స్థానిక ఎన్నికలకు సన్నద్ధం
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:05 AM
ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను మంగళవారం అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను మంగళవారం అన్ని గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. జిల్లాలోని 13 గ్రామీణ మండలాల్లోని 263 గ్రామ పంచాయతీల్లో 2432 వార్డులు, 2432 పోలింగ్ బూతులను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 4,04,181 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 1,98,728 మంది, స్త్రీలు 2,05,439 మంది, ఇతరులు 14 మంది ఉన్నట్లు ప్రకటించారు. ముసాయిదా జాబితాతో పోలిస్తే 28 ఓట్లు తగ్గాయి, పురుషులు 16 మంది, స్త్రీలు 12 మంది ఓట్లు తగ్గాయి.
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి కూడా ఓటర్ల తుది జాబాతాను ఈనెల 6వ తేదీన ముసాయిదా ప్రకటించి, అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ఈ నెల 10వ తేదీన తుది జాబితాను వెల్లడించనున్నారు. ఈ నెలాఖరు వరకు స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ ఎన్నికల నిర్వహణకు ప్రధాన సమస్య బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయమై అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు, 2018 పంచాయతీరాజ్ చట్టం, 2019 పురపా లక చట్టాలను సవరించి ఆర్డినెన్స్‌లను రాష్ట్ర గవర్నర్ పంపించగా, అక్కడి నుంచి రాష్ట్రపతికి పంపించారు. ఆ బిల్లులపై ఎటూ తేలక పోవడంతో ఎన్నికలు జాప్యం అవుతున్నాయి. చివరకు ప్రభుత్వం ఈ నెల 1వ తేదీన నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని తొలగించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు సభ అమోదం పొందింది. దీనిపై ప్రభుత్వం జీవో విడుదల చేయనున్నది. ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్నది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా అందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ముందుగా గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఏవైనా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలైతే రెండు, మూడు విడతల్లో నిర్వహించ నున్నారు. గతంలో జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలను నిర్వహించారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను మాత్రం ఒకే విడతలో చేపట్టనున్నారు.
ఫ మండలాల వారీగా పంచాయతీ ఓటర్ల తుది జాబితా..
క్ర.సం. మండలం పంచాయతీలు వార్డులు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
----------------------------
1. అంతర్గాం 15 132 8807 9122 1 17930
2. ధర్మారం 29 266 21483 22210 4 43697
3. ఎలిగేడు 12 114 9088 9481 1 18570
4. జూలపల్లి 13 130 11977 12186 0 24163
5. కమాన్‌పూర్ 9 92 9875 10270 0 20145
6. మంథని 35 282 17040 17929 4 34973
7. ముత్తారం 15 138 11328 11868 1 23197
8. ఓదెల 22 198 17588 18219 0 35807
9. పాలకుర్తి 16 156 13934 14184 0 28118
10. పెద్దపల్లి 30 294 24989 25996 1 50986
11. రామగిరి 16 158 16167 16406 1 32574
12. శ్రీరాంపూర్ 24 226 17225 17595 1 34821
13. సుల్తానాబాద్ 27 246 19227 19973 0 39200
---------------------------------------------------------------------------------------------------------- మొత్తం 263 2432 198728 205439 14 404181
----------------------------------------------------------------------------------------------------------