ధాన్యం కొనుగోలుకు సన్నద్ధం
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:51 AM
జిల్లాలో వానాకాలం సీజన్‌లో సాగైన వరిలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాలో వానాకాలం సీజన్‌లో సాగైన వరిలో 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో సన్న రకం 3.30 మెట్రిక్ టన్నులు, దొడ్డురకం 70వేలు కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. ధాన్యం కొనుగో లుకు జిల్లా వ్యాప్తంగా 334 కేంద్రాలను ఏర్పాటు చేస్తు న్నారు. అత్యధికంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 246 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 85, హాకా ద్వారా 3 కేంద్రాలనుఏర్పాటు చేస్తున్నారు. వానా కాలం సీజన్‌లో 2,10,046 ఎకరాల్లో రైతులు వరి పం డిస్తున్నారు. ఇందులో సన్న రకం 1,89,945 ఎకరాల్లో, దొడ్డు రకం 20,101 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. మొత్తం సాగులో 90.43 శాతం సన్నరకం పంటనే సాగు చేయడం గమనార్హం. గతేడాది వానాకాలం సీజన్ కంటే సన్నరకం పంట 23 వేల ఎకరాల్లో అద నంగా సాగు చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కోత ఆధారంగా కేంద్రాలను ఆరం భించాలని నిర్ణయించారు. ఈ కేంద్రాల్లో మద్దతు ధర లకు ధాన్యాన్ని విక్రయించనున్నారు. కామన్ రకం ధాన్యం క్వింటాలుకు రూ.2,369, ఫైన్ రకం ధర 2,389 రూపాయలుగా నిర్ణయించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, తేమ 17 శాతానికి మించకుండా తీసుక వచ్చిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించనున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు, తేమ కొలిచే యంత్రాలు, వేయింగ్ మెషిన్లు, టార్ఫాలిన్లు సిద్ధం చేస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని, టెంట్లు, కుర్చీలు వేయాలని, రోజుకు 10 వేల నుంచి 12 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆ మేరకు కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ధాన్యంలో తాలు పేరిట కోతలు విధిస్తే కఠినచర్యలు తీసుకుంటామని, కేంద్రాల్లో తూకం వేసిన వెంటనే రైతులకు తక్ పట్టీలు అందజేయాలని సూచిస్తున్నారు.
ఫ జిల్లాలో సన్నాల సాగే అధికం..
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ వినియోగదారులకు ఈ ఏడాది ఉగాది పండుగ నుంచి దొడ్డు రకం బియ్యానికి బదులు సన్నరకం బియ్యం ఇస్తుండడంతో సన్నాల సాగు ప్రోత్సహించేందుకు గతేడాది వానాకాలం సీజన్ నుంచి క్వింటాలు ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నది. గత ఏడాది 2,30,899 క్వింటాళ్ల సన్న రకం ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించారు. దీంతో బోనస్ రూపేణా రైతులకు 115 కోట్ల 44 లక్షల 95 వేల రూపాయల బోనస్ పొందారు. అలాగే యాసంగి సీజన్‌లోనూ రైతులు సన్న రకాలను సాగు చేశారు. 79,345 క్వింటాళ్ల ధాన్యాన్ని కేంద్రాల్లో రైతులు విక్రయించగా, వారికి రావాల్సిన 39 కోట్ల 67 లక్షల 25 వేల 500 రూపాయల బోనస్ రావాల్సి ఉంది. ఈ సీజన్‌లో సన్న రకం పంట దిగుబడులు సుమారు 45.58 లక్షల క్వింటాళ్లు వస్తుందని వ్యవసాయ, మార్కె టింగ్ శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. రైతుల ఆహార అవసరాలకు, విత్తనోత్పత్తికి పోనూ 30.30 లక్షల క్వింటాళ్ల ధాన్యం కేంద్రాలకు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అంతే మొత్తంలో వస్తే మాత్రం ప్రభుత్వం 151 కోట్ల 50 లక్షల రూపాయల బోనస్ చెల్లించాల్సి వస్తుంది. కేంద్రాల్లో రైతులు ధాన్యా న్ని విక్రయించిన 48 గంటల నుంచి 72 గంటల్లోగా వారి ఖాతాల్లో డబ్బులతోపాటు బోనస్ డబ్బులను చెల్లిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
ఫ జిల్లాలో మొదలైన వరి కోతలు..
జిల్లాలో వారం రోజుల క్రితం నుంచే వరి కోతలు ఆరంభమయ్యాయి. వ్యవసాయ బావుల కింద సాగు చేసిన పంట కోతకు రాగా, రైతులు పంట కోసి ఆర బెడుతున్నారు. ఎస్సారెస్పీ ఆయకట్టు భూముల్లో వేసిన పంట కోతకు రావడానికి మరింత సమయం పట్టను న్నది. నవంబర్ మొదటి వారంలో వరి కోతలు ముమ్మ రం కానున్నాయి. కోతలను బట్టి కేంద్రాలను ఆరం భించనున్నారు. రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటిస్తుండడంతో రైతులు ఆందోళన చెం దుతున్నారు. ఈ సీజన్‌లో వరి కోసిన వెంటనే 17 శాతంలోపు తేమ రాదు. కనీసం నాలుగైదు రోజులు ఆరబెడితే గానీ తేమ రాదని రైతులు చెబుతున్నారు. ధాన్యాన్ని ఆరబోసేందుకు స్థలం లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
ఫ ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దు..
- ముప్పిడి శ్రీకాంత్‌రెడ్డి, డీఎం సివిల్ సప్లయ్, పెద్దపల్లి
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధరలు పొం దాలి. దళారులకు విక్రయించి నష్టపోవద్దు. సన్న రకం ధాన్యానికి 500 బోనస్ ప్రభుత్వం ఇస్తుంది. జిల్లాలో 4 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఆ మేరకు 334 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రైతులకు ఇబ్బందులు లేకుండా కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నాం.