సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ విద్య
ABN , Publish Date - Aug 20 , 2025 | 01:25 AM
అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో 34 పాఠశాలలను గుర్తించి వాటిలోకి అంగన్‌వాడీ కేంద్రాలను తరలించి ప్రీ ప్రైమరీ విద్య అందించాలని నిర్ణయించింది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో 34 పాఠశాలలను గుర్తించి వాటిలోకి అంగన్‌వాడీ కేంద్రాలను తరలించి ప్రీ ప్రైమరీ విద్య అందించాలని నిర్ణయించింది. తల్లి పిల్లల ఆరోగ్యంపై దృష్టిసారించి వారికి పోషకాహారం అందిస్తూ పిల్లలకు ఆటపాటలు నేర్పించే అంగన్‌వాడి కేంద్రాలను ప్రీ ప్రైమరీ విద్యను అందించేవిగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రైవేట్ రంగంలో పట్టణాల్లో ప్లే స్కూళ్లు పుట్టుకుని వచ్చి ప్రీ ప్రైమరీ విద్య పేరిట భారీ ఫీజులు వసూలు చేస్తున్నారు. అలాంటి పాఠశాలలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలకు ప్రీ ప్రైమరీ విద్య అందే అవకాశం లేకుండా పోయింది. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ విద్యను అందించే కేంద్రాలుగా మార్చి పిల్లలు పాఠశాలల్లో చేరే వయస్సు వచ్చేవరకు వారిని మానసికంగా పాఠశాలలకు వెళ్లేలా తీర్చిదిద్దాలని భావిస్తోంది. ఈ లక్ష్యంతో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా దీనిని అమలు చేస్తున్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని నాలుగు పాఠశాలలను గుర్తించి వాటిలోకి అంగన్‌వాడి కేంద్రాలను తరలించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.
ఫ జిల్లాలో ఎంపికైన పాఠశాలలు
హుజూరాబాద్ అంగన్‌వాడి ప్రాజెక్టు పరిధిలో ఇల్లందకుంట మండలంలోని వాగొడ్డు రామన్నపల్లి, వీణవంక మండలంలోని దేశాయిపల్లి, తిమ్మాపూర్ మండలంలోని గొల్లపల్లి, గంగాధర మండలంలోని సర్వారెడ్డిపల్లి పాఠశాలలను ఎంపిక చేశారు. మొదట జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న పాఠశాలలను గుర్తించి ఆయా భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించాలని నిర్ణయించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సమీపంలో ఉండే పాఠశాలలను గుర్తించి అక్కడికే తరలించనున్నారు. భాగంగానే జిల్లాలోని ఈ నాలుగు పాఠశాలలను గుర్తించి ఆయా గ్రామాల్లో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను తరలించనున్నారు.
ఫ పాఠశాల భవనాలను సద్వినియోగం చేసుకునే దిశగా..
వాగొడ్డురామన్నపల్లి అంగన్‌వాడి కేంద్రంలో 28 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులెవరూ లేక పాఠశాల మూతపడింది. దానికి ప్రస్తుతం ప్రీ ప్రైమరీ విద్యను అందించే అంగన్‌వాడీ కేంద్రాన్ని తరలించనున్నారు. వీణవంక మండలం దేశాయిపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఏడుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. వారికి కూడా బోధించేందుకు రెగ్యులర్ ఉపాధ్యాయులెవరు లేకపోవడంతో ఎంఈవో డిప్యూటేషన్‌పై రోజు ఒక ఉపాధ్యాయుడిని అక్కడికి పంపిస్తున్నారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 28 మంది విద్యార్థులకు ప్రీ ప్రైమరీ విద్యను అందించాలని నిర్ణయించారు. తిమ్మాపూర్ మండలం గొల్లపల్లిలో ఉన్న ప్రాథమిక పాఠశాల విద్యార్థులు లేక మూతపడింది. ఆ గ్రామంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని పాఠశాలకు తరలించనున్నారు. ఈ కేంద్రంలో 10 మంది విద్యార్థులు ఉన్నారు. గంగాధర మండలంలోని సర్వారెడ్డిపల్లి పాఠశాల విద్యార్థులు లేక మూతపడింది. ఆ గ్రామంలో కూడా 10 మంది పిల్లలతో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని పాఠశాలకు తరలిస్తున్నారు. ఈ చర్యలతో ఖాళీగా ఉన్న పాఠశాలల భవనాలు ఉపయోగంలోకి వస్తాయి. చిన్నారులకు సౌకర్యాలు సమకూరుతాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన అంగన్‌వాడీ కేంద్రాల్లో వచ్చే ఫలితాలనుబట్టి అన్ని భవిష్యత్తులో చర్యలు తీసుకుంటారు.