కొనుగోళ్లను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:40 PM
గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని వసతులు కల్పించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు.
ఎల్లారెడ్డిపేట, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని వసతులు కల్పించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి, సింగారం గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను సోమవారం ఆమె పరిశీలించారు. కేంద్రాలకు రైతులు తీసుకు వచ్చిన ధాన్యం ఎంత..? ఎన్ని క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. సింగారం గ్రామంలో తూకం వేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లు దింపుకోవడం లేదని, అదనంగా కోత విధింపునకు అంగీకరిస్తేనే అన్‌లోడ్ చేసుకుంటున్నారని రైతులు ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో స్పందించిన ఆమె ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌బేగంను ఆదేశించారు. అన్నదాతలు కేంద్రాల్లో విక్రయించి మద్ధతు ధరను పొందాలని కోరారు. కేంద్రాల్లో వసతులు కల్పించాలని సూచించారు. తేమ శాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని పేర్కొన్నారు. ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తప్పవని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ హెచ్చరించారు.
నాణ్యమైన విద్య, రుచికరమైన భోజనం అందించాలి
మండలంలోని రాగట్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీ చేశారు. పాఠశాలలోని వంట గది, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థుల ప్రగతిపై ఆరా తీశారు. చిన్నారుల పేర్లను బోర్డుపై రాయించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నిత్యం చదివించడం, రాయించడంతో పాటు అభ్యాసన సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనంలో ఏమైనా సమస్యలున్నాయా..? అని వంట నిర్వాహకులను ప్రశ్నించారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం వడ్డించాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి
ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. లబ్ధిదారులు త్వరతగతిన పనులను పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాలు, ప్రభుత్వం చెల్లిస్తున్న బిల్లులపై ఆరా తీశారు. నిర్మాణాల్లో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంను సద్వినియోగం చేసుకుని స్వంతింటి కలను సాకారం చేసుకోవాలని కోరారు. ఆమె వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌బేగం, ఇన్‌చార్జి తహసీల్దార్ మురళీకృష్ణ, ఎంపీవో రాజు, ఆర్‌ఐ శ్రవణ్, ఐకే పీ ఏపీఎం నర్సయ్య, తదితరులు ఉన్నారు.