raajann siricilla : ‘రంగుల’ కళ చెదిరిపోతోంది..
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:52 AM
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) సిరిసిల్ల అనగానే అందరికి గుర్తుకు వచ్చేది మరమగ్గాల చప్పుళ్లు. వాటికి అనుబంధంగా ఉండే రంగురంగుల అద్దకం పరిశ్రమ.
- సిరిసిల్లలో అద్దకం పరిశ్రమ వెలవెల..
- ఉత్పత్తితో ఉపాధి కోల్పోతున్న కార్మికులు
- సిరిసిల్లలో 270 డైయింగ్ పరిశ్రమలు మూత
- అరకొరగా నడుస్తున్న 30 పరిశ్రమలు
- తమిళనాడు నుంచి తీవ్ర పోటీ
- తగ్గిన కాటన్ ఉత్పత్తితో కష్టాలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
సిరిసిల్ల అనగానే అందరికి గుర్తుకు వచ్చేది మరమగ్గాల చప్పుళ్లు. వాటికి అనుబంధంగా ఉండే రంగురంగుల అద్దకం పరిశ్రమ. అద్దకం వస్త్రాలతో దక్షిణాది రాష్ట్రాలకు పెటీకోట్స్ వస్త్రాన్ని అందిస్తున్న సిరిసిల్ల కాటన్ అద్దకం పరిశ్రమ రంగులు చెదిరిపోతూ కార్మికులకు ఉపాధిని దూరం చేస్తోంది. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లోని పరిశ్రమలతో తీవ్ర పోటీని ఎదుర్కొని నిలబడే ప్రయత్నం చేస్తున్నా రంగులు, రసాయనాల ధరలు పెరిగిపోవడంతో అద్దకం కూలీ గిట్టుబాటు కానీ పరిస్థితులు ఏర్పడ్డాయి. బతుకమ్మ చీరలతో పాటు పెటీకోట్స్ ఇవ్వాలని అద్దకం పరిశ్రమ యజమాన్యం, కార్మికులు కోరుతున్నా ప్రభుత్వం ఆ దిశగా అలోచన చేయకపోవడంతో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి.
ఫ దక్షిణాది రాష్ట్రాలకు రంగుల వస్త్రం..
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతో ఎత్తుకు ఎదుగుతూ మరమగ్గాలు, అనుబంధ పరిశ్రమల వైపు అడుగులు వేసింది. మరమగ్గాలపై కాటన్ వస్త్రాలు ఉత్పత్తి అయితే వాటికి రంగులు అద్ది దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ అగ్రగామిగా నిలిచింది. చిన్నచిన్న యంత్రాలతో కుటీర పరిశ్రమగా రంగుల ప్రపంచంలో ఎంతో మందికి ఉపాధి లభించింది. ఆధునిక యంత్రాలు, మిల్లు వస్త్రం నుంచి ఎదురైన పోటీతో పరిస్థితులు తలకిందులు అయ్యాయి. మరమగ్గాలకు అనుబంధంగా ఉన్న అద్దకం పరిశ్రమ కష్టాల్లో పడింది. సిరిసిల్లలో 30 వేల మరమగ్గాలు ఉంటే అందులో 10 వేలకు పైగా మరమగ్గాలపై కాటన్ బట్ట ఉత్పత్తి జరిగేది. మిగతా మరమగ్గాలపై పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తి వచ్చేది. కాటన్ ఉత్పత్తికి అనుబంధంగా 28 సైజింగ్‌లు, 300లకు పైగా డైయింగ్ యూనిట్లు పనిచేసేవి. తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఆధునిక డైయింగ్ యంత్రాలు ఉపయోగించడంతో సిరిసిల్ల అద్దకం పరిశ్రమకు తీవ్ర పోటీ ఏర్పడింది. మరమగ్గాల పరిశ్రమలో తరచూ వచ్చే సంక్షోభం పాలిస్టర్, కాటన్ వస్త్రోత్పత్తికి విఘాతం కలిగేవి. కార్మికుల ఆత్మహత్యలు పనులు లేక పరిశ్రమలు మూతపడేవి. దీంతో కార్మికుల ఆత్మహత్యలు, ఆకలి చావులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కుదిపేసేవి. తెలంగాణ ప్రభుత్వం సిరిసిల్ల కార్మికులకు చేతినిండా పని కల్పించాలనే లక్ష్యంగా గత ప్రభుత్వ బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు చీర కానుకగా అందించడం ద్వారా నేతకార్మికులకు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చారు. 2017 నుంచి బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లను సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు అందించి ఉపాధి కల్పిస్తూ ప్రతియేటా కోటి చీరలు ఉత్పత్తి చేశారు. మరమగ్గాలపై కాటన్ ఉత్పత్తి నిలిచిపోయి బతుకమ్మ చీరలు మొదలు కావడంతో అనుంబంధ పరిశ్రమలు సంక్షోభంలో చిక్కాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్వశక్తి మహిళలకు చీరలను అందించాడనికి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు ఇచ్చి ఉత్పత్తి చేయిస్తోంది.
