Share News

క్రిస్మస్‌ వేడుకల్లో ప్రొటోకాల్‌ వివాదం

ABN , Publish Date - Dec 25 , 2025 | 01:07 AM

కరీంనగర్‌లో మంగళవారం నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో ప్రొటోకాల్‌ పాటించకపోవడం వివాదంగా మారుతోంది. వేడుకల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మానకొండూర్‌ శాసనసభ్యుడు, డీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఫొటో ఏర్పాటు చేయకపోవడంపై కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గతంలో ఒకటిరెండు సార్లు ఉద్దేశపూర్వకంగానే తనపై వివక్ష చూపిస్తున్నారని కవ్వంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వర్గీయులు ఆగ్రహాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో తాజాగా జరిగిన సంఘటన ప్రొటోకాల్‌ పాటించని వారిపై చర్యకు డిమాండ్‌ చేస్తూ ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది.

క్రిస్మస్‌ వేడుకల్లో ప్రొటోకాల్‌ వివాదం
స్టేజీపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కనిపించని ఎమ్మెల్యే కవ్వంపల్లి ఫొటో

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కరీంనగర్‌లో మంగళవారం నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో ప్రొటోకాల్‌ పాటించకపోవడం వివాదంగా మారుతోంది. వేడుకల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మానకొండూర్‌ శాసనసభ్యుడు, డీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ ఫొటో ఏర్పాటు చేయకపోవడంపై కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో గతంలో ఒకటిరెండు సార్లు ఉద్దేశపూర్వకంగానే తనపై వివక్ష చూపిస్తున్నారని కవ్వంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వర్గీయులు ఆగ్రహాన్ని ప్రదర్శించిన నేపథ్యంలో తాజాగా జరిగిన సంఘటన ప్రొటోకాల్‌ పాటించని వారిపై చర్యకు డిమాండ్‌ చేస్తూ ఫిర్యాదు చేసే వరకు వెళ్లింది. మంగళవారం జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సీఎస్‌ఐ చర్చ్‌లో జరిగిన క్రిస్‌మస్‌ వేడుకల్లో వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్‌పై ప్రొటోకాల్‌ ప్రకారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఫొటోలు ముద్రించిన అధికారులు, కవ్వంపల్లి సత్యనారాయణ ఫొటోను విస్మరించారు. ఈ విషయాన్ని గుర్తించిన ఆయన అనుచరులు వేడుకలు జరిగిన సందర్భంలోనే ప్రశ్నించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలకు అంతరాయం కలుగకూడదనే ఉద్దేశంతో గొడవ చేయకుండా ఉన్నట్లు సమాచారం.

సన్నబియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమంలోనూ..

గతంలో ఇలాగే జరిగింది. సన్నబియ్యం పంపిణీ ప్రారంభించిన సందర్భంలోనూ కవ్వంపల్లి సత్యనారాయణ ఫొటోను అధికారులు ఏర్పాటు చేయలేదు. జిల్లాలో నెలకొన్న రాజకీయాల కారణంగానే అధికారులు కొందరి సలహాలతో కవ్వంపల్లి ఫొటోను ఫ్లెక్సీలలో, బ్యానర్లలో ఉంచడం లేదని, కొన్ని కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని ఆరోపిస్తూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో ప్రొటోకాల్‌ విస్మరించడానికి ఆశాఖ అధికారి బాధ్యత వహించాల్సి ఉన్నా జిల్లా యంత్రాంగం ప్రొటోకాల్‌ వ్యవహారంపై జవాబు ఇచ్చుకోవలసిన స్థితి ఏర్పడింది.

కలెక్టర్‌కు ఫిర్యాదు

అధికారులు ప్రొటోకాల్‌ పాటించకుండా అనుచితంగా వ్యవహరించారని భావించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం, కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్‌కుమార్‌ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కవ్వంపల్లి సత్యనారాయణపై ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని, సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఏడో వార్డులో జరిగినపుడు అది ఆ నియోజకవర్గ పరిధిలోనిది అయినప్పటికి ప్రొటోకాల్‌ పాటించలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉన్నత విద్యావంతుడు, గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న దళిత ప్రజాప్రతినిధిని విస్మరించారన్నారు. అధికారయంత్రాంగం ఉద్దేశపూర్వకంగానే సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని ఇలా వ్యవహరిస్తుందా అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని కలెక్టర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొనడం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వడం అవసరం, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌ను కోరారు. ఇంత వరకు ఈ వ్యవహారం అధికారుల తప్పిదాన్ని మాత్రమే ఎత్తిచూపుతున్నా మరోవైపు కాంగ్రెస్‌ పార్టీలో రాజకీయ చర్చకు తెరలేసింది. డీసీసీ అధ్యక్షుడిగా కవ్వంపల్లి సత్యనారాయణ బాధ్యతలు నిర్వహించినప్పుడు ఆయనకు కాంగ్రెస్‌ పార్టీలోని ఇతర నాయకులతో ఏర్పడిన విబేధాల నేపథ్యం కూడా ఈ సంఘటనల వెనుక ఉండవచ్చని అనుకుంటున్నారు. రాజకీయ కారణాలైనా అధికారుల తప్పిదమైనా ఇలా జరగడం సమంజసం కాదనే అభిప్రాయాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Dec 25 , 2025 | 01:07 AM