Share News

Raajanna siricilla : ‘ఉపాధి’కి ఆధార్‌ లింక్‌..

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:31 AM

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) గ్రామాల్లో కూలీల వలసలను నిరోధించే దిశగా కేంద్ర ప్రభుత్వం 2005లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని ప్రారంభించింది.

Raajanna siricilla :  ‘ఉపాధి’కి ఆధార్‌ లింక్‌..

- జిల్లాలో వేగంగా ఈ-కేవైసీ ప్రక్రియ

- ఉపాధి పనుల్లో అవకతవకలకు చెక్‌

- జిల్లాలో 1.96 లక్షల మంది కూలీలు

- యాక్టివ్‌ లేబర్‌లో 86.87 శాతం ఈ-కేవైసీ పూర్తి

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

గ్రామాల్లో కూలీల వలసలను నిరోధించే దిశగా కేంద్ర ప్రభుత్వం 2005లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని ప్రారంభించింది. వంద రోజుల పాటు కూలీలకు ఉపాధి పనులను పారదర్శకంగా కల్పించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం నూతన విధానాలను తీసుకువస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలకు సంబంధం లేకుండా నేరుగా కూలీలకు వేతనాలు వారి ఖాతాలో జమ చేయడం, లేబర్‌ బడ్జెట్‌ ఇతర కార్యక్రమాలకు సంబంధించి ప్రత్యేక యాప్‌, పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. గ్రామాల్లో ఉపాధిహామీ జాబ్‌కార్డుల్లో నమోదైన కూలీలకు బదులుగా మరొకరు హాజరవుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో వాటిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో బాగంగా ఈ-కేవైసీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న ఉన్న 260 గ్రామపంచాయతీల్లో నిరంతరంగా ఉపాధి పనులు జరుగుతున్నాయి. కానీ చాలామంది జాబ్‌ కార్డులు ఉన్నవారిలో పనులకు రావడం లేదు. జాబ్‌ కార్డులో పేర్లు నమోదు చేసుకున్న కుటుంబ సభ్యులు ఇతర ప్రాంతాల్లో పనులు చేస్తున్నవారు ఉన్నారు. వారి స్థానంలో ఇతరులు పనులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిని నివారించే దిశగా ఇప్పటికే పని ప్రదేశాల్లో ఫొటోలు తీసి అప్లోడ్‌ చేయడం చేస్తున్నారు. ఇంకా ఎలాంటి అవకతవకలకు చోటివ్వకుండా సాంకేతికతతో యాప్‌లను అందుబాటులోకి తెస్తున్న క్రమంలోనే కూలీలకు సంబంధించిన ఈ-కేవైసీని తీసుకొని ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రక్రియ వేగవంతంగా చేస్తున్నారు.

ఫ జిల్లాలో 1.50 లక్షల మంది కూలీల ఈ-కేవైసీ పూర్తి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 97వేల జాబ్‌ కార్డులు ఉండగా, 1.96 లక్షల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 1.50 లక్షల మంది కూలీల ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తిచేసి ఆధార్‌ అనుసంధానం చేశారు. ఇందులో యాక్టివ్‌ కూలీలకు సంబంధించి 86.87 శాతం ఈ-కేవైసీ పూర్తిచేశారు. జిల్లాలో 1,96,420 మంది కూలీలు ఉండగా, మహిళలు 1,00,013 మంది ఉన్నారు. ఇందులో ఎస్సీలు 51,774 మంది, ఎస్టీలు 15,174 మంది, ఇతరులు 1,29,560 మంది ఉన్నారు. ఇందులో యాక్టివ్‌ జాబ్‌కార్డులు 60,244 ఉండగా, కూలీలు 91,564 మంది ఉన్నారు. వీరిలో మహిళలు 55,650 మంది ఉండగా ఎస్సీలు 23,358 మంది, ఎస్టీలు 9,407మంది, ఇతరులు 58,799 ఉన్నారు. వీరికి సంబంధించి 91,529 మంది కూలీల ఈ-కేవైసీ చేశారు. 86.87 శాతం ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లాలోని 1,96,420 మొత్తం కూలీల్లో 1,50,441 మంది ఈ-కేవైసీ సేకరించారు. ఇందులో 62.67శాతం 94,277 మంది కూలీల ఆధార్‌ అనుసంధానం పూర్తి చేశారు. ఈ నెలాఖరులోగా వంద పూర్తి చేసే దిశగా అధికారులు దృష్టి సాధించారు.

ఫ శాటిలైట్‌ ఆధారంగా పనులు నమోదు

ఉపాధిహామీ కింద చేపట్టే పనుల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం సాంకేతికతను జోడిస్తుంది. ఉపాధిహామీ పథకం పనులను శాటిలైట్‌ ఆధారంగా గుర్తిస్తున్నారు. ఇప్పటివరకు భువన్‌ యాప్‌లో ప్రాంతాన్ని చూపి పనులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి పనులు పూర్తయిన తర్వాత యాప్‌లో నమోదు చేస్తే సరిపోయేది. ఈ ఏడాది పనిచేస్తే మరో ఏడాది సామాజిక తనిఖీ తర్వాత మళ్లీ అక్కడే యాప్‌ వివరాలను తీసుకుంటుంది. కొత్తగా తీసుకొచ్చిన యుక్తధార యాప్‌లో నమోదు చేసే విధంగా చర్యలు ప్రారంభించారు. యుక్తధారలో వివరాలు నమోదు చేస్తే మరో ఏడాది అక్కడే పనులు చేసినట్లు చూపిన వివరాలు నమోదు కావు. దీంతో పనుల్లో పారదర్శకతతో పాటు పనుల వివరాలు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో ఈ-కేవైసీ వివరాలు

మండలం కూలీలు ఆధార్‌ అనుసంధానం

బోయిన్‌పల్లి 14,277 10,599

చందుర్తి 16,827 12,754

ఇల్లంతకుంట 20,254 16,364

గంభీరావుపేట్‌ 26,989 17,943

కోనరావుపేట 23,391 21,092

ముస్తాబాద్‌ 17,474 14,332

రుద్రంగి 6,001 4,382

తంగళ్ళపల్లి 16,614 13,862

వీర్నపల్లి 9,709 7,562

వేములవాడ 7,126 4,608

వేములవాడరూరల్‌ 10,258 8,236

ఎల్లారెడ్డిపేట 27,500 18,708

మొత్తం 1,96,420 1,50,442

Updated Date - Nov 07 , 2025 | 12:31 AM