ఫ డైయింగ్, సైజింగ్‌లకు మొదలైన కష్టాలు..
సిరిసిల్లలో 30 వేల మరమగ్గాలు ఉండగా, వీటిలో ఎక్కువ శాతం గతంలో బతుకమ్మ చీరలు, ప్రస్తుతం స్వశక్తి చీరలు, ఇతర పాలిస్టర్ వస్త్రం ఉత్పత్తి మొదలైంది. చీరల ఆర్డర్లతో కాటన్ వస్త్రం ఉత్పత్తి నిలిచిపోయింది. గతంలో దాదాపు 15 వేల మరమగ్గాలపై నడిచే కాటన్ ఉత్పత్తి ఇప్పుడు 1500 మరమగ్గాలకు పడిపోయింది. కాటన్ ఉత్పత్తులకు అనుబంధంగా మొదలైన 28 సైజింగ్‌ల్లో 18 సైజింగ్‌లు మూతపడ్డాయి. దీనికి తోడు కాటన్, రసాయనాల ధరలు కూడా పెరిగిపోయాయి. దీనికి అనుగుణంగా మార్కెట్‌లో వస్త్ర ఉత్పత్తికి ధర పెరగకపోవడంతో పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. ఇప్పుడు 10 సైజింగ్‌లు నడుస్తున్నా అందలోనూ నెలకు 15 రోజులు మాత్రమే కార్మికులకు పని దొరుకుతోంది. మరోవైపు 300 డైయింగ్ పరిశ్రమల్లో 270వరకు మూతపడ్డాయి. 30 డైయింగ్‌లు నామమాత్రంగా అద్దకం జరుపుతున్నాయి. నెలలో కేవలం 2 వారాలు మాత్రమే కార్మికులకు పని ఉంటుంది. పూర్తి స్థాయిలో పని ఉంటే ఒక కార్మికుడు నెలకు రూ 20 వేల వరకు సంపాదించుకునే వారు. ప్రస్థుతం రూ 10 వేలకు మించి లభించడం లేదు. అద్దకం పనిలేని రోజు ఇతర పనులు చేసుకుంటున్నారు. గతంలో అద్దకం సైజింగ్ పరిశ్రమపై 5వేల మంది ఉపాధి పొందేవారు.. ప్రస్తుతం వారు ప్రత్యామ్నాయ వృత్తుల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం వెయ్యి మంది వరకు పనులు చేస్తుండగా, ఆ పనులు కూడా దొరకని పరిస్థితి ఉంది. గతంలో సిరిసిల్ల డైయింగ్ పరిశ్రమ నుంచి రంగుల వస్త్రం దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లోని తమిళనాడు, గుజరాత్‌లలో అద్దకం పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం రాజస్థాన్‌లోని బలహోత్రాలో ఆధునిక డైయింగ్ యూనిట్లు రావడం, ప్రభుత్వాల ప్రోత్సాహం ఉండడంతో సిరిసిల్ల అద్దకం పరిశ్రమ మూతపడే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అద్దకం పరిశ్రమకు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరుతున్నారు.