Share News

మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ABN , Publish Date - Sep 17 , 2025 | 12:44 AM

విద్యార్థులకు అందించే మధ్యాహ్నభోజనంలో తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా సూచించారు.

మధ్యాహ్న భోజనంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

ఇల్లంతకుంట, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు అందించే మధ్యాహ్నభోజనంలో తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝా సూచించారు. మండలంలోని పెద్దలింగాపూర్‌ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంగళవారం పరిశీలించారు. మధ్యాహ్నభోజనాన్ని గ్యాస్‌స్టవ్‌పైనే తయారు చేయాలన్నారు. పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు, ఎంత మంది ఉపాధ్యాయులు ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను సందర్శించి ఎల్‌ఈడీ ప్యానల్‌బోర్డుల వివరాలపై ఆరాతీశారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ద చూపెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, సేవలందించడంలో నిర్లక్ష్యం చర్యలు తప్పవన్నారు. వైద్యసిబ్బంది అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అందించే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, సుఖప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. ఆరోగ్యకేంద్రంలోని వార్డులను, విభాగాలను పరిశీలించి వివరాలు అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బోయిని తిరుపతి, వైద్యాధికారి ప్రేమ్‌కుమార్‌, హెచ్‌ఈవో వెంకటరమణలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2025 | 12:47 AM