ్చే మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యాన్ని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. తొలి రోజు శుక్రవారం జిల్లాలో 7.79 కోట్ల రూపాయలతో 255 పనులు ప్రారంభించారు. ఇందులో 57.06 లక్షల రూపాయలతో 60 పశువుల పాకలు, 10.46 లక్షల రూపాయలతో ఏడు గొర్రెల షెడ్లు, 5.69 కోట్ల రూపాయలతో 42 సీసీ రోడ్ల నిర్మాణం, 15.85 లక్షల రూపాయలతో ఆరు కోళ్ల షెడ్లు, 2.63 లక్షల రూపాయలతో 21 కమ్యూనిటీ ఇంకుడుగుంతలు, తొమ్మిది లక్షల రూపాయలతో మూడు శానిటరీ కాంప్లెక్స్‌లు, 1.12 కోట్ల రూపాయలతో ఇతర పనులకు భూమి పూజలు చేశారు.
- కూలీలకు ఉపాధి కల్పన..
గ్రామీణ ప్రాంతాల్లో పనుల్లో వేగం పెరగడంతో పాటు ఉపాధి కూలీలకు అధిక పనులతో జీవనోపాధి కల్పించాలని ఉపాధిహామీ పనుల జాతర రూపొందించారు. జిల్లాలో 98,032 జాబ్ కార్డులు ఉండగా 1.99 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. ఇందులో 93,313 మంది కూలీలు పనులు చేస్తున్నారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రగతిని క్షేత్రస్థాయిలో అధికారులు తాజా పొటోలతో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.