పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు
ABN , Publish Date - Aug 27 , 2025 | 01:14 AM
రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల్లోగానే గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిపించేందుకు సన్నద్ధమవుతున్నది.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల్లోగానే గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిపించేందుకు సన్నద్ధమవుతున్నది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీల ఓటర్ల జాబితాలను పబ్లిష్ చేసేందుకు షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబరు 2న ఓటర్ల తుది జాబితా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోగా ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అవుతుందని, సెప్టెంబరు నెలాఖరుకు ఎన్నికలు పూర్తవుతాయని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబరు నెలాఖరుకు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశించిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం అందుకు సన్నాహాలు ప్రారంభించాయి.
26 వరకు ఓటరు జాబితాలు సిద్ధం
కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని నిర్ణయించి ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. గవర్నర్ ఆమోదానికి ఆర్డినెన్స్‌ను పంపించగా ఆయన దానిని రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. ఆ వ్యవహారం పెండింగ్‌లో ఉండగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ నెల 26 వరకు గ్రామ పంచాయతీల ఓటరు జాబితాలను సిద్ధం చేసేందుకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 28న ఆయా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో గ్రామ పంచాయతీలకు చెందిన ఫోటోలతో కూడిన ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని ఆదేశించింది. 29న జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అథారిటీ, 30న మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలు స్వీకరించేందుకు ఈనె 28 నుంచి 30వ తేదీ వరకు అవకాశం కల్పించారు. 31న జిల్లా పంచాయతీ అధికారి ఆ అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరిస్తారు. సెప్టెంబరు 2న జిల్లా పంచాయతీ అధికారి ఆయా గ్రామ పంచాయతీల తుది ఓటరు జాబితాలను పంచాయతీలలో ప్రదర్శిస్తారు. ఏడు రోజుల్లోనే ఓటర్ల జాబితాలు సిద్ధం అయ్యే అవకాశం ఉండడంతో ఆ వెనువెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఇస్తుందని భావిస్తున్నారు. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల కాగానే రాజకీయ పార్టీల్లో మళ్లీ ఎన్నికల కలకలం ప్రారంభమయింది. ఆయా పంచాయతీల్లో, వార్డుల్లో పోటీ చేయాలని ఆసక్తి చూపిస్తున్నవారు తమ తమ పార్టీలకు చెందిన ముఖ్య నేతలను, తమ గ్రామంలోని పలువురిని కలుస్తూ తాము పోటీ చేసే విషయాన్ని తెలిపి మద్దతు కోరడం ప్రారంభించారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీల ఎన్నికలు బీసీల రిజర్వేషన్ల వ్యవహారం కొలిక్కి వచ్చిన తర్వాత నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు.