చిన్నారులకు ‘ప్రీ ప్రైమరీ’
ABN , Publish Date - Jul 30 , 2025 | 01:16 AM
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహాలో విద్యాబోధన అందించే దిశగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే డిజిటల్ తరగతి గదులు, ఏఐ క్లాసులు, ఆధునిక సౌకర్యాలతో తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు ప్రీ ప్రైమరీ బోధన అందించడానికి ఏర్పాట్లు చేస్తోంది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ తరహాలో విద్యాబోధన అందించే దిశగా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటికే డిజిటల్ తరగతి గదులు, ఏఐ క్లాసులు, ఆధునిక సౌకర్యాలతో తరగతి గదులు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులకు ప్రీ ప్రైమరీ బోధన అందించడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీంతో పేద, మధ్యతరగతి వర్గాలకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విద్యా భారం తప్పుతుంది. యూకేజీ వరకు ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు చెల్లించి చదివించే పరిస్థితి రానున్న రోజుల్లో తొలగిపోతుందని భావిస్తున్నారు. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ విద్య అందిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో కూడా ప్రీ ప్రైమరీ విద్య అందించడంపై పేద, మధ్య తరగతి కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఫ జిల్లాలో తొలి విడతలో 13 ప్రీ ప్రైమరీ పాఠశాలలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడతగా 13 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య కోసం ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో గతంలో ప్రభుత్వ సహకారంతో 31 పాఠశాలలో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో ప్రీ ప్రైమరీ విద్య అందించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 626 ఉన్నాయి. గత విద్యాసంవత్సరం 82,636 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 50,516 మంది, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 32,120 మంది ఉన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా సర్కారు పాఠశాలల్లో విద్యను అందించడానికి పకడ్బందీగా విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. కానీ జిల్లాలోని చాలా వరకు స్కూల్స్‌లో పాటించడం లేదు. విద్యాబోధనతో పాటు యాక్టివిటీలకు ప్రాధాన్యతనిస్తూ విద్యా సంవత్సరంలో పాఠశాలలు 230 పని దినాలను నిర్ణయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సిలబస్ పూర్తిచేయడానికి గడువు పెట్టింది. ప్రతిరోజు పాఠశాలకు విద్యార్థులు 90శాతం హాజరయ్యేలా ఉపాధ్యాయులు తగిన చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్యను గణనీయంగా పెంచడానికి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి. విద్యార్థులు ఏకాగ్రత పెంచడంతోపాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే దిశగా చర్యలు చేపట్టాలి. ప్రతిరోజు ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలు నిర్వహించాలని క్యాలెండర్లో పేర్కొన్నారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థితో 30నిమిషాల పాటు చదివించాలి. రీడింగ్ యాక్టివిటీలో పాఠ్యపుస్తకాలతో పాటు కథల పుస్తకాలు దినపత్రికలు వంటి వాటిని చదివించాలి. ప్రతినెలా మూడవ శనివారం బ్యాగ్‌లెస్‌డేగా పాటించాలి. కానీ అకాడమిక్ క్యాలెండర్‌పై నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ప్రీ ప్రైమరీ బోధన పద్ధతులు ఆసక్తికరంగానే రూపొందిస్తున్నారు.
ఫ ఆటపాటలతో బోధన..
జిల్లాలో నూతనంగా ప్రారంభించనున్న ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో చిన్నారులు ఆకట్ట్టుకునే విధంగా రకరకాల సామగ్రితో ఆటపాటలతో విద్యాబోధన చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఎంపిక చేసిన పాఠశాలలో తరగతి గదులకు రంగులు, అందమైన చిత్రపటాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆట వస్తువులు, బొమ్మలను అందించనున్నారు. అంతేకాకుండా ప్రీ ప్రైమరీ విద్యార్థులకు ప్రభుత్వం ఒక్కోక్క విద్యార్థికి రూ.500 అందజేయనున్నది. రూ.250 స్టేషనరీ, రూ.100 నోటు పుస్తకాలు, రూ.150 చార్టు పేపర్ల కోసం వినియోగించనున్నారు. దీనికి సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ప్రీ ప్రైమరీ నిర్వహణకు ప్రత్యేకంగా కలెక్టర్ నేతృత్వంలో 18నుంచి 40ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఒకరిని ఉపాధ్యాయుడిగా తాత్కాలిక పద్ధతిలో నియమిస్తారు. కనీసం ఇంటర్మీడియట్ పూర్తిచేసి ఉండాలి. మరొకరు ఆయా ఏడవ తరగతి చదివి ఉండాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షణలోనే ప్రీప్రైమరీ కొనసాగుతుంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే స్నాక్స్‌తో పాటు మధ్యాహ్నం భోజనం అందిస్తారు.