మత్తు పదార్థాలతో అనర్థాలపై ప్రచారం చేయండి
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:42 PM
మత్తు పదార్థాలతో అనర్థాలపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాలో నిర్వహించవలసిన వివిధ కార్యక్రమాలపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు.
కరీంనగర్ క్రైం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): మత్తు పదార్థాలతో అనర్థాలపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లాలో నిర్వహించవలసిన వివిధ కార్యక్రమాలపై జిల్లాస్థాయి కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. అక్టోబరు నెలాఖరు వరకు జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరించాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, మెడికల్ కళాశాలల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. మాదకద్రవ్య వ్యతిరేక సందేశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. మాదకద్రవ్య రహిత భారత్ గురించి యువతకు వివరించేలా డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. మారథాన్ నిర్వహించి మాదకద్రవ్యాల అనర్థాలపై ప్రజలకు సందేశం ఇవ్వాలని సూచించారు. సామూహిక ప్రతిజ్ఞ చేయించాలని, ప్రతిజ్ఞను సూచించే ఆన్‌లైన్ క్యూఆర్ కోడ్‌ను జనసందోహం ఉన్న ప్రాంతాల్లో ప్రదర్శించాలని సూచించారు. అనంతరం నషా ముక్త్ భారత్ ప్రతిజ్ఞకు సంబంధించిన క్యూఆర్ కోడ్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఎన్‌వైకే కో ఆర్డినేటర్ రాంబాబు, నాకార్డ్ విభాగం సీఐ పుల్లయ్య, డీసీపీవో పర్వీన్, సీడీపీవో సబిత, విద్యాశాఖ కో ఆర్డినేటర్ ఆంజనేయులు, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్, ఎస్‌ఐ పాషా, నషా ముక్త్ భారత్ కమిటీ మెంబర్లు కేశవరెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు.