Share News

Rajanna siricilla : ప్రేమానుబంధానికి ప్రతీక..

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:01 AM

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) ‘అమ్మ’లోని మొదటి అక్షరం.. ‘నాన్న’లోని చివరి అక్షరం.. కలిపితే అన్న.... అమ్మలోని ప్రేమ, నాన్నలోని బాధ్యతలతో సోదరికి భరోసా తోడుగా నిలుస్తాడు.

Rajanna siricilla :  ప్రేమానుబంధానికి ప్రతీక..

- నేడు రక్షా బంధన్‌.. నూలు పౌర్ణమి

- యజ్ఞోపవీతం.. పరమ పవిత్రం..

- జిల్లా కేంద్రంలో మార్కండేయ శోభాయాత్రకు సర్వం సిద్ధం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

‘అమ్మ’లోని మొదటి అక్షరం.. ‘నాన్న’లోని చివరి అక్షరం.. కలిపితే అన్న.... అమ్మలోని ప్రేమ, నాన్నలోని బాధ్యతలతో సోదరికి భరోసా తోడుగా నిలుస్తాడు. వారి ప్రేమానుబంధానికి, సోదర ప్రేమకు రక్షగా రాఖీ పండుగ నిలుస్తుంది. శ్రావణ పౌర్ణిమ రోజున జరుపుకునే రక్షాబంధన్‌ రంగురంగు దారాలతో అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల మధ్య మమతానుబంధానికి ప్రతీకగా భావిస్తారు. ఒకప్పుడు రాఖీ పండుగ ఉత్తరాదిన ఎక్కువగా జరుపుకునే వారు. క్రమేణా రాఖీ పండుగ అన్నాచెల్లళ్ల అనురాగానికి ప్రతీకగా మారి జాతీయ పండుగలాగా దేశంలోని అన్ని మారుమూల గ్రామాల్లో సైతం జరుపుకుంటున్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సోదరసోదరీ ఆత్మీయ బంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్‌ను జరుపుకుంటున్న వేళ జిల్లా కేంద్రంలో శ్రీ శివభక్త మార్కండేయ స్వామి శోభాయాత్రను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. నూలు పౌర్ణమి ఉత్సవాలను జరుపుకోనున్నారు. ఇందుకోసం ప్రధాన కూడళ్లను తోరణాలతో అలంకరించారు.

ఫ రాఖీల కొనుగోళ్ల సందడి...

కుటుంబంలోని కష్టసుఖాల్లో తోడుండే అన్నదమ్ములే కాకుండా నేస్తాలంతా సోదరులుగా ఆడపడుచులు రాఖీలు కట్టే వేళయింది. శనివారం రాఖీ పండుగ కావడంతో దూరంగా ఉండే సోదరుల ఇళ్లకు ముందే వెళ్లారు. ఈ పండుగ కోసం విభిన్న డిజైన్లలో ఉన్న రాఖీల కొనుగోళ్లతో సిరిసిల్ల మార్కెట్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా సందడిగా మారింది. మార్కెట్లో చిన్నారులకు స్సైడర్‌మ్యాన్‌, ఛోటా భీమ్‌, బెన్‌టెన్‌, డోరెమాన్‌, జెర్రీ, హనుమాన్‌ లాంటి వెరైటీ కార్టూన్లు, యువత కోసం ఫ్యాన్సీ స్టోన్స్‌ రాఖీలు వచ్చాయి. జిల్లా కేంద్రంలో రాఖీల కోసం ప్రత్యేకమైన దుకాణాలు కూడా వెలిశాయి. పశ్చిమ బెంగల్‌, గుజరాత్‌, మహారాష్ట్రల నుంచి వివిధ రకాల రాఖీలను తీసుకవచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. చిరువ్యాపారులు తోపుడు బండ్లపై రాఖీలను పెట్టుకొని కార్మిక వాడల్లో సైతం అమ్మకాలు సాగిస్తున్నారు. ఈసారి రాఖీలు అనేక డిజైన్లలో ఆకట్టుకుంటున్నాయి. రుద్రక్ష, స్టోన్‌ రాఖీలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. కుందన్‌ల మెరుపులు, జరీతోపాటు స్పంజ్‌తో తయారు చేసిన రాఖీలు మార్కెట్లోకి వచ్చాయి. పాతకాలంలో అతిపెద్దగా ఉండే రాఖీలు కట్టుకునే వారు. మళ్లీ ఆ ట్రెండ్‌ వచ్చింది. మార్కెట్లో రూ.50 నుంచి రూ.100 విలువచేసే పెద్ద రాఖీలు అమ్మకాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలను ఆకర్షించే విధంగా 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు క్రికెట్‌, మిక్కిమౌస్‌, స్పైడర్‌ మ్యాన్‌, డిజైన్లలో కూడా రాఖీలు వచ్చాయి. స్టోన్‌ రాఖీలు రూ 25నుంచి రూ 300ల వరకు లభిస్తున్నాయి. 1 గ్రాముతో తయారు చేసిన రాఖీలు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి.

