Share News

అసెస్‌మెంట్‌ కోసం అగచాట్లు

ABN , Publish Date - Nov 10 , 2025 | 01:27 AM

ఇటీవల వరకు ఇల్లు లేకుండానే ఖాళీ స్థలాలకు, రేకుల షెడ్లకు అధికారులు ఇంటి నంబర్లు ఇచ్చారు.

అసెస్‌మెంట్‌ కోసం అగచాట్లు

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఇటీవల వరకు ఇల్లు లేకుండానే ఖాళీ స్థలాలకు, రేకుల షెడ్లకు అధికారులు ఇంటి నంబర్లు ఇచ్చారు. ఫిర్యాదులు రావడంతో అలాంటి ఇంటి నంబర్లను తొలగించారు. ఇల్లు లేదా రేకుల షెడ్డు అయినా కిచెన్‌, మరుగుదొడ్ల, బోరుబావి, బావి వంటివి ఉంటేనే ఇంటి నంబర్లను కేటాయిస్తున్నారు. కొందరు నివాస గృహంగా పేర్కొని ఇంటి నంబర్లు తీసుకొని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు. కమర్షియల్‌ హౌస్‌ ట్యాక్సు చెల్లించకుండా సాధారణ పన్నులే చెల్లిస్తున్నారు. వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న ఇళ్లకు విద్యుత్‌ మీటర్లను కమర్షియల్‌ కేటగిరిలో తీసుకొని బిల్లులు చెల్లిస్తున్నారే కానీ నగరపాలక సంస్థకు మాత్రం నివాస గృహంగా ఆస్తిపన్ను చెల్లిస్తున్నారు. వీటితో నగరపాలక సంస్థ ఆదాయానికి గండి పడుతోంది.

ఫ రీ అసెస్‌మెంట్‌తో పెరిగిన పన్నులు

ఆస్తిపన్ను ఆదాయంలో జరుగుతున్న లోపాలను సరిదిద్దేందుకు కమర్షియల్‌ విద్యుత్‌ మీటర్ల ఆధారంగా ఇళ్లను పరిశీలించి కమర్షియల్‌ హౌస్‌గా ఆస్తిపన్నును నిర్ధారించి వసూలు చేయాలని కమిషనర్‌ అధికారులను ఆదేశించారు. రీఅసెస్‌మెంట్‌ ప్రక్రియను చేపట్టి కమర్షియల్‌గా వినియోగించే ఇళ్లు, భవనాలకు కమర్షియల్‌ కేటగిరిలో ఆస్తిపన్నులను వసూలు చేస్తున్నారు. దీంతో ఆస్తిపన్నులు భారీగా పెరిగాయని ఇంటి యజమానులు గగ్గోలు పెడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని కొంత మంది మున్సిపల్‌లోని రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు ఆస్తిపన్నులను తగ్గించేందుకు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు ఇవ్వని వారికి పన్నులను తగ్గించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

