Share News

సర్వేకు సన్నద్ధం..

ABN , Publish Date - Nov 16 , 2025 | 01:10 AM

జిల్లాలోని చిన్న నీటి వనరుల లెక్కింపునకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి లెక్కించాల్సిన నీటి వనరుల గణన కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఆరవ జాతీయ జల వనరుల గణనను నిర్వహించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

సర్వేకు సన్నద్ధం..

- జిల్లాలో జల వనరుల గణనకు కసరత్తు

- తేలనున్న చెరువులు, కుంటలు, వ్యవసాయ బావుల లెక్క

- రేపటి నుంచి నెల రోజుల పాటు కొనసాగనున్న ప్రక్రియ

- సమగ్ర వివరాలు యాప్‌లో నమోదు

జగిత్యాల, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని చిన్న నీటి వనరుల లెక్కింపునకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి లెక్కించాల్సిన నీటి వనరుల గణన కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఆరవ జాతీయ జల వనరుల గణనను నిర్వహించడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. ఈనెల 17 నుంచి ఈ ప్రక్రియ మొదలు కానుంది. భారత ప్రభుత్వ పరిధిలోని జలశక్తి కార్యక్రమంలో భాగంగా జల గణన చేపడుతున్నారు. మ్యానువల్‌ పద్ధతిలో నీటి వనరులను లెక్కపెట్టి ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదు చేస్తారు.

ఫబావులు, చెరువులు, కుంటల గణన..

భారత ప్రభుత్వ పరిధిలోని జలశక్తి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి చిన్న నీటి వనరులను లెక్కించాల్సి ఉంటుంది. అయితే పలు కారణాల వల్ల ఇరవై సంవత్సరాలుగా జల వనరుల గణన జరగలేదని సంబంధిత అధికార వర్గాలు అంటున్నాయి. ఈనెల 17 నుంచి చేపట్టేందుకు సీపీవో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా గొట్టపు బావులు, ఓపెన్‌ బావులు, చెరువులు, చిన్నపాటి కుంటలు, 2 వేల హెక్టార్లలోపు భూమికి సాగునీరు అందించే మినీ ప్రాజెక్టులను లెక్కించనున్నారు. అధికారులు వీటన్నింటి వివరాలను నమోదు చేసి ప్రభుత్వానికి అందిస్తారు. ఈ గణన ద్వారా ఏయే గ్రామంలో ఎన్ని నీటి వనరులు ఉన్నాయనే విషయంతో పాటు గ్రామాల్లో నీటి లభ్యత ఎలా ఉందనే అంశం వెలుగులోకి రానుంది. గణన వివరాలను కేంద్ర జలశక్తి శాఖకు అందించనున్నారు. అధికారులు అందించిన ఈ నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం భవిష్యత్‌లో రాష్ట్ర నీటి వనరుల రంగానికి వివిధ స్కీంల కింద ఆర్థిక సహకారం అందించనుంది.

ఫసిబ్బందికి శిక్షణకు ఏర్పాట్లు..

జిల్లాలో చిన్న నీటి వనరుల గణన కోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. మండల స్థాయిలోనే అధికారులకు శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. చీఫ్‌ ప్లానింగ్‌ అధికారి (సీపీవో) శాఖకు చెందిన వారు కాకుండా రెవెన్యూ, ఇరిగేషన్‌ శాఖల అధికారులకు సైతం ఈ గణన ప్రక్రియను పర్యవేక్షించేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ చైర్మన్‌గా, సీపీవో కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. గ్రామ పరిపాలన అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఫీల్డ్‌ టెక్నీషయన్లు చిన్న నీటి వనరుల గణనను చేపట్టనున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది నిర్వహించే నీటి వనరుల గణన వివరాలను ప్రతిరోజు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. అనంతరం వాటిని ఉన్నతాధికారులకు అందించనున్నారు.

ఫజిల్లాలో 60 వేలకు పైగా...

జిల్లాలో గతంలో చేపట్టిన నీటి వనరుల గణన ప్రకారం వ్యవసాయ బోర్లు, బావులు, చెరువులు, కుంటలు అన్ని కలిపి సుమారు 60 వేలకు పైగా ఉన్నట్లు అధికారులు అంటున్నారు. ప్రస్తుతం నీటి వనరుల లెక్కలు తేల్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మండల స్థాయిలో సిబ్బందికి శిక్షణ పూర్తయిన వెంటనే క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంతో పోలిస్తే ఈ ఐదేళ్లలో బోరుబావుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. సాగునీటి రంగానికి ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడంతో పాటు రైతులు విద్యుత్‌ కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే మంజూరు చేస్తున్నారు. గతంలో మాదిరిగా బావులను తవ్వకుండా బోరు బావుల ఆధారంగా వ్యవసాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు బోరుబావులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఈసారి బావుల సంఖ్య తగ్గి, బోరు బావుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

గణనకు ఏర్పాట్లు చేశాం

-గుగ్గిళ్ల సత్యం, చీఫ్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌, జగిత్యాల

చిన్న నీటి వనరుల గణన గురువారం నుంచి జిల్లాలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇందుకు సంబందించి మూడు రోజులు పాటు సిబ్బందికి శిక్షణ అందించనున్నాం. నెల రోజుల్లో నీటి వనరుల గణన పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం.

Updated Date - Nov 16 , 2025 | 01:10 AM