ప్రాథమిక విద్య పునాదిరాయి లాంటిది
ABN , Publish Date - May 21 , 2025 | 11:55 PM
విద్యార్థుల, ఉద్యోగుల భవిష్యత్తు నిర్మాణంలో ప్రాథమిక విద్య పునాదిరాయి లాంటిదని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం సెయింట్‌జార్జ్ పాఠశాలలో జరుగుతున్న కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, గన్నేరువరం, వీణవంక మండలాల ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ సందర్శించారు.
- కలెక్టర్ పమేలా సత్పతి
కొత్తపల్లి, మే 21 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల, ఉద్యోగుల భవిష్యత్తు నిర్మాణంలో ప్రాథమిక విద్య పునాదిరాయి లాంటిదని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం సెయింట్‌జార్జ్ పాఠశాలలో జరుగుతున్న కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, గన్నేరువరం, వీణవంక మండలాల ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులను అద్భుతంగా తీర్చిదిద్దడంలో ప్రాథమిక ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థులు ఉన్నత విద్యలో విజయం సాధించడంలో ప్రాథమిక విద్య పునాది లాంటిదన్నారు. అనుకున్న లక్ష్యాలు చేరుకోవడానికి ఆశించిన అభ్యసనా ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయ బృందం ఎల్లప్పుడూ అప్‌డేట్ అవుతుండాలని, ఇందులో భాగంగా ఈ వృత్యంతర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వీటిని చక్కగా వినియోగించుకుని విద్యార్థులను ఆణిముత్యాలుగా తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి జిల్లా యంత్రాంగం సదా సిద్ధంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో సెయింట్‌జార్జ్ విద్యాసంస్థల చైర్మన్ పి ఫాతిమారెడ్డి, సెక్టోరియల్ ఆఫీసర్ కె అశోక్ రెడ్డి, ఎంఈవోలు కె రవీందర్, టి ఆనందం, కె రామయ్య, శోభారాణి, రీసోర్స్ పర్సన్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.