ఫ సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌తో ఇబ్బందులు

కొత్తగా ఇంటి నంబర్ల కోసం దరఖాస్తు చేసుకునే ఇంటి యజమానులు సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మీసేవ, ఈ సేవల్లో సెల్ఫ్‌అసెస్‌మెంట్‌ ప్రాసెస్‌ చేసేందుకు నిర్వహకులకు ఫీజులు చెల్లించి వారు తెలిపిన మేరకు ఆస్తి పన్నులను చెల్లిస్తున్నారు. ఇలా సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ చేసుకున్న ఆర్జీలను సంబంధిత మున్సిపల్‌ బిల్‌ కలెక్టర్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, రెవెన్యూ అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. వారు చేసుకున్న అసెస్‌మెంట్‌లో పేర్కొన్న ప్రకారం ఇంటి కొలతలు ఉన్నాయా, పన్నులు సరిగా చెల్లించారా లేదా చూసి 21 రోజుల్లో వారికి ఇంటి నంబర్లను కేటాయించాల్సి ఉంటుంది. చాలా మంది ఇంటి యజమానులకు సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌పై అవగాహన లేక పోవడంతో మీసేవ, ఈసేవల నిర్వహకులపైనే ఆధారపడి వారు చేసిన కొలతల మేరకు ఫీజులు చెల్లిస్తున్నారు. వారు చేసిన కొలతల్లో తేడా ఉంటే వాటిని సరిచేయకుండా అర్జీలను రద్దు చేస్తున్నారు. దీంతో వారు అప్పటికే అసెస్‌మెంట్‌ కోసం చెల్లించిన ఫీజులతోపాటు మీసేవ నిర్వహకులకు ఇచ్చిన డబ్బులను కోల్పోవలసి వస్తోంది. తిరిగి సెల్ప్‌ అసెస్‌మెంట్‌ చేసుకోవాలని సూచిస్తుండడంతో మరోసారి ఆన్‌లైన్‌ నిర్వహకులకు డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఇంటి యజమానులు వాపోతున్నారు. సెల్‌ఫోన్‌లో కానీ, కంప్యూటర్‌లోకానీ సెల్ప్‌ అసెస్‌మెంట్‌ ఎవరైనా ఇంటి నుంచి అయినా చేసుకోవచ్చని చెబుతున్నా కనీస పరిజ్ఞానం లేకుండా సెల్ప్‌అసెస్‌మెంట్‌ చేసుకుంటే తప్పుజరుగుతుందనే భయంతో చాలా మంది మీసేవ, ఈసేవ నిర్వహకుల వద్దకు వెళ్లుతున్నారు. వారు చేసే తప్పులతో కూడా ఇంటి యజమానులకు నష్టం కలుగుతోంది.

ఫ ఇంటి నంబర్‌ ఇచ్చేందుకు ముప్పుతిప్పలు

సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌తో దరఖాస్తు చేసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఇంటి నంబర్లను ఇవ్వడంలో సిబ్బంది జాప్యం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. కావాలని కొర్రీలు పెడుతూ డబ్బులు ఇస్తే తప్పా అసెస్‌మెంట్‌ చేయడం లేదని ఇళ్ల యజమానులు అంటున్నారు. కొందరు ఉద్యోగులు అసెస్‌మెంట్‌ పూర్తి చేసేందుకు ఫీజులతోపాటు ఎంతో కొంత ఇవ్వాల్సిందేనంటూ ఇంటియజమానులపై ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరు చిన్నపాటి డీవియేషన్‌ చూపించి అసెస్‌మెంట్‌ చేయకుండా రద్దు చేస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా విలీన గ్రామాల్లో గ్రామపంచాయతీ నుంచి కార్పొరేషన్‌లో విలీనమైనందున ఆస్తిపన్నులు పెరిగాయని, కమర్షియల్‌గా ఇంటిని వినియోగిస్తున్నారని బెదిరిస్తూ రెవెన్యూ ఉద్యోగులు భారీగా చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా అక్రమ వసూళ్లను అరికట్టడం కోసం ప్రభుత్వం సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అర్జీలను స్వీకరించినా అసెస్‌మెంట్‌ పూర్తి చేసి ఇంటి నంబర్‌ ఇచ్చేందుకు ముప్పుతిప్పలు పెడుతున్నారని ఇళ్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల విస్తీర్ణం, దాని వినియోగం, వారి డాక్యుమెంట్‌లోని విలువ ఆధారంగా ఆస్తిపన్ను నిర్ధారించాల్సి ఉంటుంది. ఒక అపార్టుమెంట్‌లోని ఒకే విస్తీర్ణం కలిగిన ప్లాట్లకు ఒకే రకమైన ఆస్తిపన్ను నిర్ధారించాల్సి ఉండగా, ఒకరికి ఎక్కువ, మరొకరికి తక్కువ పన్ను నిర్ధారిస్తున్నారని, డబ్బులు ఇవ్వకుంటే ఎక్కువ పన్నులు వేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్‌ నగరపాలక సంస్థలో కొత్తగా అసెస్‌మెంట్‌ చేసుకొని ఇంటి నంబర్‌ పొందాలన్నా, రీ అసెస్‌మెంట్‌లో పన్ను నిర్ధారించాలన్నా చేతి తడపక తప్పడం లేదని ఇంటియజమానులు వాపోతున్నారు. అసెస్‌మెంట్‌, రీ అసెస్‌మెంట్‌లో జరుగుతున్న అక్రమాలపై కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ విచారణ జరిపింంచాలని కోరుతున్నారు.

Updated Date - Nov 10 , 2025 | 01:27 AM