చరిత్రలో రాఖీ నేపధ్యం.....

క్రీస్తుపూర్వం 326లో అలెగ్జాండర్‌ భారతదేశంలోని పురుషోత్తముడి రాజ్యంపై దండెత్తాడు.ఆ సమయంలో అలెగ్జాండర్‌ ప్రేయసి రుక్సానా పురుషోత్తముడికి రక్షాబంధన్‌ కడుతుంది. ఆ కంకణానికి విలువనిచ్చిన పురుషోత్తముడు యుద్ధంలో చేతికి చిక్కిన అలెగ్జాండర్‌ను ప్రాణాలతో వదిలేస్తాడు. ఆ తరువాత పురుషోత్తముడిని అలెగ్జాండర్‌ బంధిస్తాడు. ఆ తరువాత సభా భవనంలో పురుషోత్తముడు బెదురులేకుండా ఒక రాజు మరో రాజును ఎలా గౌరవిస్తారో అలాగే అంటూ రుక్సానా కట్టిన రక్షాబంధనంతోనే తాను ప్రాణాలతో ఉన్నానని తెలుసుకున్న అలెగ్జాండర్‌ పురుషోత్తమున్ని కీర్తించి వదిలేస్తాడు. మరో చారిత్రక కథనం ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగినప్పుడు దేవతలకు నిస్సత్తువ ఆవహిస్తుంది. ఇంద్రుని భార్య శశిదేవి బృహస్పతి సలహా మేరకు ఒక రక్షణు ఇంద్రునికి కడుతుంది. ఆ యుద్ధంలో ఇంద్రుడు రాక్షసుల్ని ఓడిస్తాడు. అలా పౌర్ణమి రోజు రక్షగా చేతికి తోరం కట్టుకోవడం ఆచారంగా మారిందని చెప్పుకుంటారు. రాజపుత్రులు దీనికి ఎంతో ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుంది. మరోవైపు మనుషుల్లో ప్రేమ, ఆప్యాయత, మమతను పెంచడం కోసం గురుదేవ్‌, రవీంద్రనాథ్‌ఠాగూర్‌ తన శాంతినికేతన్‌లో రక్షా బంధన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

జంధ్యాల పూర్ణిమా....

శ్రావణ పూర్ణిమనే జంధ్యాల పూర్ణిమ(నూలు పౌర్ణమి)గా జరుపుకుంటారు. యజ్ఞోపవీతాన్ని శ్రావణ పూర్ణిమ రోజు మార్చుకుంటారు. సంవత్సరం మధ్యలో మార్చుకోవల్సిన అవసరం ఉన్నా శ్రావణ పూర్ణిమ నాడు విధిగా నూతన ధారణ చేస్తారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా శనివారం అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు వారి క్షేమాన్ని కోరుతూ రక్షగా రాఖీ కట్టే పండుగను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. శ్రావణ పూర్ణిమ రోజు రక్ష కట్టి వారు కోరిన వరాలను పొందే పవిత్ర దినంగా కూడా జరుపుకుంటారు. ఇదే సందర్భంలో ఉపనయం అయిన బ్రహ్మణ, వైశ్య, పద్మశాలీ ఇతర కులాల వారు యజ్ఞోపవీతాలను మార్చుకుంటారు. పాతవాటి స్థానంలో కొత్తవి ధరిస్తారు. నూలు పౌర్ణమి సందర్భంగా పద్మశాలీలు మార్కండేయ స్వామి రథోత్సవాన్ని నిర్వహిస్తారు.

ఫ ఎవరెవరికి ఎన్ని పోగులు...

యజ్ఞోపవీత ఽధారణ ఎంతో గొప్పగా భావిస్తారు. వివాహం కాని వధువులకు యజ్ఞోపవీత ఒక పోగుచాలు. గృహస్తులకు, విదురులకు మూడు పోగులు చాలు, కొందరు ఐదు పోగులు ధరిస్తారు. యజ్ఞోపవీతం మూడు భాగాలుగా తయారు చేస్తారు. ఇందులో ఒకొక్క ముడిలో మూడు ధారాలతో మొత్తం తొమ్మిది ధారాలు ఉంటాయి. 96 బెత్తల పొడవు ఉంటుంది. ఒక్కొక్క ధారం వెనుక ఒక్కొక్క నేపథ్యం ఉంది. మొదటి పోగు ధారం ఓంకారం, బ్రహ్మకు నిలయంగా ఉంటే, రెండవ పోగు తేజస్సు, అగ్ని, మూడవ పోగు అనంతునికి, నాలుగవ పోగు చంద్రునికి, చల్లాని కాంతినిచ్చేదిగా, ఐదవ పోగు ప్రజాపతికి, ఆరవ పోగు పాలించే స్వభావం, ఏడవ పోగు వాయుదేవుడు, శుభ్రత, ఎనిమిదవ పోగు సూర్య నిలయం, ప్రతాపం, తొమ్మిదవ పోగు అందరు దేవతలు సమదృష్టిని ఇచ్చేదిగా ఉంటుందని వేదాలు చేబుతున్నాయి. అందుకే యజ్ఞోపవితాన్ని శ్రావణ పూర్ణిమ రోజు మార్చుకోవడం సనాతనంగా వస్తుంది. భారతీయ ధర్మ నిర్మాణ వ్యవస్థలో యజ్ఞోపవీతం లేనిదే ఏ ఇంట్లో కూడా శుభకార్యాలు, పూజలు జరుపుకోరు.

శ్రావణ పౌర్ణమి సందర్భంగా అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములకు వారి క్షేమాన్ని కోరుతూ రక్షగా రాఖీ కట్టే పండుగను జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. శ్రావణ పూర్ణిమ రోజు రక్ష కట్టి వారు కోరిన వరాలను పొందే పవిత్ర దినంగా కూడా జరుపుకుంటారు. ఇదే సందర్భంలో ఉపనయం అయిన బ్రహ్మణ, వైశ్య, పద్మశాలీ ఇతర కులాల వారు యజ్ఞోపవీతాలను మార్చుకుంటారు. పాతవాటి స్థానంలో కొత్తవి ధరిస్తారు. కొత్తగా ఉపనయం పొందుతారు. పద్మశాలీలు ఉదయమే జంధ్యాలను మార్చుకొని సాయంత్రం వేళ మార్కండేయ స్వామి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ఎడ్లబండిపై లేదా ట్రాక్టర్‌పై మగ్గాన్ని నిలిపి వస్త్రాన్ని నేస్తూ పట్టణ వీధుల్లో రథాన్ని నడిపిస్తారు. రథోత్సవంలో నేసిన వస్త్రాన్ని మార్కండేయునికి సమర్పించుకుంటారు. అందుకే పద్మశాలీలు జంధ్యాల పూర్ణిమను నూలు పూర్ణిమగా కూడా జరుపుకుంటారు.

ప్రేమను పెంచుతుంది..

- బుస్స అక్షర

మనుషుల్లో రాఖీ పండుగ ప్రేమను పెంచుతుంది. ఆప్యాయత మమతను పరమళింపచేయడం కోసం ఈ రక్షా బంధనం రక్త సంబంధీకుల మధ్య ఆనందాన్ని నింపుతుంది.

రక్షాబంధన్‌ ధైర్యాన్నిస్తుంది..

- బి దివ్య

మహిళలకు ఆధ్యాత్మికంగా నోములు, వ్రతాలకు శ్రావణమాసం ముఖ్యమైంది. రక్షాబంధన్‌ తోబుట్టువులు అండగా ఉన్నారనే ధైర్యాన్నిస్తుంది. సోదరులకు రక్ష కట్టి ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని సోదరి కోరుకుంటుంది.

సోదరులకు శుభం కలగాలని..

- తమ్మిశేట్టి సారిక

రాఖీ పండుగతో సోదరులకు శుభం కలుగాలని కోరుకుంటాం. రక్తబంధానికి ఇది ప్రతీకగా నిలుస్తుంది. ఆయురారోగ్యాలను, పెంచడమే కాకుండా కుటుంబ సభ్యులందరు ఒకచోట చేరుకోవడానికి దోహద పడుతుంది.

Updated Date - Aug 09 , 2025 | 01:01 AM